
ఆర్టీసీ సమ్మె సైరన్.. పరిష్కరించడానికి సర్కార్ రెడీ
చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల కఠిన నిర్ణయం. లక్షలాది ప్రయాణికులపై ప్రభావం పడే పరిస్థితి, ప్రభుత్వం స్పందన కీలకం.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. మరికొన్ని గంటల్లోనే ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించనున్నారు. మంగళవారం అర్థరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా కదలదని కార్మికులు తేల్చి చెప్పారు. తమ సమ్్మె మరోసారి సకల జనుల సమ్మెగా మారుతుందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న వ్యాఖ్యానించారు. తాము సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు అవుతున్నా తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందు వేయకపోవడం అత్యంత విచారకరమని వెంకన్న అన్నారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమ్మె నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మూతబడే పరిస్థితిలో ఉన్న ఆర్టీసీని లాభాల పట్టించామని, అదే విధంగా కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
తమ సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించినట్లు వెంకన్న చెప్పారు. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్‌సీ అమలు, బకాయిల చెల్లింపులు వంటి డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయని చెప్పారు. ఈ సమ్మె అంశంలో యూనియన్ల పునరుద్ధరణ కూడా కీలక అంశంగా నిలిచింది. తమ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కాలయాపన కోసమే కమిటీ ఏర్పాటు చేశారని జేఏసీ అభిప్రాయపడింది. మెట్రోపై ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆర్టీసీ విషయంలో నిర్లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు.
మెట్రోకున్న ప్రాధాన్యత ఆర్టీసీకి లేదేం: జేఏసీ
ఇటీవల ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థ ఆస్తులను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆర్టీసీని బలహీనపరిచే ప్రయత్నం ఉందని కూడా తెలిపారు. సమ్మెకు కార్మికులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని, భయపడాల్సిన అవసరం లేదని జేఏసీ నాయకత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వం ఇప్పటికి అయినా సమ్మెపై జోక్యం చేసుకోవాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి చర్యలు చేపట్టాలి. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారు. మెట్రో విషయంలో చూపుతున్న చురుకుదనం.. ఆర్టీసీకి వచ్చేసరికి ఏమవుతుంది? ఆర్టీసీని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని కుట్రలు పన్నుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది.
అన్నింటికీ సమ్మె పరిష్కారం కాదు: పొన్నం
ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి విషయానికి సమ్మె పరిష్కారం కాదని హితవు పలికారు. సమ్మె బాట పట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని కోరారు మంత్రి. తాము కబ్జాదారులకు అండగా నిలవమని స్పష్టం చేశారు. కబ్జాకోరులకు అండగా ఉంటామని కేసీఆర్ ప్రకటించారని, కానీ తమ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడుతోందని అన్నారు.

