తెలంగాణ పరిశోధకుడికి ICSSR గ్రాంటు
x

తెలంగాణ పరిశోధకుడికి ICSSR గ్రాంటు

పోచంపల్లి, బెనారస్ చేనేత ప్రాంతాలపై అధ్యయనం కోసం డా. శ్రీరాములు నేతృత్వంలో పరిశోధన బృందం ఎంపికైంది.


తెలంగాణకు చెందిన యువ పరిశోధకుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. చేనేత రంగంపై పరిశోధన కోసం ఐసీఎస్‌ఎస్‌ఆర్ నుంచి రూ.10 లక్షల గ్రాంట్ మంజూరైంది. హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన డా. గోసికొండ శ్రీరాములు ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనను ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు ఎంపిక చేశారు.

కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి ఈ గ్రాంట్‌ను విడుదల చేసింది. “భారతదేశంలోని నేత సముదాయాలు” అనే అంశంపై సమగ్ర అధ్యయనం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భౌగోళిక గుర్తింపు పొందిన చేనేత క్లస్టర్లలో పనిచేసే నేత కార్మికుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించనున్నారు.

డా. శ్రీరాములు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ జాడి బాల కొమరయ్య, డా. చిత్తూరు ప్రకాష్, డా. పచ్చవ వెంగళరావు సభ్యులుగా ఉన్న బృందం ఒక సంవత్సరం పాటు కలిసి పనిచేయనుంది. పోచంపల్లి ఇక్కత్, బెనారస్ చీరల తయారీ ప్రాంతాల్లో ఈ పరిశోధన కొనసాగనుంది.

చేనేత కుటుంబం నుంచి వచ్చిన శ్రీరాములు నేతన్నల పరిస్థితిపై పరిశోధనకు ఎంపిక కావడం పట్ల విశ్వవిద్యాలయ సహచరులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరిశోధన చేనేత రంగానికి ఉపయోగకరమైన సూచనలు అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read More
Next Story