ఆ విధానం ‘లైసెన్స్’ గా ఉపయోగపడుతోంది. శుభ్ మన్ గిల్
x

ఆ విధానం ‘లైసెన్స్’ గా ఉపయోగపడుతోంది. శుభ్ మన్ గిల్

ప్రస్తుతం ఐపీఎల్ లో బ్యాట్స్ మెన్ హవా నడుస్తోంది. ఎంతటి బౌలర్ అయినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే దీని వెనక ఇంపాక్ట్ సబ్ విధానం ఉందని యువ ఓపెనర్..


ఐపీఎల్ లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ సబ్ వల్ల బ్యాటింగ్ లోతు పెరిగిందని, బ్యాట్స్ మెన్ బాదడానికి ఓ లైసెన్స్ లా పనిచేస్తోందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ గిల్ అన్నారు. క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ ధైర్యంగా షాట్లు ఆడుతున్నారని అందువల్లే స్కోరు బోర్డు మీద పరుగుల వెల్లువ చూస్తున్నామని వివరించారు.

బుధవారం ఇక్కడ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు సాధించింది. దీంతో ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో 12 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించినట్లు అయింది. దీనిపై గిల్ స్పందించారు.
" ఐపీఎల్ లో పరుగుల వరద పారడంలో ఇంపాక్ట్ ప్లేయర్‌కు కొంత పాత్ర ఉందని నేను భావిస్తున్నాను. నేను అవుట్ అయినా కింద ఇంకా మంచి బ్యాట్స్ మెన్లు ఉన్నారనే భావన క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్లలో కలుగుతోంది. దీంతో స్వేచ్చగా బ్యాట్ ఝలిపిస్తున్నారు. నిజానికి ఇది బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడడానికి లైసెన్స్ ఇస్తోంది," మ్యాచ్ అనంతరం గిల్ అన్నాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ను బలంగా ప్రారంభించినప్పటికీ, రిషబ్ పంత్- అక్షర్ పటేల్ బాగా ఆడి 113 పరుగులు జోడించారని అన్నారు. తమ బౌలర్లు మేము అనుకున్న దానికంటే కొన్ని అదనపు పరుగులు ఇచ్చారని చెప్పారు. "ఒక దశలో మేము వారిని 200-210 పరుగుల లోపే పరిమితం చేయగలమని అనుకున్నాము. చివరి రెండు ఓవర్లలో మేము గతి తప్పాము," అని గిల్ అంగీకరించాడు.
"కానీ ఛేజింగ్‌లో ఉన్న మంచి విషయం ఏమిటంటే, ఎంత టార్గెట్ ఉందో మనకు తెలుస్తుంది. ఇది చిన్న మైదానం. ఛేదన సులువుగా ఉంటుంది. మన ప్రణాళికలు అనుకున్నట్లు అమలు చేయగలిగితే మ్యాచ్ ముగింపు అనుకూలంగా ఉంటుందని అన్నారు."
సంతోషంగా ఉంది: పంత్
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తన ప్రదర్శన పట్ల పంత్ సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజులు క్రికెట్ కు దూరంగా ఉన్నాను. కారు ప్రమాదం తరువాత చాలా మారిందని గతాన్నిగుర్తుచేసుకున్నారు. మొదటి సిక్స్ తనలో ఆత్మ విశ్వాసం పెంచిందని చెప్పుకొచ్చాడు. ‘నేను మైదానంలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఇక్కడ ఉంటే నాకు ఏదో కొత్త అనుభూతి వస్తుంది’ అన్నాడు. నేను ఎప్పుడు క్రీజులోకి వచ్చిన 100 శాతం ఉత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తానని వివరించాడు.
ఈ మ్యాచ్ లో కెప్టెన్ పంత్ 43 బంతుల్లో 88 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లకు పీడకలలు మిగిల్చాడు. ముఖ్యంగా మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో పంత్ విధ్వంసం తారాస్థాయికి చేరింది. ఈ ఓవర్లో నాలుగు సిక్స్ లు రెండు ఫోర్లు బాది మొత్తంగా 31 పరుగులు సాధించాడు. పంత్ ధాటిగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డును మోహిత్ శర్మ మూటగట్టుకున్నాడు.
ఇలా అయితే ఐసీసీ ట్రోఫిలు రావు
ఐపీఎల్ లో కొత్త గా ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ సబ్ విధానం వల్ల భారత జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని ఓ ప్రైవేట్ యూ ట్యూబర్ చెప్పుకొచ్చారు. భారత జట్టులో ఇప్పటికే ఆల్ రౌండర్ల కొరత ఉందని, ఇంపాక్ట్ సబ్ వల్ల ఈ సమస్య ఇంకా తీవ్రం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అతని విశ్లేషణ సరైనదే అని గత మ్యాచ్ అనుభవాలు చూస్తే తెలుస్తోంది.
ప్రస్తుత ఐపీఎల్ లో బాదుడేకు ప్రాధాన్యం పెరిగింది. ఏకంగా 12 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు వివిధ జట్లు సాధించాయి. అయినప్పటికీ చాలా తక్కువ మార్జిన్లతోనే జట్లు గెలుస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ ఢిల్లీ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఛేదించినంత పని చేసింది. విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది.
బౌలర్లు పూర్తి గా డీ మోరలైజ్ అయిపోతున్నారు. వాళ్ల ఎకానమీ పూర్తిగా పడిపోంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఫాస్ట్ బౌలర్లను సైతం బ్యాట్స్ మెన్ లెక్క చేయకుండా బాదేస్తున్నారు. దీనిపై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో స్పందిస్తూ.. నేను ఎందుకు బ్యాట్స్ మెన్ కాలేదని ఆలోచించాను అనే సమాధానం ఇచ్చాడు. దీనిబట్టి బ్యాట్స్ మెన్ హవా ఐపీఎల్ లో ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా జట్లు ఆల్ రౌండర్లని పక్కన పెట్టేస్తున్నాయి. ఇప్పటికే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లకు బౌలింగ్, లేదా బ్యాటింగ్ చేసే అవకాశాలు మాత్రమే లభిస్తున్నాయి. దీనివల్ల వారు ఏదో ఒక రంగంలో పాతుకుపోయారంటే.. టీమిండియా భారీ నష్టం తప్పదు.


Read More
Next Story