ఫాస్ట్ ఫుడ్ ఎఫెక్ట్ :తెలంగాణలో డయాబెటిస్ డేంజర్!
x
ఫాస్ట్ ఫుడ్ తినడమే మధుమేహానికి కారణం

ఫాస్ట్ ఫుడ్ ఎఫెక్ట్ :తెలంగాణలో డయాబెటిస్ డేంజర్!

రుచుల కోసం పరుగులు… ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు


తెలంగాణ నగరాలు, పట్టణాల్లో ఫాస్ట్ ఫుడ్ వినియోగం వేగంగా పెరుగుతుండగా, అదే వేగంతో మధుమేహం కూడా పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజువారీ ఆహారపు అలవాట్లలో చోటుచేసుకున్న మార్పులు, ప్రాసెస్ చేసిన ఆహారాలపై పెరిగిన ఖర్చు...ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహం కేసులు పెరగడానికి ఫాస్ట్ ఫుడ్ ప్రధాన కారణంగా మారిందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అధికంగా ఫాస్ట్ ఫుడ్ తినడం మధుమేహ వ్యాధికి కారణమవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం తెలంగాణ, ఇతర దక్షిణ రాష్ట్రాల్లో పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ వినియోగానికి, అధిక మధుమేహ ప్రమాదానికి సంబంధం ఉందని తేలింది. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ ఆహార బడ్జెట్‌లో అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలపై చేసే ఖర్చు గణనీయంగా పెరిగింది.తెలంగాణ, ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఫాస్ట్ ఫుడ్‌పై చాలా ఖర్చు చేస్తున్నారు. దీని వల్ల టైప్-2 మధుమేహం వేగంగా పెరగడానికి కారణమవుతుందని వైద్యులు తేల్చారు.
ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (IJMR)లో ప్రచురితమైన ఫాడిస్ (ఫాస్ట్-ఫుడ్ అట్రిబ్యూటెడ్ డయాబెటిస్ ఇండెక్స్ స్టడీ) అనే పరిశోధనను అమెరికాలోని మేయో క్లినిక్, అలబామా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టారు. ఈ పరిశోధన ప్రకారం తెలంగాణ, తమిళనాడు,కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలు పోషకాహార పరివర్తనలో ముందున్నాయని వెల్లడైంది.పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్ వినియోగం వల్ల టైప్ 2 మధుమేహం (diabetes) రోగుల సంఖ్య పెరుగుతుందని వెల్లడైంది. మహిళల్లో మధుమేహానికి ఒక సూచికగా అధిక బరువు కారణమని తేల్చింది.అధికంగా ఫాస్ట్ ఫుడ్ వినియోగించే రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నివాసితులు ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు,రెడీ-టు-ఈట్ భోజనం వంటి ప్రాసెస్ చేసిన వస్తువులపై నెలకు ఒక్కో వ్యక్తి రూ.1,000 నుంచి రూ.1,450 వరకు ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది.

అధిక బరువే మధుమేహానికి కారణం

మహిళల్లో అధిక బరువు ఉండటమే మధుమేహం ప్రమాదాన్ని అంచనా వేయడానికి కారణమైన అంశమని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. తెలంగాణతో సహా దక్షిణ రాష్ట్రాల్లోని మహిళల్లో ఊబకాయం రేట్లు వాస్తవ మధుమేహ వ్యాప్తిని గణనీయంగా మించిపోయినట్లు గుర్తించారు. తెలంగాణలో పట్టణ పురుషుల్లో అధికంగా 3.8 శాతం మధుమేహ వ్యాప్తి నమోదైంది.దక్షిణ రాష్ట్రాలన్నింటిలోనూ నెలవారీ తలసరి ఆహార ఖర్చులో 28 నుంచి 34 శాతం ఫాస్ట్ ఫుడ్ కే వెచ్చిస్తున్నారు.
అందుకే రుచికరమైన ఫాస్ట్ ఫుడ్‌కు బదులుగా సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, జీవనశైలిలో మార్పులు అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే, భవిష్యత్తులో తెలంగాణలో మధుమేహం మహమ్మారి స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇదే.
Read More
Next Story