
తెలంగాణ పంచాయతీలకు మరో రూ. 387 కోట్లు
రూ.646.46 కోట్లకు చేరిన కేంద్రం నిధులు. ఇంకా రావాల్సి మొత్తం ఎంతంటే..?
తెలంగాణ పంచాయతీలకు కేంద్ర మరో తీపి కబురు చెప్పింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిదులను విడతల వారీగా అందిస్తోంది. ఇప్పటికే తొలి విడత కింద రూ.259.36 కోట్లు విడుదల చేసింది. తాజాగా ఈ నిధుల రెండో విడతను రిలీజ్ చేసింది. ఈ రెండో విడతలో మొత్తం రూ.387 కోట్లు ఇచచ్చారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ పంచాయతీలకు కేంద్రం నుంచి అందించిన నిధులు రూ.646.46 కోట్లకు చేరింది. కాగా కేంద్రం నుంచి రావాల్సింది రూ.2,400 కోట్లు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో విడతల వారీగా నిధులు అందిస్తోంది.
మొత్తం 15వ ఆర్థిక సంఘం నిధుల కింద తెలంగాణకు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. ఈ నిధులను దశలవారీగా విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న కొత్త సర్పంచ్‌లకు ఈ మంజూరు ఊరటగా మారింది. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి అవసరాలకు ఖర్చు చేయనున్నారు. నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి జమ కానున్నాయి.
నిధుల విడుదలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తవడం, పాలన ప్రారంభం కావడంతో గ్రామాభివృద్ధి పనులకు వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం మిగిలిన నిధులను కూడా విడతలవారీగా విడుదల చేయనుంది.

