Telangana High Court
x

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం.


కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు, అవినీతి జరిగిందని రిపోర్ట్‌ పేర్కొంది. ఇందులో పలువురి పేర్లను కూడా కమిషన్ తెలిపింది. ఈ క్రమంలోనే కమిషన్ రిపోర్ట్‌ను ఛాలెంజ్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ తన పరిధిని దాటిందని, సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని వారు తమ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలో తమకు సరైన అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.

వారి పిటిషన్లను స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారణ జరిగింది. ఇందులలో కేసీఆర్, హరీష్ రావు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

అసలు వివాదం ఏంటంటే..

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భారీ అవినీతి జరిగిందన్న విమర్శలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు డిజైన్ మార్పులు, అంచనా వ్యయాల పెరుగుదల, నిధుల వినియోగం, నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రధాన అంశాలుగా మారాయి.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో ఏముంది

కమిషన్ నివేదికలో ప్రాజెక్టు ప్రణాళికలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. అమలు దశలో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. సాంకేతిక సూచనలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించింది. బాధ్యత వహించాల్సిన అధికారులు విధులు సక్రమంగా నిర్వహించలేదని నివేదికలో పేర్కొంది. నిర్మాణ నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న అంశాన్ని కూడా కమిషన్ ప్రస్తావించింది. ఈ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలకు అవకాశం ఉందని స్పష్టం చేసింది.

హైకోర్టులో జరిగిన విచారణ

సోమవారం హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీష్ రావు తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు రిప్లై సమర్పించారు. రిప్లైపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. ఫిబ్రవరి 20లోపు రిటన్ సబ్‌మిషన్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

Read More
Next Story