
తెలంగాణ ‘అమ్మా నాన్న కు ప్రేమతో...’
తెలంగాణలో కొడుకుల నిర్లక్ష్యం మీద పేరెంట్స్ కంప్లైంట్ చేయవచ్చు. పరిహారం పొందవచ్చు. ఎవరికి దరఖాస్తు చేయాలి? ఎలా చేయాలి?
తమని నిర్లక్ష్యం చేసే పిల్లల మీద తల్లితండ్రులు ఇక జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి పరిహారం పొందవచ్చు. పిల్లలు ప్రభుత్వోద్యోగులయినా, తెలంగాణలో పని చేసే ప్రయివేటు ఉద్యోగులెవరైనా సరే, వారి జీతం నుంచి 10 శాతం నుంచి 15 శాతం (లేదా గరిష్టంగా రు. 10 వేలు) దాకా వారి జీతంలో కోత విధించి ఆ మొత్తాన్ని ప్రభుత్వం తల్లితండ్రులు బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఈ బాధ్యతని కలెక్టర్ కు అప్పగించారు.
ఇది ఉద్యోగులకే కాదు, ప్రజాప్రతినిధులకూ కూడా వర్తిస్తుంది. అంటే తల్లిదండ్రులను గాలికివదిలేస్తే ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, కార్పొరేటర్లమీద, సర్పంచుల మీద ఫిర్యాదు చేసి పేరెంట్స్ పరిహారం పొందవచ్చు. నామినేట్ అయిన సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా ఈ కొత్త బిల్లులోకి వస్తారు.
తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన “తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్, 2026” (The Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill, 2026)ను ప్రవేశపెట్టింది.
“ఈ బిల్లు లక్ష్యం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు వారి ఉద్యోగుల మొత్తం స్థూల నెల జీతంలో గరిష్టంగా 15% లేదా కనీసం రూ.10,000లో కేటాయించే అవకాశం కల్పించడం. దీని ద్వారి వారి ప్రాథమిక అవసరాలను తీర్చడం, అని ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్ ఆమోదం పొంది ఈ బల్లు చట్టం అయిన వెంటనే తల్లితండ్రులు జిల్లా కలెక్టర్ లకు తమ దీనావస్థమీద, పిల్లలు తమని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో వివరిస్తూ ఫిర్యాదు చేయవచ్చు.
ఎలా కంప్లైంట్ చేయాలి
*ఎవరైనా ఉద్యోగి తల్లిదండ్రుల సంరక్షణను నిర్లక్ష్యం చేస్తే, తమపై ఆధారపడే తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వక దరఖాస్తు ఇవ్వవచ్చు. ఈ చట్టానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు చట్టం అమలు చేసే బాధ్యత అప్పగించారు.
*దరఖాస్తు అందుకున్న తర్వాత, 60 రోజుల్లోపు కలెక్టర్ దాన్ని పరిశీలించి పరిష్కరించాలి.కలెక్టర్ దరఖాస్తు అందుకున్న 60 రోజుల్లోపు, తల్లిదండ్రులు ఉద్యోగి ఇద్దరి వైపు వాదనలు విని, జీతం నుంచి కట్ చేయాల్సిన మొత్తాన్ని నిర్దేశిస్తూ ఆదేశం ఇవ్వాలి.
*కలెక్టర్ 60 రోజుల్లోపు పరిష్కరించకపోతే, దరఖాస్తుదారులు 45 రోజుల్లోపు సీనియర్ సిటిజన్ కమిషన్ వద్ద అప్పీలు చేసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కమిషన్ ను ఏర్పాటు చేస్తుంది.
*సీనియర్ సిటిజన్ కమిషన్ పేరెంట్స్ అభ్యర్తన ను గరిష్టంగా 60 రోజుల్లోపు పరిష్కరించాలి
*కేటాయించిన మొత్తం ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కట్ చేసి, నియామక అధికారి ద్వారా నేరుగా వారికి చెల్లించబడుతుంది
*దరఖాస్తు చేసే తల్లిదండ్రులు పరిహారం కోరేందుకు తగిన కారణాలు, తమ ఆదాయం , ఆర్థిక పరిస్థితి వంటి వివరాలను స్పష్టంగా ఇవ్వాలి
* తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకునే స్వేచ్ఛ కూడా పేరెంట్స్ కు వుంటుంది.
* తల్లిదండ్రులు చనిపోయాక, తన జీతం కోత నిలిపివేయాలని కొడుకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చు.
“ఈ బిల్లు వల్ల వృద్ధ తల్లిదండ్రులు ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య ఖర్చులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుంది,” అని ప్రభుత్వం తెలిపింది.
*కట్ చేసిన మొత్తం నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది, తద్వారా నిరంతర పర్యవేక్షణ సహాయం అందుతుంది. ముఖ్యంగా, ఈ బిల్ బయాలాజికల్ తల్లిదండ్రులతో పాటు, తమను తాము పోషించుకోలేని స్టెప్-పేరెంట్స్‌కూ వర్తిస్తుంది.
అభ్యర్థన పరిష్కరించేందుకు కమిషన్
అమలు వ్యవస్థను బలపరచడానికి, కలెక్టర్ ఆదేశాలపై లేదా బిల్లు అమలు జాప్యంపై అభ్యర్తన పరిష్కరించేందుకు సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ కమిషన్‌కు రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయిన చీఫ్ కమిషనర్ నేతృత్వం వహిస్తారు. పరిపాలన, ప్రభుత్వం లేదా సామాజిక రంగంలో అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులు ఇందులో ఉంటారు. విచారణలు నిర్వహించడం, సాక్షులను పిలవడం, జరిమానాలు విధించడం వంటి న్యాయ అధికారాలు దీనికి ఉంటాయి. తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థలో విడదీయరాని భాగమని, వారికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, పిల్లల నుంచి ఆర్థిక భద్రత కూడా పొందే హక్కు ఉందని పేర్కొంది. ఈ చట్టం నైతిక బాధ్యతను అమలు చేయగల బాధ్యతగా మార్చడమే లక్ష్యంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అస్సాం ‘ప్రణామ్’ స్ఫూర్తి
ఈ ప్రతిపాదిత చట్టం అస్సాంలో అమల్లో ఉన్న PRANAM (Parents Responsibility and Norms for Accountability and Monitoring) చట్టం, 2017 నుంచి స్పూర్తితో రూపొందించారు, . ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల నుంచి 10% నుంచి 15% వరకు కట్ చేయవచ్చు. జాతీయ స్థాయిలో, “Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007” ప్రకారం ట్రిబ్యునల్స్ నెలకు రూ.10,000 వరకు భరణం చెల్లించాలని ఆదేశించవచ్చు . తల్లి దండ్రులు నిర్లక్షానికి గురైన సందర్భాల్లో గిఫ్ట్ డీడ్స్‌ను రద్దు చేయవచ్చు.

