
తెలంగాణలో ఇకనుండి ‘వాహన్’ లోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్
పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కూడా శనివారం నుండి వాహన్ పోర్టల్ ద్వారానే తీసుకునేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను రవాణాశాఖ ఉన్నతాధికారులు సిద్దంచేశారు
తెలంగాణ రవాణాశాఖ కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. అదేమిటంటే శనివారం నుండి ‘వాహన్ పోర్టల్’ ద్వారానే పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు జారీ చేయబోతోంది. టెంపరరీ రిజిస్ట్రేషన్ కోసం వాహనయజమానులు రవాణాశాఖ చుట్టూ తిరగటం ఇప్పటికే నిలిపేశారు. అలాంటిది పర్మినెంట్ రిజిస్ట్రేషన్ జారీని కూడా శనివారం నుండి వాహన్ పోర్టల్ ద్వారానే తీసుకునేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను రవాణాశాఖ ఉన్నతాధికారులు సిద్దంచేశారు. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. మార్చి 23వ తేదీన కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాహన్ పోర్టల్ లోకి తెలంగాణ ప్రభుత్వం కూడా చేరిన విషయం తెలిసిందే. వాహన్ పోర్టల్ లోకి తెలంగాణ కూడా చేరిన కారణంగా వాహనాల యజమానులకు అనేక వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇందులో భాగమే తాజాగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం వాహన యజమానులు రవాణాశాఖ చుట్టు తిరగాల్సిన అవసరం ఉండకపోవటం. వాహనం కొనుగోలు చేసేటపుడు టెంపరరీ రిజిస్ట్రేషన్ ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు కొత్త అప్‌డేట్ ఏమిటంటే వాహనాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పర్మినెంట్ నెంబర్ కూడా కేటాయించేలా అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఉన్నతాధికారులు డెవలప్ చేశారు. వాహనాల కొనుగోలు, టెంపరరీ రిజిస్ట్రేషన్, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ జారీచేయటం, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ కేటాయింపు లాంటి అనేక వ్యవహరాల్లో పాదర్శకత పాటించటంతో పాటు దళారుల వ్యవస్ధను లేకుండా చేయటం వాహన్ పోర్టల్ లో సాధ్యమవుతుందని రవాణాశాఖ భావిస్తోంది.
వాహన్ పోర్టల్ లో తెలంగాణ చేరినప్పటినుండి శుక్రవారం వరకు సుమారు 34 వేల వాహనాలకు వాహన్ పోర్టల్ లో టెంపరరీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యిమంది డీలర్లకు ఆన్ లైన్, ఆఫ్‌లైన్ పద్దతిలో వాహన్ పోర్టల్ నిర్వహణపై రవాణాశాఖ శిక్షణిచ్చింది. ఇప్పటికే 671మంది డీలర్లు పోర్టల్ లో నమోదుచేసుకోగా మిగిలిన 346 మంది డీలర్ల మంది డీలర్లు ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్లను పూర్తిచేసుకున్నారు. దీనివల్ల షోరూముల్లోనే వాహనాల టెంపరరీ, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చాలా వేగంగా పూర్తయిపోతాయి. వాహన్ పోర్టల్ పూర్తిస్ధాయిలో పనిచేయటం ప్రారంభిస్తే కాని దాని ప్రభావం అందరికీ తెలీదు.

