
తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కీలక శాఖలకు కార్యదర్శులను నియమించింది.
తెలంగాణ పాలనా యంత్రాంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ భారీ కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో పలు కీలక శాఖల కార్యదర్శులతో పాటు జిల్లా కలెక్టర్లు పెద్ద సంఖ్యలో మారారు. రాష్ట్రస్థాయిలో కీలకమైన విభాగాలకు కొత్త సారథులను ప్రభుత్వం ఖరారు చేసింది.
రాహుల్ బొజ్జా: సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీనితో పాటు బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. సంజయ్ కుమార్: పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. దాన కిషోర్: విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఎన్. శ్రీధర్: ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ. శ్రీధర్: ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
గౌరవ్ ఉప్పల్: ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
జిల్లాల పాలనలోనూ ప్రభుత్వం భారీ మార్పులు చేసింది.
కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా, హనుమకొండకు చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అనికేత్ నియమితులయ్యారు.
యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా, జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, మహబూబాబాద్‌కు స్నేహ శబరీష్, నారాయణపేట కలెక్టర్‌గా ప్రదీప్ జైన్ నియమితులయ్యారు.
ఇతర ప్రధాన నియామకాలు
విద్యుత్ సహా ఇతర విభాగాల్లోనూ మార్పులు జరిగాయి. ముష్రఫ్ అలీ ఫారూఖీ కొత్త డిస్కం సీఎండీగా, జితేష్ వి. పాటిల్ టీఎస్‌జీపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఎం. హనుమంతరావు, ప్రజావాణి నోడల్ అధికారిగా డి. దివ్య, లేబర్ కమిషనర్‌గా పమేలా సత్పతి నియమితులయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాకు రిజ్వాన్ బాషా షేక్ కలెక్టర్‌గా వెళ్తుండగా, అద్వైత్ కుమార్ సింగ్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. పాలనలో మరింత వేగం పెంచేందుకే ప్రభుత్వం ఈ భారీ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.

