రమజాన్‌కు ముందే హలీం ఘుమ ఘుమలు
x
హైదరాబాదీలను నోరూరిస్తున్న హలీం (ఫొటో కర్టసీ : ఎక్స్ పోస్టు)

రమజాన్‌కు ముందే హలీం ఘుమ ఘుమలు

తెలంగాణకు జరూర్ ఆనా… హైదరాబాద్ హలీం జరూర్ ఖానా!


రమజాన్ మాసం ఇంకా మొదలుకాకముందే హైదరాబాద్‌లో హలీం సందడి మొదలైంది. నగరమంతా హలీం సువాసనలతో నిండిపోతోంది.నగరమంతా హలీం బట్టీలు, హలీం ప్రియులతో కళకళలాడుతోంది.

హైదరాబాద్ హలీమ్ స్సెషాలిటి, అది ఇంట్లో కిచెన్ కి లొంగకపోవడమే. ఏ వంటనైనా ఇంట్లో చేయవచ్చు. యుట్యూబ్ ఓపెన్ చేసుకుని ఇపుడు వంటలన్నీ ఇంటిని ప్రయోగ శాల చేస్తున్నాయి. ఒక్క హలీమ్ మాత్రం వంటింట్లోకి ప్రవేశించలేకపోతున్నది. హలీమ్ కోసం రంజాన్ దాకా ఆగాల్సిందే. హాలీం వెనక మతాల తారతమ్యం లేకుండా జనం ఆదుర్దా ఉంది.అందుకే రమజాన్ రాకముందే హైదరాబాదీలను హాలీమ్ పలకరిస్తూన్నది.

ఫిబ్రవరి 17వతేదీన రమజాన్ ఉపవాస దీక్షల మాసం ప్రారంభం కానుంది. ప్రతీ ఏటా హైదరాబాదీలను విశేషంగా ఆకట్టుకుంటున్న హలీం విక్రయాలు ఈ ఏడాది రెండు వారాల ముందే ప్రారంభం అయ్యాయి. పిస్తా హౌస్ ఇప్పటికే నుమాయిష్ లో హలీం విక్రయాలు మొదలుపెట్టింది. మరో వైపు ప్రముఖ హలీం అడ్డాలైన సర్వి రెస్టారెంట్,కేఫే 555 అవుట్ లెట్ లలోనూ హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇంకో వైపు పాతనగరంతోపాటు నగరంలో పలు ప్రాంతాల హోటళ్ల ముందు హలీం బట్టీల నిర్మాణం చురుకుగా సాగుతోంది.

వారెవ్వా హలీం

రాష్ట్ర పర్యాటక శాఖ ‘తెలంగాణకు జరూర్ ఆనా, హైదరాబాద్ కా హలీం జరూర్ ఖానా’ అంటూ ప్రచారం చేస్తోంది.రమజాన్ సీజన్‌లో హలీమ్ రుచి అనుభూతి వేరుగా ఉంటుందని హైదరాబాదీలకు చిరపరిచితమే.‘వారెవ్వ హలీం’ అంటూ నగర ప్రజలు వేడి వేడి హలీంను తెగ లాగించేస్తున్నారు. హలీమ్ బట్టీలు చాలా సెంటర్లలో కనిపిస్తాయి. సిటీలోని కేఫ్ 555, పారాడైజ్, సర్వీ, కేఫ్ బహార్, గార్డెన్,సుభాన్ బేకరి హలీం,షాదాబ్ , నిమ్రా, పిస్తాహౌస్ ల హలీం కోసం ప్రజలు ఎగబడతారు. ఈ రెస్టరాంట్లు కూడా నగరంలోని మూలమూల హలీం ని అందుబాటులోకితెచ్చేందుకు స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నాయి.

హైదరాబాద్ హలీంకు జీఐ ట్యాగ్

హైదరాబాద్ హలీం విక్రయాల జోరు గతంలో కంటే పెరగవచ్చని హోటల్ యజమానులు అంచనా వేస్తున్నారు. హైదరాబాదీ హలీం ఆహార విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన జీఐ ట్యాగ్ ను పొందింది.
హైదరాబాద్ నగరం తన ప్రత్యేక వంటకాలతో రంజాన్‌ పండుగను జరుపుకుంటోంది. గోధుమలు, పప్పులు, మసాలా దినుసులు,పొట్టేలు మాంసంతో వండిన ప్రసిద్ధ హలీం నగరంలో ఈ ఏడాది పెరిగాయని ఓ హోటల్ యజమాని మాజిద్ అఫ్సర్ చెప్పారు. వేడి వేడి హలీంపై నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేసి వడ్డిస్తున్నారు.

ఎన్నెన్నో రుచులు

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ హోటళ్లలో హలీంతోపాటు చికెన్ 65, నల్లి ఘోష్, తలవా ఘోష్ట్, ఉడికించిన గుడ్డుతో విభిన్న రుచులను అందుబాటులోకి తీసుకువచ్చారు. సర్వీ హలీమ్ సుగంధ ద్రవ్యాలు , క్లాసిక్ ఇరానీ రుచులతో ప్రశంసలు అందుకుంటుంది. పిస్తా హౌస్ ఇప్పటికే ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఈ ఏడాది హలీం ను జనానికి పరిచయం చేసింది . ఈ రమజాన్ సీజనులో హలీంతోపాటు అల్ ఫరూజ్ సోను కబాబ్,మరగ,పత్తర్ కా ఘోష్త్ , మటన్ బిర్యానీ, భేజా ఫ్రై, గుర్దా కలేజీ, దహీ వడ ఫుడ్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రమజాన్ నెలలో దర్శనమిచ్చే హలీం ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటున్నారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీమ్‌ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారని ఇస్లామిక్ రచయిత షేక్ ముజాహిద్ చెప్పారు. ప్రతీ ఏటా హలీం విక్రయాల ద్వారా హోటళ్ల యజమానులకు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది.
రమజాన్ నెల సమీపిస్తున్న కొద్దీ హైదరాబాద్‌లో హలీం సందడి మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రతీ ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరిగే హలీం సీజన్ ఈ ఏడాదీ ముందుగానే ప్రారంభమవడంతో హోటళ్ల యజమానులు ఆశావహంగా ఉన్నారు.
Read More
Next Story