
ఫిన్‌లాండ్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం.. 45 రోజులైనా ఆచూకీ లేదు
విదేశాల్లో చదువుతున్న మణిదీప్ రెడ్డి కనిపించక కుటుంబం ఆందోళనలో ఉంది. కేసుపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఫిన్‌లాండ్‌లో చదువుతున్న తెలంగాణ విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యమై 45 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం వైదేహి నగర్‌కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత విద్య కోసం ఫిన్‌లాండ్‌కు వెళ్లాడు. అక్కడ లాతి పట్టణంలోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు.
గత నెల 4వ తేదీన తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్, మే 5 నుంచి ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే ఫిన్‌లాండ్‌లో ఉన్న స్నేహితులు, పరిచయస్తులను అతడి గది, కళాశాలకు పంపించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు మణిదీప్ ఆచూకీ గురించి స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు.
45 రోజులు గడిచినా ఫిన్‌లాండ్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా గుర్తించి స్వదేశానికి తీసుకురావాలని వారు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇదిలా ఉండగా, తమ కుమారుడి అదృశ్యంపై ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ మణిదీప్ తల్లిదండ్రులు జి. మర్ణత, ముత్యం రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి, ఫిర్యాదుపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వం, ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది, మణిదీప్ మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు కేంద్రం తరఫు న్యాయవాది, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
దర్యాప్తు పురోగతిపై మరిన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం మణిదీప్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుండగా, దర్యాప్తు కొనసాగుతోంది.

