పులి గాండ్రింపులతో వణుకుతున్న తెలంగాణ గ్రామాలు
x
తెలంగాణ గ్రామాాల్లో పులి సంచారం

పులి గాండ్రింపులతో వణుకుతున్న తెలంగాణ గ్రామాలు

ఆవాసం కోసమా? ఆడపులి తోడు కోసమా? తెలంగాణ బాట పట్టిన తిప్పేశ్వర్ పులి


మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం నుంచి వలస వచ్చిన మగ పులి తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది. సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ పులి ప్రస్తుతం సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తుండటంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర శివార్లలోకి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వలస వచ్చిన పులి ఈ ప్రాంత ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంది.తిప్పేశ్వర్ అడవి నుంచి పులి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల అభయారణ్యం మీదుగా సిద్దిపేట–యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలోని గ్రామాలకు తరలివచ్చింది. ఈ పులి రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులను చంపుతోంది.ఇప్పటికే 9 పశువులను చంపిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులి సంచారంతో మూడు జిల్లాల రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. గత 20 రోజులుగా పులి సంచరిస్తూ అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిప్పేశ్వర్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన పులి మగ పులిగా తెలంగాణ వైల్డ్ లైఫ్ అధికారులు గుర్తించారు. ఈ పులి వయసు అయిదేళ్లు ఉంటుందని అంచనా వేశారు.

ఆవాసం కోసమా? ఆడపులి తోడు కోసమా?

తిప్పేశ్వర్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరగడంతోపాటు అక్కడ వాటి నివాసానికి అనుగుణంగా ఆవాసాలు, పులి సంచారానికి కావాల్సిన టెరిటరీ అటవీ ప్రాంతం తక్కువగా ఉండటంతో పులులు కాస్తా తెలంగాణ బాట పట్టాయి. పులి నివాసానికి అనువుగా ఆవాసంతోపాటు టెరిటరీని వెతుక్కుంటూ తెలంగాణ అటవీగ్రామాల్లో తిరుగుతుందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికాస్) వాలంటీర్ శ్రీపతి వైష్ణవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులికి రెండేళ్ల వయసు రాగానే అది తల్లి నుంచి దూరంగా జన్మస్థలాన్ని విడిచిపెట్టి వచ్చి తనకంటూ టెరిటరీని ఏర్పాటు చేసుకునేందుకు యత్నిస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. మరో వైపు వయసు రాగానే ఆడపులి తోడును వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలోని అడవి జిల్లాలుగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, ఖమ్మం మెదక్ జిల్లాలు దట్టమైన చెట్లతో టైగర్ కారిడార్ గా ఉండేదని, పోడు వల్ల అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల పులుల ఆవాసానికి సమస్యగా మారిందని శ్రీపతి వైష్ణవ్ వ్యాఖ్యానించారు. అందుకే పులులు అటవీ గ్రామాల్లోకి వస్తున్నాయని ఆయన తెలిపారు.

అంతరించిపోతున్న అడవుల్లో ఆవాసం కోసం పులి పాట్లు

తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పోడు వల్ల పలు అటవీ భూములు వ్యవసాయభూములుగా మారాయి. అడవిలో దట్టంగా ఉన్న చెట్లను కొట్టేయడంతో పులుల ఆవాసాలు దెబ్బతిన్నాయి. పులి నివాసం ఉండాలంటే దట్టమైన పొదలు, వాగులు,చెరువులు, గుట్టలు ఉండాలి.ఆవాసాలను ప్రజలు దెబ్బతీయడం వల్ల పులి అటవీ గ్రామాల్లోకి వచ్చిందని తెలంగాణ వైల్డ్ లైఫ్ ఓఎస్డీ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పులికి హాని తలపెట్టకుండా చర్యలు

అటవీ గ్రామాల్లో సంచరిస్తున్న పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.జాతీయ పులుల సంరక్షణ అథారిటీ నిబంధనల ప్రకారం పులి చంపిన పశువుల కళేబరాన్ని 48 గంటలు భద్రపరిచి, ఆపై పూడ్చిపెట్టాలి.పులి దాడుల పట్ల గ్రామస్తులు కోపంగా ఉన్నందున విషం పెట్టి పులికి ఎలాంటి హాని తలపెట్టకుండా తాము చర్యలు తీసుకున్నామని అటవీశాఖ అధికారి కొండల్ రెడ్డి చెప్పారు. పులి కదలికలను రికార్డు చేసేందుకు అటవీ శాఖ కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేసింది.ఈ కెమెరా ట్రాప్ ల ద్వారా వీడియోలను అటవీశాఖ అధికారుల వాట్సాప్ కు, టైగర్ సెల్, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం మాత్రమే పులికి రసాయన మత్తు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలంగాణ అటవీ శాఖఅధికారులు చెప్పారు.

పులి కదిలికలపై థర్మల్ డ్రోన్లతో నిఘా

ఈ పులిని బంధించేందుకు హైదరాబాద్ జూ పార్కు నుంచి బోన్లను రప్పించారు. పులి కదలికలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు.జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) మార్గదర్శకాల ప్రకారం పులిని బంధించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) ప్రతినిధులు రమేష్, హైటికోస్ (హైదరాబాద్ కన్సర్వేషన్ సొసైటీ) సభ్యుడు ఇమ్రాన్ సిద్దిక్, పుణెకు చెందిన రెస్క్యూ బృందం నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ నిపుణుల బృందం పులి సంచరించే ప్రాంతంలో తిరుగుగూ పులి కదలికలపై నిఘా వేసింది.

మరో దూడను చంపిన పులి

జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి శుక్రవారం మరో దూడను చంపింది. అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరో వైపు రఘునాథపల్లి మండలంలో మరో దూడపై దాడి చేసి చంపింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామంలో 8వసారి మరో దూడను చంపింది.పి.రాజు అనే రైతు తన పొలం సమీపంలోని పశువుల పాకలో కట్టివేసిన దూడను పులి చంపిందని ఫిర్యాదు చేశాడు.దీంతో అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రల కోసం తనిఖీలు చేశారు. గ్రామ పెద్దలు, స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు.

పూణే రెస్క్యూ బృందం రాక

పులి కదలికలను పసిగట్టి,దాన్ని అడవిలోకి పంపడానికి ప్రణాళిక రూపొందించడానికి మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన రెస్క్యూ బృందం శుక్రవారం జనగామ జిల్లాకు చేరుకుంది. పులి జాడను పసిగట్టే నిపుణులు,రక్షకులు ఈ ఆపరేషన్‌లో చేరారు.పులి రాత్రివేళల్లో 25 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ కొత్త అటవీయేతర ప్రాంతాలకు చేరుకుంటోందని ఈ బృందం గుర్తించింది. లింగాఘన్‌పూర్ మండలం కుందురం గ్రామంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో భయాందోళనలు అలుముకున్నాయి.జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల అటవీశాఖ అధికారులు మొక్కజొన్న పొలాల్లో పులి పగ్‌మార్క్‌లు కనిపించడంతో దీన్ని గుర్తించడానికి ఆపరేషన్ ప్రారంభించారు.

పులి సంచారంపై చాటింపు

హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి-భువనగిరి జిల్లాలో గత 20 రోజుల క్రితం నుంచి సంచరిస్తున్న పులి ప్రస్థుతం జనగామ జిల్లాకు చేరుకుంది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడి గ్రామస్తులకు ముందస్తు జాగ్రత్తలు జారీ చేశారు. లింగాల ఘన్‌పూర్ మండలంలో పులి పాదముద్రలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం చాటింపు వేయించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు.పులి సంచరిస్తున్నందున ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని, తమ పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులి సంచారంపై తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలంగాణ టైగర్ సెల్ వైల్డ్ లైఫ్ అధికారి ఆంజనేయులు ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.

తిప్పేశ్వర్ టు జనగామ

తిప్పేశ్వర్ అరణ్యం నుంచి వలస వచ్చిన పులి జనవరి 17వతేదీన సిద్ధిపేట, యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాల్లో సంచరిస్తోంది. ఈ మగ పులి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి వచ్చిందని యాదాద్రి జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పులి యాదాద్రి జిల్లాకు చేరుకోవడానికి 400 కిలోమీటర్లు ప్రయాణించిందని ఆయన పేర్కొన్నారు. పులి రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం సంచరిస్తుందని ఆయన తెలిపారు.కవ్వాల పులుల అభయారణ్యంలో 35 పులుల నివాసానికి వీలుగా దట్టమైన అడవులున్నా, మహారాష్ట్ర నుంచి వచ్చిన నాలుగు పులులే నివాసం ఉంటున్నాయని తేలిందని హైదరబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్ శ్రీపతి వైష్ణవ్ చెప్పారు.

పెనుగంగా తీరంలో పులి సంచారం

పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి మరో పులి పెన్‌గంగా నదిని దాటి భీంపూర్ మండలం అడవుల్లోకి ప్రవేశించింది.పులి రాకతో పెనుగంగా నదీ తీరం వెంబడి,అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.పిప్పల్‌కోటి గ్రామంలో మూడు రోజుల క్రితం పులి ఒక ఆవును చంపింది. భీంపూర్ మండలంలోని థమ్సి (కె), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్‌కోట గ్రామ శివార్లలో పులి కనిపించిందని స్థానికులు చెప్పారు. యావత్మాల్ జిల్లాలోని తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో నివసించే పులి పదిహేను రోజుల క్రితం పెన్‌గంగ నదిని దాటి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని అటవీ అధికారులు చెప్పారు. పులి కదలికలను పర్యవేక్షించడానికి 10 సీసీటీవీ కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
- పులి షరాజిపేట శివార్లలోని ఒక పశువుల పాకలో ఆవును చంపింది. పశువుల యజమాని ఉదయం పాక వద్దకు వెళ్లినప్పుడు ఆవు చనిపోయి ఉండటం చూశారు. పాక్షికంగా తినేసి ఉండటాన్ని చూసి ఈ విషయం వెలుగులోకి వచ్చింది.పులి తంగటూరు నుంచి షరాజిపేటకు వచ్చిందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
- పులి ఆలూరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక దూడను చంపి, ఆ తర్వాత సిద్దెంకి గ్రామం వైపు వెళ్లింది. ఆ తర్వాత సిద్దెంకి సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను కనుగొన్నారు.
- రాజపేట మండలం బసంత్‌పూర్ గ్రామంలో పులి ఒక దూడను చంపడంతో అటవీ,జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఆలేరు మండలం శరజీపేట గ్రామంలో పులి షెడ్డులో ఉన్న ఆవును చంపడంతో, అటవీ అధికారులు కెమెరా ట్రాప్‌లు,బోన్లను ఏర్పాటు చేశారు.

అప్రమత్తమైన అధికారులు

సిద్దిపేట–యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లా సరిహద్దుల్లో గత రెండు వారాలుగా పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) మార్గదర్శకాల మేరకు పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ.సువర్ణ అధ్యక్షతన తాజాగా అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. పులి కదలికలపై నిరంతర సమీక్షలు చేపట్టి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో పులికి కూడా హాని జరగకుండా ట్రాకర్లు, అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సువర్ణ సూచించారు.పులి కదలికలపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాతీయ పులుల సంరక్షణ సంస్థ (NTCA) సభ్యురాలు హరిణి వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) ప్రతినిధులు రమేష్, హైదరాబాద్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యుడు ఇమ్రాన్ సిద్దిక్, పుణెకు చెందిన ReSQ బృందం నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ నిపుణులు అటవీ శాఖకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తున్నారు.
పులి కదలికలపై అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తుండగా, జాతీయ పులుల సంరక్షణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల భద్రతతో పాటు పులికి కూడా ఎలాంటి హాని జరగకుండా ఈ ఆపరేషన్‌ను ముగించడమే లక్ష్యమని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
అడవులు తగ్గితే పులులు తప్పనిసరిగా గ్రామాల బాట పడతాయి. తిప్పేశ్వర్ నుంచి తెలంగాణకు వచ్చిన ఈ పులి కథ… ఆవాసాల క్షీణత, మానవ–వన్యప్రాణి ఘర్షణ ఎంత తీవ్రంగా మారుతోందో చెప్పే హెచ్చరికగా నిలుస్తోంది.
Read More
Next Story