Telangana High Court
x

గ్రూప్-1 అంశంపై విచారణ పూర్తి.. తుది తీర్పు అప్పుడే!

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.


గ్రూప్-1 పరీక్షల ఫలితాల అంశంపై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును జనవరి 22కు వాయిదా వేసింది. గ్రూప్‌–1 పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు ఉద్యోగులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక కేసును విచారించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసే అంశం కావడంతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది.

టీజీపీఎస్సీ తరఫున వాదనలు

టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే పూర్తి పారదర్శకతతో పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. అదే విధంగా మూల్యాంకనంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు సమాధాన పత్రాలను ఇద్దరి చేత మూల్యాంకనం చేయించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల సంఖ్య పెరగడం, పరిపాలనాపరమైన సౌలభ్యం దృష్ట్యా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశామని చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు. పరీక్షల్లో కాపీయింగ్‌ లేదా ఇతర అక్రమాలపై ఎలాంటి ఆరోపణలు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున వాదనలు

అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది డి. ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్షల్లో అర్హత సాధించలేని కొందరు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు రెండు హాల్‌టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే టీజీపీఎస్సీ వెల్లడించినప్పటికీ, అప్పట్లో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఫలితాలు విడుదలైన తర్వాత పిటిషన్‌ దాఖలు చేయడం చట్టపరంగా చెల్లదని వాదించారు. ఈ నేపథ్యంలో జనవరి 22న న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఎలా ఉండనుందని ఉత్కంఠ నెలకొంది.

Read More
Next Story