మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష
x

మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే ఇందుకు కారణం.


మెదక్ జిల్లా కలెక్టర్ రాజుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్ట్ 6నెలల జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ఈ మేరకు తీర్పునిచ్చారు. భూవివాదానికి సంబంధించి ఒక కేసులో కోర్టు ఆదేశాలను ఆయన తుంగలోతొక్కారన్న ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన కోర్టు దిక్కరణ కేసులో భాగంగానే ఆయనకు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. శిక్షతో పాటు ఆయన రూ.2వేల జరిమానా కూడా విధించింది. ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష పడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.

అసలు కేసు ఏంటంటే?

భూహక్కులకు సంబంధించి గతంలో ఒక మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెగుంట మండలం బోనాల్ గ్రామానికి చెందిన 51 ఏళ్ల నల్లవెల్లి లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌తో ప్రారంభమైంది. తన తాత నుంచి వారసత్వంగా వచ్చిన 2.22 గుంటల భూమిపై తనకు హక్కు ఉందని ఆమె పేర్కొన్నారు. మ్యూటేషన్ అభ్యర్థనను అధికారులు తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 2024 జూన్‌లో హైకోర్టు కలెక్టర్ ఇచ్చిన పూర్వ నిర్ణయాన్ని రద్దు చేసింది. అన్ని సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసి, పారదర్శకంగా కొత్త విచారణ నిర్వహించాలని ఆదేశించింది.

అంతేకాకుండా సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్య పరిష్కారానికి న్యాయస్థానం నిర్ణీత గడువును కూడా ఇచ్చింది. కానీ ఆ గడువులోపు కలెక్టర్ సమస్యను పరిష్కరించలేదు. పైగా పరిష్కారం దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు మహిళ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కలెక్టర్ తన సమస్యను పరిష్కరించకపోవడమే కాకుండా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆమె కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

మండిపడ్డ ఉన్నత న్యాయస్థానం

అయితే 2024 డిసెంబరులో కలెక్టర్ మళ్లీ ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. మహిళ దాఖలు చేసిన కోర్టు దిక్కరణ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం కలెక్టర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డులను పరిశీలించిన కోర్టు, లక్ష్మికి నోటీసు జారీ చేసినట్లు లేదా ఆమెకు వాదనలు వినిపించే అవకాశం ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని గుర్తించింది. ప్రతివాదం తరఫున నోటీసు వాట్సాప్ ద్వారా పంపినట్లు వాదించారు. కానీ ఆ విషయం కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించలేదని కోర్టు గమనించింది.

దీంతో పిటిషనర్‌కు న్యాయమైన వాదన అవకాశం ఇవ్వకుండా మరోసారి కోర్టు ద్వారం తట్టే పరిస్థితి కల్పించారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు తేలడంతో ఇది కోర్టు ధిక్కారణగా పరిగణించి శిక్ష విధించింది.

Read More
Next Story