క్యాన్సర్ కేసుల లెక్కలు తేలాల్సిందే..
x

క్యాన్సర్ కేసుల లెక్కలు తేలాల్సిందే..

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ క్లినిక్‌లు, డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు, ప్యాలియేటివ్, జెరియాట్రిక్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన మంత్రి దామోదర రాజనరసింహ.


క్యాన్సర్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లూ లెక్కాపత్తా లేనట్లు ఉన్న క్యాన్సర్ కేసుల లెక్క తేల్చే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఆసుపత్రి, ల్యాబ్‌ను డేటాను ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన, వస్తున్న క్యాన్సర్ కేసుల లెక్కలు తేలాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ కేన్సర్‌ను ఒక సాధారణ వ్యాధిగా పరిగణించినా, ఇక ముందు ఇది కుదరని స్పష్టం చేసింది. ఏ ఆసుపత్రిలో అయినా కేన్సర్ వ్యాధి నిర్ధారితమైతే దానిని అధికారిక లెక్కల్లో చేర్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్‌ను నోటిఫైడ్ డిసీజ్‌గా గుర్తింపు కొత్త జీఓను తీసుకొచ్చింది. జీఓ నెం.17 ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఆసుపత్రి, ల్యాబ్‌లో క్యాన్సర్ కేసు నిర్ధారణ జరిగినా దానిని వెంటనే ప్రభుత్వానికి నివేదించాలి. ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదని సర్కార్ పేర్కొంది. ఇలా చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి ఏ ప్రాంతంలో ఎలా ఉంది? ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా సోకుతోంది? ఏ వయసు వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది? ఎటువంటి జీవన శైలి క్యాన్సర్‌కు కారణముతుంది? వంటి అనేక విషయాలను తెలుసుకోవడం సులభతరం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ వివరాలు తెలియడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని కట్టడి చేయడం వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. క్యాన్సర్ కేసులకు సంబంధించి వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన అధికారిక పోర్టల్‌లో ఉంచుతారు. కేసు నిర్ధారణ అయిన నెల రోజుల్లోగా వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ సంస్థ అలసత్వంగా వ్యవహరించిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎప్పటికప్పుడు డేటా సేకరించాలి..

ప్రతి ఆసుపత్రి, ల్యాబ్ కూడా క్యాన్సర్‌కు ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలని, కేసు నిర్ధారణ అవుతూనే దానికి సంబంధించిన డాటాను పోర్టల్‌లో పొందుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ పోర్టల్‌లో డేటాను అప్‌లోడ్ చేయడానికి ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆసుపత్రులకు ప్రత్యేక ఐడీని కేటాయించనున్నామని, ఈ జాబితాలో లేని సంస్థలు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నోడల్ సెంటర్‌గా ఎంఎన్‌జే

హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రిని నోడల్ సెంటర్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రతి జిల్లా నుంచి వచ్చే క్యాన్సర్ కేసుల డేటాను ఇక్కడి అధికారులు పరిశీలించి స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీని రెడీ చేస్తారు. ఆ తర్వాత ఆ డేటాను జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీకి జోడిస్తారు. ఈ డాటా ఆధారంగా రానున్న కాలంలా వ్యాధి నివారణ చర్యలు, స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స సౌకర్యాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

పోర్టల్ విడుదల చేసిన మంత్రి

తెలంగాణలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా రవీంద్ర భారతి వేదికగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, శాస్త్రీయ ఆధారాలతో ఆరోగ్య సేవలు మెరుగుపరచడం అవసరమని తెలిపారు. ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు అని వివరించారు. కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు సేవలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండ, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ, చికిత్స, పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ క్లినిక్‌లు, డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు, ప్యాలియేటివ్, జెరియాట్రిక్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

డయాలసిస్ కోసం 79 కొత్త కేంద్రాలు, ప్రతి 35 కిలోమీటర్లకు 109 ట్రామా కేర్ కేంద్రాలు రూ.1,100 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంబులెన్స్ సేవల్లో 213 కొత్త వాహనాలు చేర్చి 10 నిమిషాల్లో స్పందించే లక్ష్యాన్ని నిర్దేశించారు. క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించి డేటా సేకరణకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. నిమ్స్‌లో లీనాక్ సేవలు, ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ప్రణాళిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై పరిశీలన కొనసాగుతోందన్నారు. ఆస్ట్రాజెనెకాతో కలిసి 20 ఆసుపత్రుల్లో లంగ్ క్యాన్సర్ ముందస్తు గుర్తింపు ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ప్రతి పౌరుడికి ఆరోగ్య ప్రొఫైల్, 46 లక్షల మహిళలకు ఉచిత పరీక్షలు, డిజిటల్ పోర్టల్స్, ఆరోగ్యశ్రీ విస్తరణ, ఉద్యోగులు–పెన్షనర్లకు కొత్త పథకం అమలు జరుగుతున్నట్లు తెలిపారు. టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, 10 వేల ఉద్యోగాలు భర్తీ చేసి మరో 7 వేల నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు.

నోటిఫయిడ్ డీసీస్ అంటే ఏంటి?

ఏదైనా ఒక వ్యాధికి సంబంధించి నిర్దారణ అయితే ఆ డేటాను ప్రభుత్వ ఆరోగ్య అధికారులకు తప్పనిసరిగా నివేదించాల్సిన వ్యాధులను నోటిఫయబుల్ డిసీజ్ అంటారు. సాధారణంగా మలేరియా, డెంగ్యూ, ఫైలేరియాసిస్, చికెన్‌గున్యా వంటివి ఈ జాబితాలో ఉంటాయి. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్‌ను కూడా జోడించింది.

పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు

అందుబాటులోని సమాచారం ప్రకారం ప్రతిఏడాది తెలంగాణలో సగటున సుమారు 54 వేల కేసులు నమోదవుతున్నాయి. గడచిన 10 ఏళ్ళల్లో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయనే చెప్పాలి. 2015లో 40 వేల కేసులు నమోదైతే, 2020లో 47,620 కేసులు నమోదయ్యాయి. 2023లో 51,145 కేసులు నమోదవ్వగా, 2024లో 52,334 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 2025లో సుమారు 55వేల కేసులు నమోదైనట్లు సమాచారం. రాష్ట్రం మొత్తంమీద క్యాన్సర్ కేసులు ఎక్కువగా హైదరాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. తర్వాత రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, నల్గొండ జిల్లాల్లో నమోదవుతున్నాయి. 33 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ క్యాన్సర్ రోగాలు నమోదవ్వటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే వేగంగా మారిపోతున్న జనాల జీవనశైలి.

క్యాన్సర్‌కు కారణాలు అవే..

క్యాన్సర్ వంటి వ్యాధుల తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం జీవనవైలి, పరిశ్రమల కాలుష్యమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లోని ప్రజలు పరిశ్రమల కాలుష్యాల మధ్యే జీవనం కొనసాగిస్తున్నారని, దానికి తోడు ఆ పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్య గాలిని 24 గంటలూ పీలుస్తూ ఉండటం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలు తమ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలను అక్కడే ఉండే చెరువులు, కాల్వల్లోకి విడుదల చేస్తున్నాయని, ఆ నీటిని తాగడం వల్ల ప్రజల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు. నగరంలోని జనాలు ఎక్కువగా వాతావరణ కాలుష్యానికి గురవుతుండటం, డ్రింక్స్, సిగిరెట్లు విపరీతంగా తీసుకుంటుండటం, ఉద్యోగాల కారణంగా రాత్రుళ్ళు మేల్కొన్నపుడు అర్ధరాత్రుళ్ళు లేదా తెల్లవారిజామున మసాలలతో కూడిన భోజనాలు ఎక్కువగా తింటుండటం, నిద్రలేమి, టెన్షన్లు ఎక్కువైపోతున్న నేపధ్యంలో క్యాన్సర్ రోగానికి హైదరాబాదులోని జనాలే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.

Read More
Next Story