జనసేన కీలక నిర్ణయం.. తెలంగాణలో రద్దు
x

జనసేన కీలక నిర్ణయం.. తెలంగాణలో రద్దు

తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.


తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు షురూ చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన విషయంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తుళ్లూరి తెలిపారు. జీహెచ్ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగాలను రద్దు చేశారు. కాగా వాటి స్థానంలో కొందరు సభ్యులతో అడ్ హక్ కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. ఈ అడ్ హక్ కమిటీలను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ వివరించారు. ఈ కమిటీలు 30 రోజుల పాటు పనిచేస్తాయని తెలిపారు.

ఈ కమిటీలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించనున్నాయి. కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. ఆ తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా నూతన కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఆదేశాలను విడుదల చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కమిటీలు పనిచేయనున్నాయని తెలియజేస్తున్నారు.

Read More
Next Story