
మున్సిపల్ ఎన్నికలలో “ఫ్యామిలీ ప్యాక్ అభ్యర్థులు”
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థుల పోటీ పెరుగుతోంది. మిర్యాలగూడ సహా పలు పట్టణాల్లో ఇది చర్చనీయాంశమైంది.
తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఈసారి ఓ ప్రత్యేకమైన ట్రెండ్‌ను బయటకు తెస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగడం ఇప్పుడు అరుదైన విషయం కాదు. రాజకీయాలు మెల్లగా వ్యక్తుల చేతుల్లో నుంచి కుటుంబాల చేతుల్లోకి వెళ్తున్నాయా అన్న ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది.
ఈ ‘ఫ్యామిలీ ప్యాక్’ అభ్యర్థుల ప్రవాహం భవిష్యత్తులో స్థానిక రాజకీయాల రూపురేఖలను మార్చేస్తుందా? పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన సాధారణ నాయకులకు కనీసం స్థానిక ఎన్నికల్లోనైనా పోటీ చేసే అవకాశం మిగులుతుందా అనే ఆందోళన పెరుగుతోంది.
ఒకవైపు అనుభవం, పరిచయాలు ఉన్న కుటుంబాలు రాజకీయాల్లో ముందుకు వస్తుంటే… మరోవైపు కష్టపడి పనిచేసిన కార్యకర్తల ఆశలు మాత్రం నెమ్మదిగా మసకబారుతున్నాయి. ఈ మార్పు ప్రజాస్వామ్యానికి బలమవుతుందా, లేక పరిమితమవుతుందా అన్నది కాలమే చెప్పాలి. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులకు గాను, జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు మూడు వార్డుల నుండి పోటీ చేస్తున్నారు.
ఎమ్మెల్యే భార్య బత్తుల మాధవి 39వ వార్డు కౌన్సిలర్‌గా, ఆయన పెద్ద కుమారుడు సాయి ప్రసన్న 40వ వార్డు నుండి, చిన్న కుమారుడు 28వ వార్డు నుండి నామినేషన్ దాఖలు చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన భార్య పోటీ చేయగా, లక్ష్మారెడ్డి మాత్రమే గెలిచి ఆయన భార్య ఓడిపోయారు. 2023 శాసనసభ ఎన్నికల్లో మిర్యాలగూడ నుండి పోటీ చేయడానికి లక్ష్మారెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవసరమైన కౌన్సిలర్ల మెజారిటీ లభిస్తే, తన అనుచరుడిని మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే ఒక ప్రణాళికతో తన కుటుంబ సభ్యులను మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దింపారు. మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు తిరునగరి భార్గవ కూడా మిర్యాలగూడ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో భార్గవకు మద్దతిచ్చే కాంగ్రెస్ కౌన్సిలర్లలో చీలిక ఏర్పడితే, తన కుటుంబం నుండి ముగ్గురు పోటీలో ఉండటం వల్ల తన వర్గానికి ఎక్కువ మంది కౌన్సిలర్లు లభిస్తారని మిర్యాలగూడ ఎమ్మెల్యే భావిస్తున్నారు. అయితే, మిర్యాలగూడ ఎమ్మెల్యే కుటుంబం నుండి ముగ్గురు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మున్సిపల్ ఎన్నికలలో అవకాశం ఆశించి విఫలమైన సొంత పార్టీ నాయకుల నుండి ఎమ్మెల్యే కుటుంబానికి టిక్కెట్లు కేటాయించిన విషయంపై విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఇది మిర్యాలగూడ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
విషయం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ కు చేరటంతో పరిస్థితి సరిదిద్దటానికి నల్గొండ లోక్ సభ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డిని రంగంలోకి దింపారు. అసమ్మతి నేతలని బుజ్జగించే పనిని ఆయన భుజాలపై వేసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలలో కుటుంబ రాజకీయాలు మిర్యాలగూడకే పరిమితం కాకుండా, ఇతర మున్సిపాలిటీలలో, ఇతర రాజకీయ పార్టీలలో కూడా చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి లో కూడా ఫామిలీ ప్యాక్ రాజకీయాలు వివిధ మునిసిపాలిటీలలో చోటుచేసుకున్నాయి. అలాగే భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ తరఫున రేవుల రాకేష్ 4వ వార్డు నుంచి, ఆయన భార్య రేవుల స్రవంతి 25వ వార్డు నుంచి నామినేషన్లు వేశారు.
మహబూబాబాద్ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని 20వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో గండ్ర హరీష్ 29వ వార్డు నుంచి, ఆయన భార్య శోభ 10వ వార్డు నుంచి పోటీకి దిగారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వేషన్ లో కేటాయించటంతో ప్రముఖ నేతల భార్యలు వివిధ డివిజన్ల నుంచి పోటీలో ఉన్నారు. నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి భార్య బుర్రి చైతన్య 32 వ డివిజన్ నుంచి రంగంలో ఉన్నారు.
రాష్ట్ర రోడ్స్, బిల్డింగ్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే బుర్రి చైతన్యను కాంగ్రెస్ పార్టీ మేయర్ అభార్థిగా ప్రకటించారు. బి. ఆర్. ఎస్ . పార్టీ కూడా పార్టీ నేత చకిలం అనిల్ కుమార్ భార్య వసంతను తమ మేయర్ అభార్థిగా ప్రకటించారు. ఈ ఇద్దరు మహిళా అభ్యర్థులు రాజకీయాలలో అంతగా ప్రత్యక్ష సంబంధం లేనివారని చెప్పవచ్చు.

