
హైదరాబాద్ నగరంలో హీట్ వేవ్ హెచ్చరిక
తెలంగాణకు ఎండ దెబ్బ: వర్షాల లోటుతో రైతులకు కష్టకాలం
ఖరీఫ్‌కు షాక్… ఎల్-నినో ప్రభావం… 2026 రుతుపవనాల అంచనా
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎల్-నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 21 జిల్లాల్లో వర్షాల లోటు ఉంటుందని అంచనా వేయడంతో రైతులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితులతో ఖరీఫ్ సీజను నిరాశజనకంగా మారనుందా? అంటే అవునంటున్నారు తెలంగాణ వెదర్ మ్యాన్. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో తెలంగాణలోని 21 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం
ఈ ఏడాది వర్షాకాలంలో 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురుస్తుందని తెలిపారు.
జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలపై అంచనాను తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేశారు.
ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం
బలమైన ఎల్-నినో (El-Nino) ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో సాధారణ స్థాయి నుంచి లోటు వర్షపాతం కలిగిన రుతుపవనాలు రాబోతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.ఈ సంవత్సరం వర్షాకాలంలో 2018వ సంవత్సరం నాటి పరిస్థితులను పోలి ఉంటుందని, వర్షాలు తక్కువగా కురుస్తాయని అంచనా వేశారు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో కురిసినంత భారీ వర్షాలను ఆశించలేమని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.2026 రుతుపవన కాలంలోని జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలపాటు సాధారణ స్థాయికి దిగువన, ఓ మోస్తరుగా మాత్రమే వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఈ సంవత్సరం వర్షాలు 2014-15 నాటి పరిస్థితుల లాగా అత్యంత దారుణంగా ఉండవని, గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగానే ఉంటాయని చెప్పారు. లోటు వర్షపాతం వల్ల రైతులు నీటిని పొదుపుగా వాడుకొని, పంటల సాగు ప్రణాళికను ఈ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకోవాలని కోరారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో 2026 రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా లేదా లోటుగా ఉండే అవకాశం ఉంది. బలమైన ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతంపై అధిక ప్రభావం చూపించవచ్చు.
జూన్ మధ్యలో నైరుతి రుతుపవనాలు
ఎల్ నినో ప్రభావం వల్ల సాధారణంగా భారతదేశంలో వర్షపాతం తగ్గుతుందని, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా లేదా బలహీనంగా ప్రారంభమవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. బహుశా జూన్ మధ్యలో లేదా ఆ తర్వాత మాత్రమే నైరుతి రుతుపవనాలు పుంజుకుంటాయని అంచనా వేశారు. జూన్‌లో దాదాపు సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, జులై-సెప్టెంబర్ నెలల్లో వర్షపాత లోటు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.మే నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు.
స్కైమెట్ అంచనా
ఈ ఏడాది వర్షాకాలంలో పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని స్కైమెట్ వాతావరణశాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు.జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కేరళ, సెంట్రల్ కర్ణాటక, గోవా, కొంకణ్,అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని స్కైమెట్ అంచనా వేసింది. అరుణాచలప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశముందని స్కైమెట్ తెలిపింది.
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోండి
హైదరాబాద్, నిజామాబాద్, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని చాలా భాగాలతో సహా ఇతర ప్రాంతాల్లో మాత్రం సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. లోటు వర్షపాతం వల్ల వరికి బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు లేదా మొక్కజొన్నను ఎంచుకోవాలని వాతావరణశాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. నీటి కొరతను తట్టుకునే పంటలను గానీ, లేదా నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను గానీ సాగుకు ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. వర్షాధార ప్రాంతాల్లో వరి సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటిని వినియోగించే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు లేదా మొక్కజొన్న వంటి పంటలను ఎంచుకోవడం ఉత్తమమని సూచించారు.
ఐఎండీ నివేదిక నేడు విడుదల
భారత వాతావరణ శాఖ తన అధికారిక వర్షాల అంచనాను సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు.సోమవారం ఐఎండీ తమ రుతుపవనాల అంచనాను విడుదల చేయనుందని ఆయన తెలిపారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వతేదీ నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో ఆదివారం అత్యథికంగా 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఖమ్మం, ములుగు, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ ఉన్నాయని చెప్పారు. రాగల వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, సాధారణం కంటే 1 నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని ఆయన వివరించారు. రాబోయే రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మార్కును దాటింది.
హీట్ వేవ్ అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 12 నుంచి 19వతేదీ వరకు హీట్ వేవ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు హైదరాబాద్ రెయిన్స్ వెల్లడించింది.
రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని 20జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని అంచనా వేసింది. మరో 12 జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.నాగర్ కర్నూలు జిల్లాలో 37 డిగ్రీల సెల్సియస్ నమోదవవచ్చని తెలిపారు.
తీవ్రమైన వడగాలుల హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో రాబోయే 7 రోజుల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదై, తీవ్రమైన వేడితో ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వెదర్ మ్యాన్ వివరించారు. హైదరాబాద్‌లో కూడా రాబోయే 7 రోజుల పాటు నిరంతరాయంగా 40నుంచి 42డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై, తీవ్రమైన వేడి ఉంటుందని తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43°C మధ్య ఉంటుందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
ఎండలో బయట తిరగొద్దు : ఐఎండీ
ఎండవేడిమి పెరిగిన నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగుతూ, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ఐఎండీ శాస్త్రవేత్తలు సూచించారు. ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో బయట తిరగడం మానువాలని ఐఎండీ కోరింది. ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 19వతేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.ఏప్రిల్ 19 నాటికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
అత్యవసర హెచ్చరిక జారీ
ఏప్రిల్ 19 నుంచి మే 31వతేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో భూమి మీద నేరుగా 70శాతం అతినీలలోహిత సూర్య కిరణాలు ప్రసరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచాలని, మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని, అధిక వేడి కారణంగా మొబైల్ పేలే ప్రమాదం ఉందని తెలిపారు. పెరుగు, మజ్జిగ, నిమ్మ పండు రసం వంటి చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.
ఇవీ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తేళ్లు, పాములు చల్లని ప్రదేశాల కోసం ఇళ్లలోకి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ఎక్కువగా నీరు, ద్రవాలు తాగండి.
గ్యాస్ సిలిండర్‌ను ఎండలో ఉంచవద్దు.
విద్యుత్ మీటర్లపై అధిక లోడ్ వేయవద్దు.
అవసరమైన గదుల్లో మాత్రమే ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి
ప్రతీ 2–3 గంటలకు కనీసం 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి
Next Story

