మందుబాబులకు గుడ్ న్యూస్.. హైకోర్టు కీలక ఆదేశాలు..
x

మందుబాబులకు గుడ్ న్యూస్.. హైకోర్టు కీలక ఆదేశాలు..

తాగి డ్రైవింగ్ కేసుల్లో వాహనాన్ని స్వయంగా సీజ్ చేయలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 2021 మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశం.


తెలంగాణ మందుబాబులకు హైకోర్టు తీపు కబురు చెప్పింది. డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడితే వాళ్ల బండ్లను పోలీసులు సీజ్ చేయకూడదంతో ఒక కేసు విచారణలో హైకోర్టు స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్ కొనసాగించకుండా ఆపే అధికారం మాత్రం పోలీసులకు ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, ఏప్రిల్ 9న హైకోర్టు ఒక కీలక ఉత్తర్వు జారీ చేసింది. గతంలో తీసుకున్న నిర్ణయాలను మరోసారి గుర్తు చేస్తూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. మహీంద్రా XUV500 వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన ఘటనలో వాహన యజమాని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఈ కేసు విచారణలో భాగంగానే హైకోర్టు 2021లో జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. వాటి ప్రకారం, డ్రైవర్ మద్యం సేవించి ఉంటే, అదే వాహనంలో మరో వ్యక్తి శాంతంగా ఉండి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే, ఆ వ్యక్తికి వాహనం నడపడానికి అనుమతి ఇవ్వాలని సూచించింది. వాహనంలో అలాంటి వ్యక్తి లేకపోతే, పోలీసులకు తాత్కాలికంగా వాహనాన్ని సురక్షిత స్థలంలో ఉంచే అధికారం ఉందని తెలిపింది. అదే సమయంలో డ్రైవర్ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి సమాచారం ఇవ్వాలని, వాహనాన్ని బాధ్యతగల వ్యక్తికి అప్పగించాలనే విధానం ఉండాలని పేర్కొంది. వాహనాన్ని అనవసరంగా నిరవధికంగా నిలిపివేయరాదని స్పష్టం చేసింది.

ఈ కేసు ఒక వాహన యజమాని హైకోర్టును ఆశ్రయించడంతో ప్రారంభమైంది. ఆయన మహీంద్రా XUV500 వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. యజమాని తరఫు వాదనలో, పోలీసులు చేసిన సీజ్ కోర్టు గత తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు పోలీసు శాఖ వాదనలో, డ్రైవర్‌పై గతంలో కూడా డ్రంక్ డ్రైవింగ్ కేసులు ఉన్నాయని, వాహన యజమానికి అతని ప్రవర్తనపై అవగాహన ఉందని తెలిపారు.

ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు, ఈ అంశంపై ఇప్పటికే స్పష్టమైన తీర్పులు ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించిన వ్యక్తిని డ్రైవింగ్ చేయకుండా ఆపవచ్చని, కానీ అదే కారణంతో వాహనాన్ని సీజ్ చేయడానికి అధికారాలు లేవని పునరుద్ఘాటించింది. చివరగా, కేసును 2021 మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలని ఆదేశిస్తూ వ్యవహారాన్ని ముగించింది.

Read More
Next Story