పప్పరాజీ లాగే తయారైన తెలుగు మీడియా  (వీడియో)
x
i bomma Ravi

పప్పరాజీ లాగే తయారైన తెలుగు మీడియా (వీడియో)

పప్పరాజీ మీడియా ఏమిచేస్తుందంటే సెలబ్రిటీలు, ప్రముఖుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఫొటోలు తీసి మీడియా సంస్ధలకు అమ్ముకుంటుంది.


తెలుగు మీడియాకూడా పప్పరాజీ మీడియాలాగే తయారైపోయింది. పప్పరాజీ మీడియా అంటే ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ పపరాజ్జో(Paparazzo) నుండి వచ్చింది. పప్పరాజీ మీడియా ఏమిచేస్తుందంటే సెలబ్రిటీలు, ప్రముఖుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఫొటోలు తీసి మీడియా సంస్ధలకు అమ్ముకుంటుంది. ముందు ఇంటర్వ్యూలు, ఫొటోల కోసం ప్రముఖులు, సెలబ్రిటీల వెంటపడుతుంది. వాళ్ళు కాదు కుదరదు అనగానే వ్యక్తిగత జీవితంలోకి రహస్యంగా చొరబడి అన్నీవిషయాలను కూపీలాగి ఇతర మీడియా సంస్ధలకు డబ్బులకు అమ్ముకుంటాయి. ఇలాంటి వార్తలను, ఫొటోలను అమ్ముకునే మీడియాలను పాశ్చాత్యదేశాల్లో పప్పరాజీ అనే అంటారు. ఇపుడిదంతా ఎందుకంటే ఐబొమ్మ రవి విషయంలోనే ఇలాంటి ఘటన ఒకటి ఎదురైంది.

సినిమాల పైరసీ వ్యవహారంలో అరెస్టయి జైలులో ఉన్న ఐబొమ్మ ఇమ్మండి రవి ఈమధ్యనే బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బెయిల్ ఇచ్చేముందు కోర్టు రవికి అనేక షరతులు విధించింది. అందులో కీలకమైనవి మీడియా సమావేశాలు నిర్వహించకూడదు, మీడియాతో మాట్లాడకూడదు, ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడకూడదు, నడుస్తున్న కేసుగురించి బహిరంగంగా ఎవరితోను మాట్లాడకూడదు లాంటి షరతులున్నాయి.

కోర్టు షరతులను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. కాబట్టి రవి జైలునుండి బయటకు వచ్చి నాలుగురోజులు అవుతున్నా ఇప్పటివరకు అజ్ఞాతంలోనే బతుకుతున్నాడు. కోర్టు ఇన్ని ఆంక్షలు విధించిన తర్వాత రవి బయటకు వచ్చి కూడా చేయగలిగింది ఏమీలేదు. అందుకనే ఎక్కడుంటున్నాడో కూడా తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

అలాంటిది ఈరోజు ఎక్కడో ఖర్మకాలి రవి మీడియా కంటపడ్డాడు. ఇంకేముంది టీవీ ఛానళ్ళు రిపోర్టర్లు ఒక్కసారిగా రవిమీదకు దాడిచేశారు. నడుస్తున్న కేసుగురించే అడిగారు. అయితే మీడియాను చూసిన రవి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తర్వాత వెంటనే తేరుకుని వారిని తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. అయితే మీడియా విడిచిపెట్టెకుండా వెంటపడుతునే ఉంది. రవి మాత్రం చాలా జాగ్రత్తగా మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా చిరునవ్వుతోనే సమాధానం చెబుతు తప్పించుకునే ప్రయత్నంచేశాడు. నోటికి జిప్ వేసుకున్నట్లు సంకేతాలు ఇచ్చినా విడిచిపెట్టకుండా మీడియా వెంటాడింది.

మీడియాను తప్పించుకున్న రవి ఆటోలో ఎక్కాడు. అయినా వదిలిపెట్టకుండా ఆటోలో కూర్చున్న రవి నోట్లోకి గొట్టాలను పెట్టేసింది. తాను ఏమీ మాట్లాడకూడదని సంజ్ఞలు చేస్తు తప్పించుకునే ప్రయత్నంచేశాడు. అంతటితో వదిలిపెడితే అది మీడియా ఎందుకవుతుంది. కాసేపటి తర్వాత ఇంకెక్కడో కనిపించాడు. మళ్ళీ మాట్లాడమని వెంటపడింది మీడియా. ఈసారి కారులో కూర్చునేటపుడు కూడా వెంటాడింది. తాను మాట్లాడేందుకు లేదని సంజ్ఞలతో చెప్పినా మీడియా పట్టించుకోలేదు. ఏదో ఒక పద్దతిలో మాట్లాడించేందుకు తెగ ప్రయత్నించింది. కారులో కూర్చున్న రవి మీకో దణ్ణం అన్న పద్దతిలో మీడియాకు దణ్ణం పెట్టేశాడు.

అయినా వినిపించుకోని మీడియా ఒక్కమాట..ఒక్కమాట అంటు ఏవేవో ప్రశ్నలు వేస్తునే ఉంది. వీళ్ళతో లాభంలేదని కారులో కూర్చున్న రవి డ్రైవర్ కు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడేందుకు లేదని రవికి కోర్టు షరతులు విధించిన విషయం మీడియాకు చాలా స్పష్టంగా తెలుసు. మీడియాతో మాట్లాడితే తన బెయిల్ రద్దవుతుందన్న విషయం కూడా మీడియాకు తెలుసు. అయినా సరే రవితో మాట్లాడించాలని ప్రయత్నించిన మీడియాను పప్పరాజీ మీడియా అనాలా ? లేకపోతే శాడిజం అనాలో అర్ధంకావటంలేదు.

Read More
Next Story