Revanth Reddy
x

‘తెలంగాణలో ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ’

క్రీడాకారులకు శిక్షణ, అంతర్జాతీయ మైదానాలు, హాస్టల్, యూనివర్సిటీ కాంప్లెక్స్‌తో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం.


తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా చర్యలు పట్టనున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఒలింపిక్ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రేవంత్.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడల్లో సత్తా చాటేలా మైదానాలు, శిక్షణా సదుపాయాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేలా అన్ని రకాల వసతులతో యూనివర్సిటీ ఏర్పాటు కావాలని రేవంత్ అన్నారు. క్రీడాశాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించాలని, స్టేడియం ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడలకు ప్రత్యేక మైదానాలు, శిక్షణా సౌకర్యాలు అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడాకారులకు సమగ్ర శిక్షణ అందేలా అన్ని సౌకర్యాలు కలిగిన స్పోర్ట్స్ యూనివర్సిటీ అవసరమని సమావేశంలో చర్చించారు.

తెలంగాణ భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వగల స్థాయికి చేరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను కూడా భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఆధునీకరించాలని అధికారులకు తెలిపారు. క్రీడాకారుల శిక్షణ, పోటీల నిర్వహణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. సమావేశంలో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, భవిష్యత్ క్రీడా ప్రణాళికలపై సమగ్రంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు.

Read More
Next Story