
గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి
గౌరవెల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముగ్గురు జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఇరిగేషన్ అధికారులతో సమావేశం జరిపి ప్రాజెక్టు సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ప్రాధాన్యతగా భూసేకరణ, నిధుల విడుదల, న్యాయపరమైన ఇబ్బందులపై చర్చ జరిగింది.
భూసేకరణను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న ఎన్విరాన్మెంట్ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, ఈ కేసులో ప్రభుత్వం విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు మాత్రమే కాకుండా, దేవాదుల ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి చేరేలా పెండింగ్‌లో ఉన్న కాల్వల పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలని మంత్రి భరోసా ఇచ్చారు.
సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లను సమన్వయంతో వ్యవహరించమని, భూసేకరణలో జాప్యం రావకుండా చూడమని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి నిర్ణీత కాలపరిమితిలో పనులు ముగిసేలా ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలు ప్రధానంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

