బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
x
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చేయి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణకు నిధుల నిరాకరణ : కేంద్రంపై భట్టి విక్రమార్క మండిపాటు


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించకుండా వివక్ష చూపించిందని, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, వ్యవసాయం, ఉపాధి హామీ వంటి కీలక రంగాలను కేంద్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాల ఆదాయ వాటాను కేంద్రం తగ్గించిందని, నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష చూపించిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపించిందని ఆయన చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి నిధులు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్రానికి నిధులు ఇవ్వక పోగా మరో వైపు సెస్ పెంపు ద్వారా రాష్ట్రాల ఆదాయ వాటాను తగ్గించారని భట్టి విమర్శించారు.

వరంగల్ విమానాశ్రయాభివృద్ధికి నిధులేవి ?

వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి నిధులు ఏవని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో బీహార్ లోని కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు కేటాయించి, వరంగల్ ను విస్మరించారని భట్టి చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను విస్మరించిందని ఆయన చెప్పారు. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి నిధులు కేటాయించలేదని చెప్పారు. కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని పట్టించుకోలేదని, గతంలో కేటాయించిన నిధుల కంటే తక్కువ కేటాయించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

తెలంగాణను విస్మరించారు...

దేశంలోనే హైదరాబాద్ నగరం కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఉన్నా కేంద్రం తెలంగాణను విస్మరించి ఇతర నగరాల్లో ఏఐ కేంద్రాలను ఏర్పాటు చేయడం దారుణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వ్యాఖ్యానించారు. ఎన్వీఐడీఐఏ, ఇంటెల్, అడోబ్ గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్ విజయవంతంగా అమలు అవుతుంటే కేంద్రం ఇతర ప్రాంతాల్లో ఏఐ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలనుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు, రీజనల్ రింగ్ రోడ్డుకు, మెట్రోరైలుకు నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని భట్టి ఆరోపించారు.హైదరాబాద్ బయో ఫార్మా, ఎలక్ట్రానిక్ రంగాన్ని కేంద్రం విస్మరించిందని చెప్పారు.
Read More
Next Story