అద్దె ఇంట్లో నమ్మకాన్ని నరికి వేసిన నేరం
x

అద్దె ఇంట్లో నమ్మకాన్ని నరికి వేసిన నేరం

హత్య చేసి, ఆమె వద్ద ఉన్న సుమారు 11 తులాల బంగారాన్ని దొంగలించిన హంతకుడు.


హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వృద్ధ మహిళ హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఒంటరిగా జీవిస్తున్న మహిళ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అద్దెకు ఉంటున్న వ్యక్తే ఆమె ప్రాణాలు తీసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

మల్లాపూర్ బాబానగర్‌లో నివసిస్తున్న సూరెడ్డి సుజాత (65) భర్త, కుమారులు మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. జీవనాధారంగా ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఇదే పరిస్థితిని అవకాశంగా మలుచుకున్నాడు క్యాబ్ డ్రైవర్ అంజిబాబు.

అద్దె కోసం వచ్చినవాడే హంతకుడు

ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అంజిబాబు, రెండు నెలల క్రితం సుజాత ఇంట్లో అద్దెకు చేరాడు. వృద్ధురాలి ఒంటరితనం, ఇంట్లో ఉన్న బంగారం గురించి తెలుసుకున్న అతడు దోపిడీకి పథకం రచించాడు. ఈ నెల 19వ తేదీ రాత్రి సుజాతను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న సుమారు 11 తులాల బంగారాన్ని అపహరించాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

నేరాన్ని దాచేందుకు స్నేహితుల సహకారం

తాను చేసిన నేరాన్ని స్నేహితులైన యువరాజు, దుర్గారావులకు అంజిబాబు తెలిపాడు. మరుసటి రోజు వారితో కలిసి కారును అద్దెకు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కోనసీమ జిల్లాలో గోదావరిలో పడేశారు.

అనుమానంతో మొదలైన దర్యాప్తు

కొన్ని రోజులుగా సుజాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె చెల్లెలు సువర్ణలతకు అనుమానం కలిగింది. ఈ నెల 24న సోదరి ఇంటికి వచ్చిన ఆమె, సుజాత కనిపించకపోవడంతో పాటు అద్దెకు ఉంటున్న అంజిబాబు కూడా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అంజిబాబు ఆచూకీ లభించగా, అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.

గోదావరిలో లభించిన మృతదేహం

నిందితుడిని తీసుకుని నాచారం పోలీసులు కోనసీమ జిల్లాకు వెళ్లి గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం మామిడికుదురు సమీపంలోని అప్పనపల్లి–కె.ఏనుగుపల్లి మధ్య వైనతేయ గోదావరిలో సుజాత మృతదేహం లభ్యమైంది. నాచారం సీఐ ధనుంజయ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు.

Read More
Next Story