హడలెత్తిస్తున్న తెలంగాణ హెచ్చార్సీ:హక్కుల ఉల్లంఘనలపై సుమోటోగా విచారణ
x
తెలంగాణ మానవ హక్కుల కమిషన్

హడలెత్తిస్తున్న తెలంగాణ హెచ్చార్సీ:హక్కుల ఉల్లంఘనలపై సుమోటోగా విచారణ

మీడియా కథనాలే సాక్ష్యం… 10 నెలల్లో 45 సుమోటో కేసులు


తెలంగాణలో ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగిందంటే… ఇప్పుడు అధికారులు కాస్తా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే మీడియా కథనం వచ్చిన క్షణాల్లోనే రంగంలోకి దిగుతున్నది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. పది నెలల్లోనే 45 సుమోటో కేసులు స్వీకరించి, వేలాది ఫిర్యాదులను నమోదు చేసి, నూరుకుపైగా కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేస్తూ కమిషన్ హడలెత్తిస్తోంది. బాధితులకు భరోసా… వ్యవస్థకు హెచ్చరికగా మారిన ఈ దండయాత్ర తెలంగాణలో మానవ హక్కుల పరిరక్షణకు కొత్త దిశను సూచిస్తోంది.

తెలంగాణలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (టీఎస్ హెచ్చార్సీ) హడలెత్తిస్తోంది. తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు జరిగినపుడు టీవీ చానళ్లు, పత్రికల్లో వచ్చిన కథనాలను తెలంగాణ హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరిస్తోంది.తెలంగాణలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటయ్యాక కేవలం పది నెలల కాలంలోనే 45 కేసులను సుమోటోగా విచారణకు స్వీకరించి సంచలనం రేపింది.
- తెలంగాణలో 2025వ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 4,264 కేసులు నమోదు చేయగా వాటిలో 50 శాతానికి పైగా అంటే 2,625 కేసులను హెచ్చార్సీ పరిష్కరించింది. 2026 వ సంవత్సరంలో కేవలం నెల 13 రోజుల్లోనే 400 కేసులను రిజిస్టర్ చేయగా, ఇందులో 181 కేసులను పరిష్కరించింది. రాష్ట్రంలో ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా వెంటనే హెచ్చార్సీ స్పందించి సంబంధిత అదికారులకు నోటీసులు జారీ చేసింది.

బాధితులకు భరోసా… ప్రభుత్వానికి హెచ్చరికగా హెచ్చార్సీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన పలు హక్కుల ఉల్లంఘన కేసులను హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కు గురవడంపై హెచ్చార్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరక్షిత హైటెన్షన్ విద్యుత్ లైన్లు, ఫెన్సింగ్ లేని ట్రాన్స్ ఫార్మర్లు, భద్రత చర్యలు తీసుకోక పోవడం వల్ల విద్యుత్ ఉద్యోగులు కరెంట్ షాక్ కు గురై మరణిస్తున్న ఘటనలపై హెచ్చార్సీ విచారణకు ఆదేశించింది. రోగులు, గ్రామస్థులు, విద్యార్థులు, నవజాత శిశువులు, కుక్క కాటు ఘటనలు, అంథ విద్యార్థుల వెతలు...ఇలా ఒకటేమిటి పలువురు బాధితుల ఘటనలపై హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది.తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) గట్టిగా స్పందిస్తోంది.

ప్రధాన ఘటనలపై హెచ్చార్సీ దర్యాప్తు

- ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్
- అరక్షిత హైటెన్షన్ లైన్లు, ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లు
- కరెంట్ షాక్ మరణాలు
- నవజాత శిశువుల నిర్లక్ష్య మరణాలు
- అంధ విద్యార్థుల సమస్యలు
- కుక్క కాటు ఘటనలు
- గ్రామీణ ప్రాంతాల్లో వైద్య నిర్లక్ష్యం
సుమోటోగా విచారణకు స్వీకరించిన కేసుల సంఖ్య 45
2025లో మొత్తం నమోదు కేసులు – 4,264
పరిష్కరించిన కేసులు – 2,625 (50శాతం కంటే ఎక్కువ)
2026లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 13 వరకు – 400 కేసులు నమోదు
వాటిలో పరిష్కారం – 181 కేసులు

ప్రేమ వివాహం కేసులో జోక్యం

డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ ఒక ప్రేమ వివాహం కేసులో కీలక జోక్యం చేసుకుంది. గర్భిణీ మహిళను బలవంతంగా గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించారని వచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి, సంబంధిత పోలీసు అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మహిళ స్వచ్ఛంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది.మహిళ స్వచ్ఛంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొన్న హక్కుల కమిషన్. కల్వకుర్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలను తక్షణమే ఫిర్యాదుపై స్పందించి చట్టప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషన్ కోరింది. నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ఆదేశిస్తూ, ఈ విషయంపై 26.02.2026 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
- ఫిబ్రవరి 16 : న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో మార్చి 6వతేదీలోగా నివేదిక అందజేయాలని టీ ఎస్ హెచ్చార్సీ ఛైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. స్నప్నకుమారి తన ప్రాణాలకు ముప్పు ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని 163 మంది న్యాయవాదులు హెచ్చార్సీకి ఫిర్యాదు చేయడంతో తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ హత్యపై డీజీపీ వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది.
- ఫిబ్రవరి 4 : హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బంది లేనందువల్ల విద్యార్థులే స్వీపర్లుగా పనిచేయాల్సి వస్తుందని వచ్చిన వార్తలపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. బాలల సంరక్షణ చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ల ప్రకారం పిల్లలతో ఊడ్చే పనులు చేయించరాదు. పాఠశాలల్లో స్వీపర్లను ఎందుకు నియమించడం లేదని, పిల్లలతో స్వీపింగ్ ఎలా చేపిస్తామరని టీఎస్ హెచ్చార్సీ ప్రశ్నించింది.పిల్లలలో స్వీపింగ్ చేపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, దీనిపై నివేదికను సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా విద్యాశాఖాధికారిని కమిషన్ కోరింది. ఫిబ్రవరి 24వతేదీ లోగా దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది.
- జనవరి 29 : నారాయణగూడలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని వీధికుక్క దాడి చేసి కరిచిందని, ఈ ఘటనపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఫిబ్రవరి 24వతేదీలోగా సమర్పించాలని ఎస్ హెచ్చార్సీ ఆదేశించింది. వీధి కుక్క దాడి ఘటనపై జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించింది.
- ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోని పేద,గిరిజన కుటుంబాల నుంmr మైనర్ బాలికల మానవ అక్రమ రవాణా సంఘటనలపై పత్రికల్లో వచ్చిన వార్తలను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై తెలంగాణ డీజీపీ, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్ల నుంచి వివరణాత్మక నివేదికలను కోరింది.
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఆసుపత్రి బెడ్‌పై సీలింగ్ ఫ్యాన్ పడి నవజాత శిశువు గాయపడిన సంఘటనకు సంబంధించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో మౌలిక సదుపాయాల భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కమిషన్ వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదిలాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి ని ఆదేశించింది.
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కేసుల విచారణ పట్టిక
సంవత్సరం- కేసుల సంఖ్య- డిస్పోజ్ చేసిన కేసుల సంఖ్య
2022 - 5441 - 4391
2023 -2006 -1599
2024 -2247 - 1599
2025 - 4264 - 2625
2026 - 400 - 181
మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా స్పందించే కమిషన్‌గా తెలంగాణ హెచ్చార్సీ పేరు తెచ్చుకుంటోంది. కానీ కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు… బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు వ్యవస్థను కట్టడి చేయడమే అసలు సవాలు.
Read More
Next Story