ట్రంప్, జెలెన్ స్కీ సంభాషణలో పాల్గొన్న టెస్లా సీఈఓ.. ఎందుకు?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జరిపిన ఫోన్ సంభాషణలో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ పాల్గొన్నట్లు తెలిసింది.
కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో మాట్లాడిన సంభాషణలో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ హజరయినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అన్ని టెక్ కంపెనీలు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ పక్షాన నిలవగా, టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్ సరసన నిలిచారు. ఈ ఫోన్ కాల్ లో మస్క్ కూడా జాయిన్ అయినట్లు ఉక్రెనియన్ అధికారులు ధృవీకరించారు.
యుఎస్ వార్తా సైట్ ఆక్సియోస్‌లో కాల్ గురించిన నివేదిక వివరాలు ప్రచురితం అయ్యాయి. ఈ వార్త సంస్థకి కీవ్ లోని ఓ అధికారి సమాచారం అందించారని తెలిసింది. మస్క్ కాల్‌లో భాగం మాత్రమే కాదు, అతను ట్రంప్‌తో పాటు పక్కన ఉన్నాడని మరో అధికారి వార్తా సంస్థకు తెలిపారు. “మస్క్ లైన్‌లో లేడు, ట్రంప్ అతనికి ఫోన్ ఇచ్చాడు. వారు ఎక్కడో కలిసి ఉన్నారు” అని కొంతమంది అధికారులు తెలిపారు.
ఏమి చర్చించారు..
ఉక్రేనియన్ ప్రెసిడెంట్ మస్క్‌తో క్లుప్తంగా మాట్లాడినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలోని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీ అయిన స్టార్‌లింక్ సర్వీసెస్ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి సేవలు అందిస్తోంది. యుద్ధం ప్రారంభంలోనే రష్యా, తన శత్రు దేశానికి సంబంధించిన కమ్యూనికేషన్ సమాచారాన్ని నిర్వీర్యం చేసింది. దీంతో కీవ్ తప్పనిసరి పరిస్థితుల్లో స్టార్ లింక్ సేవలను ఉపయోగించుకుంటోంది.
ప్రధాన సంభాషణ జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగింది. అయితే కాబోయే అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధినేతతో ఏం మాట్లాడరన్నది మాత్రం తెలియ రాలేదు. అయితే కొన్ని నివేదికలు మాత్రం కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే మాట్లాడుకున్నారని అన్నారు. జెలెన్స్కీ మాత్రం.. తనకు ట్రంప్‌తో అద్భుతమైన సంభాషణ జరిగిందని, తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామని, ఇందుకు ట్రంప్ అంగీకరించారని తెలిపారు.
కొత్త పరిపాలనలో మస్క్ పాత్ర
బిలియనీర్ వ్యాపారవేత్త అయిన మస్క్ ట్రంప్ ప్రచారానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ప్రముఖ మద్ధతుదారులలో అగ్రగణ్యుడిగా నిలిచారు. ట్రంప్ మొదటి అంతర్జాతీయ కాల్‌లలో ఒకదానిలో అతను ఉన్నారనే వాస్తవం తదుపరి US అధ్యక్షుడితో అతని సన్నిహిత సంబంధాలను సూచిస్తుంది. అనేక మంది విశ్లేషకులు ఊహిస్తున్నట్లుగా, అతను కొత్త పరిపాలనలో క్రియాశీల పాత్ర పోషిస్తాడని అర్థమవుతోంది.
Next Story