
సిరిసిల్ల చేనేతపై తెలంగాణ గవర్నర్ దృష్టి
గవర్నరుతో సిరిసిల్ల చేనేత కార్మికుడి భేటి
సిరిసిల్ల చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ శివప్రకాష్ శుక్లా దృష్టి సారించనున్నారు. సిరిసిల్ల నేత పరిశ్రమ, అక్కడి కార్మికుల పరిస్థితిని తెలుసుకునేందుకు త్వరలో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని గవర్నర్ శివ ప్రకాష్ శుక్లా చెప్పారు. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేత పరిశ్రమ గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు మేలు జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
మరమగ్గం జ్ఞాపిక బహూకరణ
అగ్గి పెట్టేలో ఇమిడే చీర, జీ 20 లోగో నేసి ప్రధాని మోదీ చేత ప్రశంసలు పొందిన హరిప్రసాద్ ను గవర్నర్ శివప్రకాష్ శుక్లా సత్కరించారు. చేనేత రంగంలో హరిప్రసాద్ చేసిన ప్రయోగాలను అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రకాష్ శుక్లాకు వెదురుతో చేసిన సిరిసిల్ల మరమగ్గం జ్ఞాపికను హరిప్రసాద్ బహుకరించారు.
సిరిసిల్ల చేనేత రంగంపై గవర్నర్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల కార్మికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో జరగనున్న పర్యటనతో సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
Next Story

