
గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల.. ఎంతంటే..!
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో కేంద్ర నిధుల బదిలీ ప్రారంభమైంది. మౌలిక సదుపాయాలు, పారిశుధ్య పనులకు గ్రామాలకు ఊరట లభించింది.
పంచాయతీ ఎన్నికల తర్వాత నిధుల కోసం ఎదురుచూస్తున్న గ్రామాలకు కీలక ఊరట లభించింది. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తాజా అప్‌డేట్‌గా తొలి విడతలో రూ.259.36 కోట్లను మంజూరు చేసింది. గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తైన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోవడంతో గతంలో నిధుల విడుదల నిలిచిపోయింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఎన్నికైన సర్పంచ్‌లు ఉన్నప్పుడే నిధులు నేరుగా పంచాయతీ ఖాతాలకు బదిలీ అవుతాయి. ఈ కారణంగానే కేంద్రం అప్పట్లో బ్రేక్ వేసింది.
ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫలితాలు వెలువడ్డాయి. కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. ఈ దశలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. సాంకేతిక అడ్డంకులు తొలగిన తర్వాత నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో జనవరి 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. మొత్తం 15వ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణకు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ నిధులను దశలవారీగా విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది.
నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న కొత్త సర్పంచ్‌లకు ఈ మంజూరు ఊరటగా మారింది. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి అవసరాలకు ఖర్చు చేయనున్నారు. నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి జమ కానున్నాయి.
నిధుల విడుదలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తవడం, పాలన ప్రారంభం కావడంతో గ్రామాభివృద్ధి పనులకు వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం మిగిలిన నిధులను కూడా విడతలవారీగా విడుదల చేయనుంది.

