
తెలంగాణ-ఏపీ మధ్య ఐదూళ్ళ పంచాయతీ
ముందుచూపుతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలాగుంటాయి అనేందుకు కేంద్రం తీసుకున్న ఐదు పంచాయతీల విలీనం నిర్ణయమే ఉదాహరణ
తెలంగాణ-ఏపీ మధ్య మళ్ళీ ఐదూళ్ళ పంచాయతీ మొదలైంది. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఏపీ అసెంబ్లీ పంపిన ప్రతిపాదనను కేంద్రం బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించింది. అయితే సరిగ్గా ఇక్కడే మరో పంచాయతీ మొదలైంది. అదేమిటంటే 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ భూభాగంలోని ఐదు పంచాయతీలు పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తమపట్నంతో పాటు గుండాల గ్రామ పంచాయతీలను ఏపీలో కలుపుతు అప్పటి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి కారణం ఏమిటంటే ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దగ్గరలో ఉండే పై ఐదు పంచాయతీ గ్రామాలు ముంపునకు గురవుతాయని నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు.
ప్రాజెక్టు ఏపీలోను ముంపుగ్రామాలు తెలంగాణలో ఉంటే నిర్మాణ పరంగానే కాకుండా సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు కూడా చాలానే వస్తాయి. అందుకనే పై ఐదు గ్రామాలను ఏపీలో కలిపేయాలని చంద్రబాబునాయుడు బాగా ఒత్తిడితెచ్చారు. ఒత్తిడి ఫలితంగా పైన చెప్పిన ఐదు గ్రామపంచాయతీలను ఏపీ భూభాగంలో కలుపుతూ కేంద్రం నిర్ణయించింది. ముందుచూపుతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలాగుంటాయి అనేందుకు కేంద్రం తీసుకున్న ఐదు పంచాయతీల విలీనం నిర్ణయమే ఉదాహరణ.
ఎలాగంటే పైన చెప్పిన ఐదు పంచాయతీ గ్రామాలు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఆనుకుని ఉంటాయి. దేవాలయానికి సంబంధించిన భూములు, ఇతర ఆస్తులన్నీ పై గ్రామాల్లోనే ఉన్నాయి. దేవాలయం తెలంగాణలోను, దేవాలయానికి సంబంధించిన ఆస్తులు, భూములేమో ఏపీలో ఉండిపోయాయి. దేవాలయానికి చెందిన 900 ఎకరాలు పురుషోత్తమపట్నంలో ఉండిపోయాయి. గ్రామం ఏమో తెలంగాణలో నుండి ఏపీలోకి వెళిపోయింది. భూములు కావాలని దేవాలయం అధికారులు ఏపీని అడుగుతున్నా ఏపీ ఉన్నతాధికారులు పట్టించుకోవటంలేదు. దీనివల్ల దేవాలయం అభివృద్ధి, భద్రాచలం పట్టణంలో పారిశుధ్యం, పరిశుభభ్రత చాలా ఇబ్బందిగా మారుతోంది. భద్రాచలం పట్టణం పరిస్ధితులను, దేవాలయం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పైన చెప్పిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేయాలని ఎంతమంది ఎన్నిరకాలుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. తమ పంచాయతీలను తిరిగి తెలంగాణలోనే కలిపేయాలని పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏపీ ప్రభుత్వానికి పంపినా ఉపయోగం కనబడలేదు.
అప్పట్లో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురవుతాయని అనుకున్నా ఇపుడు ఆ పరిస్ధితి లేదని అంటున్నారు. కారణం ఏమిటంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోయింది కాబట్టి ముంపు ప్రాంతం కూడా పరిమితంగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇపుడు అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంటు ఉభయసభల్లో చర్చలు జరిగిన సందర్భంగా ఐదు గ్రామపంచయతీలపైన కూడా పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఏపీలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకుని రావాలని తెలంగాణ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా కోరారు. మరి ఐదు గ్రామాల పంచాయతీని కేంద్రం సీరియస్ గా తీసుకుని పరిష్కరిస్తుందా లేకపోతే ఈ పంచాయతీ ఇంకా కంటిన్యు అవుతుందా చూడాల్సిందే.

