2028లో కాంగ్రెస్ కు 95 సీట్లు పక్కా
x
Revanth Reddy

2028లో కాంగ్రెస్ కు 95 సీట్లు పక్కా

ఒకవేళ 153 సీట్లయితే 100 సీట్లకు పైగా మెజారిటీ సాధిస్తామన్న ధీమాను వ్యక్తంచేశారు.


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80శాతం సీట్లతో పక్కాగా అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. నారాయణపేట, కొస్గిలో బుధవారం సర్పంచ్ ల సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు 2028 అసెంబ్లీఎన్నికల్లో 119 సీట్లయితే 80కి పైగా సీట్లతో కాంగ్రెస్సే రెండోసారి మెజారిటీతో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఒకవేళ 153 సీట్లయితే 100 సీట్లకు పైగా మెజారిటీ సాధిస్తామన్న ధీమాను వ్యక్తంచేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఇదే తన సవాల్ అని రేవంత్ అన్నారు. తాను అధికారంలో ఉన్నంతకాలం కాలకూటవిషం లాంటి కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి రానివ్వనని సవాలు చేశారు.

కొడంగల్ బిడ్డగా తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం దక్కనీయనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం కలే అన్నారు. కేసీఆర్ కు అధికారం, బీఆర్ఎస్ కు అధికారం ఇక కలగానే మిగిలిపోవటం ఖాయమని ఎద్దేవాచేశారు. పార్టీతో పాటు కేసీఆర్ కు కూడా భవిష్యత్తు లేదన్నారు. తెలంగాణ భవిష్యత్తంతా కాంగ్రెస్ తోనే ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాము, పార్లమెంటు ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చాము అని అన్నారు. జనాలు కూడా బీఆర్ఎస్ ను బండకేసి బాదారని రేవంత్ రెచ్చిపోయారు. 2029 అసెంబ్లీలో ఎవరిది పైచేయో తేల్చుకుందామని కేసీఆర్ కు రేవంత్ సవాలు విసిరారు.

ఈనెల 29వ తేదీనుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయని, అన్నీ అంశాలు సభలోనే చర్చిద్దాము రండి అని పిలిచారు. అసెంబ్లీలో చర్చించకుండా ఫామ్ హౌస్ లో పడుకుని, నిద్రలోనుండి మెలకువ వచ్చినపుడు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం కాదని ఎద్దేవాచేశారు. నిజమైనచర్చ అసెంబ్లీలోనే జరుగుతుందని, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో జనాలందరు చూస్తారు కాబట్టి అసెంబ్లీకిరమ్మని కేసీఆర్ ను ఆహ్వానించారు. రెండేళ్ళ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి తోలుతీస్తాను అనే సోయిలేని మాటలు, విమర్శలు చేయటం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కేసీఆర్ ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. పగసాధించటం మొదలుపెడితే రాష్ట్రానికి నష్టంజరుగుతుందని తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడే తెలుసన్నారు. అందుకనే కక్షసాధింపులకు దిగటంలేదని క్లారిటి ఇచ్చారు.

తాను ప్రమాణంచేసినపుడే కూలబడ్డారు..ఇంతకు మించిన శిక్ష ఇంకేమి కావాలి అని ఎద్దేవాచేశారు. కేసీఆర్ తనను తాను ఫామ్ హౌస్ లో బంధీగా మార్చుకుని చుట్టూ పోలీసులన పెట్టుకున్నట్లు చెప్పారు. చర్లపల్లికైనా, చంచల్ గూడకు పంపినా ఫామ్ హౌసులోని పరిస్ధితే అక్కడ కూడా ఉంటుందన్నారు. తనను కెలకవద్దని, మర్యాదగా ఉండదన్న కారణంతోనే తాను మాట్లాడటంలేదని చెప్పారు. నల్లమల నుండి వచ్చి జడ్పీటీసీ, ఎంఎల్ఏ, ఎంపీ అయిన తర్వాత ముఖ్యమంత్రిని అయినట్లు రేవంత్ గుర్తుచేశారు.

ప్రత్యేక నిధులు

కొత్తసంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని రేవంత్ ప్రకటించారు. పంచాయతీలకు యథావిధిగా అందే నిధులు కాకుండా చిన్నగ్రామాలకు రు. 5 లక్షలు, పెద్దగ్రామాలకు రు. 10 లక్షలు ప్రత్యేక అభివృద్ధినిధులు అందించబోతున్నట్లు తెలిపారు. ప్రత్యేక అభివృద్ధినిధులతో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలకు సంబంధం ఉండదన్నారు. గ్రామాల్లో సదుపాయాల కల్పనకు అభివృద్ధి ప్రణాళికలు తయారుచేసుకోవాలని సర్పంచ్ లకు సూచించారు. గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులను ఉపయోగించాలని చెప్పారు.

కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని శపథం చేశారు. ప్రతి గ్రామం, ప్రతి తండాకు రోడ్లు వేస్తాము, గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్ళు, రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల కోసం ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని, ప్రజాసేవ చేయాలని చెప్పారు. కొడంగల్ లో సమస్యల పరిష్కారానికే తన సోదరుడు తిరుపతిరెడ్డిని ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు రేవంత్ చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి దృష్టంతా సమస్యల పరిష్కారం మీదే ఉంచాలని రేవంత్ చెప్పారు.

Read More
Next Story