
డిజిటల్ బాటలో తెలంగాణ విద్యుత్ సేవలు
టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారుల కోసం 8712441912 నంబర్‌తో వాట్సాప్ చాట్‌బాట్ సేవలు ప్రారంభమయ్యాయి. బిల్లులు, ఫిర్యాదుల వివరాలు ఇక మొబైల్‌లోనే!
దక్షిణ తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై కరెంటు కష్టాలైనా, బిల్లు వివరాలైనా కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పరిష్కారం కానున్నాయి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. దీనిపై సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులు 8712441912 నంబర్‌ను తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకుని, 'హాయ్' అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చని ఆయన వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ సరఫరా స్థితి, బిల్లింగ్ సమాచారం, కొత్త కనెక్షన్ల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రధానంగా విద్యుత్ బిల్లులు రాకపోయినా లేదా ఆన్‌లైన్ చెల్లింపులు అప్డేట్ కాకపోయినా ఈ చాట్‌బాట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సీఎండీ తెలిపారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మల వంటి అంశాలపై కూడా వినియోగదారులు ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
ఇటీవల విద్యుత్ బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలకు ఈ చాట్‌బాట్ అడ్డుకట్ట వేస్తుందని సంస్థ పేర్కొంది. బిల్లు పెండింగ్‌లో ఉందని వచ్చే నకిలీ కాల్స్ నమ్మవద్దని, వాట్సాప్ ద్వారా వాస్తవ సమాచారాన్ని సరిచూసుకోవాలని సూచించింది. వినియోగదారులకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మరింత మంది ప్రజలకు ఈ సేవలు చేరువయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

