మీరెళ్లి పోయారు గాని మీ పేదోడి కారు కల మిగిలే ఉంది రతన్ జీ!
x

మీరెళ్లి పోయారు గాని మీ 'పేదోడి కారు' కల మిగిలే ఉంది రతన్ జీ!

పేదోడికి చౌక ధరకు కారు ఇవ్వాలన్న ఆయన కల నెరవేరకుండానే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కానరానిలోకాలకు ఎగిరిపోయారు. మరి ఆయన కలను ఎవరు నేర్చుతారో చూడాలి


జాతి కంట కన్నీరొలుకుతోంది. గుండెలు బాధతో మూలుగుతున్నాయి. దేశ పారిశ్రామిక విప్లవంలో ప్రధాన భూమిక పోషించిన రతన్ టాటా ఇక లేరన్న వార్త ఎందుకో మింగుడుపడడం లేదు. సరిగ్గా 48 గంటల కిందట కూడా- నేను బాగున్నాను, వయసుతో పాటు వచ్చే సమస్యల కోసమే ఆస్పత్రిలో చేరాను- అని చెప్పిన రతన్ టాటా అక్టోబర్ 9వ తేదీ రాత్రి 11.40 గంటల ప్రాంతంలో కన్నుమూశారనే వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు రెండు రకాలు. ఒకరు దేశం కోసం పారిశ్రామికాభివృద్ధిని కోరుకున్నవారు, మరొకరు తమ సొంత ఆస్తుల పెంపు కోసం పారిశ్రామికాభివృద్ధి చేపట్టిన వారు. రతన్ నావల్ టాటా మొదటి కోవకు చెందిన వారు. గుండు సూది మొదలు ఆకాశంలో ఎగిరే విమానం వరకు అన్నీ ఉత్పత్తి చేసినవారు. 12 రంగాల్లో 48 సంస్థలు నడుస్తున్నాయి. దేశదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. లక్షలాది మంది పని చేస్తున్నారు. అయినా ఆ మనిషి ముంబైలోని తన పాత ఇంట్లోనే ఉండేవారు.

X సౌజన్యంతో

నడమంత్రపు సిరితోనో, ఆశ్రిత పక్షపాతంతోనో ఎదిగిన వారు కాదు. నాలుగు డబ్బులు సంపాయించుకున్న తర్వాత ఏ విదేశానికో ఎగిరిపోయిన బాపతు కాదు. పటిష్ట భారతీయ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన వారు. భావితరాలకు దిశానిర్దేశం చేసిన వారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పెద్ద ముందడుగు వేసేందుకు తంటాలు పడుతున్న సమయంలో ఆయన దూరమయ్యారు. మనం ఈవేళ ఆ స్థితికి వచ్చామంటేనే అందుకు రతన్ టాటా లాంటి వారి దూరదృష్టి, కృషి, పట్టుదల కారణం.
నెరవేరని రతన్ టాటా కల!?
రతన్ టాటా అందరి లాంటి పారిశ్రామిక వేత్త కాదు. పెళ్లీ, పిల్లలు లేని ఈ పారిశ్రామిక దిగ్గజం ఈ శతాబ్దం మొదట్లో భారతీయ మధ్య తరగతి వర్గం సరికొత్త ఆలోచన చేసింది. ఏ దేశ అభివృద్ధికైనా రోడ్లు, రవాణాయే ప్రధానం. అవునన్నా కాదన్నా ఇండియాలో ఇంకా 34 శాతం పేదరికంలోనే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలతో తల్లిదండ్రులు ఓ చిన్నపాటి మోపెడ్ పై బతుకీడుస్తున్నారు. పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకుని భార్యతో ఓ భర్త ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడు.. ఎటువంటి రక్షణ లేకుండా వీళ్లు ఎందుకు ఇలా పోవాలి? భారతీయ కుటుంబాలను స్కూటర్‌లపై నిరంతరం చూడటం, తల్లిదండ్రుల మధ్య ఉన్న పిల్లలు నలిగిపోవడం, గతుకులు అతుకుల రోడ్లపై తరచూ జారిపడడం వంటివి చూసినపుడు రతన్ టాటాకి ఓ ఆలోచన వచ్చింది. దానిఫలితమే లక్ష రూపాయల నానో కారు.
రతన్ టాటా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో చదివారు. ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల డిజైన్లు చూస్తుంటారు. ఆ క్రమంలో వచ్చిందే కారు ఆలోచన. ద్విచక్ర వాహనాలను సురక్షితంగా ఎలా తయారు చేయాలో గుర్తించిన టాటా గ్రూపు నాలుగు చక్రాల కారు తయారీ రంగంలోకి దిగింది. ఆనాటి కార్లకు కిటికీలు లేవు, తలుపులు లేవు, కేవలం ప్రాథమిక డూన్ బగ్గీ మాత్రమే.
2000ల ప్రారంభంలో టాటా మదిలో మెలిచిన ఈ మధ్యతరగతి చౌకకారు చాలా సురక్షితమైందిగా భావించారు. చౌకగా కారును, సురక్షితంగా ఓ కుటుంబం ప్రయాణించేలా నానో కారును అందించాలని ఆయన తలిస్తే భారతీయ ప్రజలు దాన్ని తిరస్కరించారు. అయినా సరే ఆయన ప్రజల్ని తప్పుపట్టలేదు. టాటా మోటార్స్ ఎమెరిటస్ చైర్మన్ హోదాలో రతన్ టాటా "నానోను "చౌక కారు"గా మార్కెట్ చేయడంలో కంపెనీ పొరపాటు చేసింది" అన్నారు. ద్విచక్రవాహనానికి బదులు సురక్షితమైన నాలుగు చక్రాల వాహనాన్ని సరసమైన ధరకు అందించడమే లక్ష్యంగా లక్ష రూపాయలకు కారును అమ్మాలని ఆయన ఆయన అభిప్రాయపడ్డారు.

భారీ వర్షంలో మోటార్‌బైక్‌పై నలుగురితో కూడిన కుటుంబాన్ని చూసిన తర్వాత నానో కారును తయారు చేయాలనుకున్నారు. ఆర్థిక స్థోమత లేని వారి కోసం సురక్షితమైన ప్రత్యామ్నాయం ఆయన లక్ష్యం. అయితే డిజైన్ మొదలు కమర్షియల్ లాంచ్ వరకు అనేక సవాళ్లను ఎదుర్కొంది. లక్ష రూపాయలు చెల్లించి కారు బుక్ చేసుకోమని ప్రీ లాంచింగ్ ఆఫర్ ఇచ్చారు. నానో లాంచ్‌కు ముందు స్థానిక పరిభాషలో 'లఖ్టాకియా' కారు (రూ. 1 లక్ష) అని పేరుగాంచింది.. 2009 మార్చిలో నానో కారును రతన్ టాటా మార్కెట్ కి విడుదల చేశారు.
దేశంలోని పేద, మధ్యతరగతి కోసం టాటా చేపట్టిన ఈ నానో కార్ల చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. 2008 అక్టోబర్ లో ఆనాటి ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆందోళనలతో ఈ ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు తరలిపోయింది. ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమైంది. వీటితో పాటు కార్లలోనూ సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఇంజన్ లో నుంచి తరచూ మంటలు రావడం, భద్రత ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు రావడంతో అది నిజంగానే 'పేదోడి కారు'గా ముద్రపడింది. ఎప్పుడైతే ఇది 'పేదోడి కారు'గా ముద్రపడిందో అప్పటి నుంచి భారతీయ మధ్యతరగతి వర్గం ఈ కారును దూరం పెట్టింది. మారుతీ 800 లాంటి కార్లు 625 సీసీ ఇంజిన్లతో మార్కెట్ దొరుకుతున్నప్పుడు ఈ కారును ఎందుకు కొనుక్కోవాలన్న వాదనలు వచ్చాయి. చివరికి అనుకున్నంతా జరిగింది. 2012 ఏప్రిల్ లో నానో కార్ల అమ్మకాలు 10 వేలుగా ఉంటే ఆ తర్వాత అవి నెలకు 2,500 యూనిట్ల కంటే తక్కువకు పడిపోయాయి. కారు ప్రతికూలతలను ఎదుర్కొంది.
మీ కల నెరవేర్చే వారెవరూ...
టాటా గ్రూప్‌ను రతన్ టాటా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని పేరుగాంచినా, ఆటో పరిశ్రమకు ఆయన చేసిన సహకారం చాలా గొప్పదని కీర్తి సంపాయించినా నానో కారు ప్రాజెక్ట్ విఫలమైందని అంగీకరించారు.
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు-ఇండికాను తయారుచేయించి, సక్సెస్ చేసిన రతన్ టాటా తన మానసపుత్రిక- నానో ప్రాజెక్ట్- విఫలం కావడం పట్ల చాలా ఆవేదన చెందారు. పేదలు, మధ్యతరగతి కోసం ఉద్దేశించిన ఈ కారు ఇంత అనామకంగా మిగిలిపోతుందని, దానిపై అన్ని రకాల వ్యాఖ్యలు వస్తాయని రతన్ టాటా ఊహించి ఉండరు. అందుకే ఆయన- ఈ కంపెనీని మార్కెటింగ్ చేయడంలో కంపెనీ విఫలమైంది, అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను- అంటారు. ఏదైతేనేం సామాన్యుడికి చౌకగా సురక్షితమైన కారును అందించాలన్న రతన్ టాటా కల నెరవేరకుండానే 2019 నుంచి నానో కార్ల తయారీని టాటా మోటార్స్ నిలిపివేసింది.

అయితే త్వరలో ఇండోనేషియా సహకారంతో మరో కొత్తరకం కారును మధ్యతరగతి కోసం తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన లేరు. ఆయన కల మాత్రం మిగిలే ఉంది.
రతన్ టాటా నిష్క్రమణకు మనం అర్పించే నివాళి ఆయన్ను అనుకరించడమే. ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన ఆర్థిక సంపద, ఆయన సాధించిన విజయాలు విశ్వమానవ శ్రేయస్సుకు ఉపయోగపడింది. రతన్ టాటా వదిలివెళ్లిన వారసత్వం మన యువపారిశ్రామికవేత్తలకు మార్గదర్శకం కావాలి. ఆయన దూరదృష్టి వ్యాపారానికి మించింది. ఆయన ఈ దేశ ఉజ్వల భవిష్యత్ ను కోరుకున్నారు. అందుకు తానూ భుజం పట్టారు.


Read More
Next Story