
విద్యార్ధినులకు స్కూటీలిచ్చే ఆలోచన
కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ 2023 అసెంబ్లీ ఎన్నికల నాటిది
కాలేజీలకు వెళుతున్న విద్యార్ధినులకు స్కూటీలు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతు విద్యార్ధినులకు స్కూటీల విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్న హామీ 2023 అసెంబ్లీ ఎన్నికల నాటిది. అప్పటి ఎన్నికల్లో రేవంత్ చాలా హామీలిచ్చాడు. ఆడవాళ్ళకు తులం బంగారమని, 2500 రూపాయల పెన్షన్ అని, కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు పంపిణీ చేస్తామని గొప్పగా ప్రకటించాడు. అయితే ఈ హామీల్లో ఇప్పటికి ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. ఆడవాళ్ళకు తులం బంగారంలేదు, అమ్మాయిలకు స్కూటీ కూడా రాలేదు.
పై హామీలన్నీ కూడా కేవలం ఓట్లకోసమే రేవంత్ ఇచ్చాడన్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి సంబంధంలేకుండా, కనీసపాటి ఆలోచన కూడా లేకుండానే నోటికొచ్చిన హామీలు ఇచ్చేయటం రాజకీయ నేతలకు బాగా అలవాటైపోయింది. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన తర్వాత అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజున రేవంత్ కు విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామనే హామీ ఇచ్చిన విషయం గుర్తుకొచ్చింది. అందుకనే ఎలాంటి సంబంధంలేకపోయినా కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు స్కూటీలను ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పారు. రేవంత్ లో చిత్తశుద్ది ఉంటే స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పటం కాదు ఈపాటికే ఇచ్చేసుండాల్సింది. తులం బంగారం, స్కూటీల విషయాలను ప్రతిపక్షాలు ఎంతగా ప్రస్తావిస్తున్నా రేవంత్ మాత్రం గుర్తులేదన్నట్లే వ్యవహరించాడు.
హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అనుకున్నంత ఈజీ కాదన్న విషయం రేవంత్ కు కూడా బాగా తెలుసు. రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపించబోతున్నట్లు చెప్పారు. మహిళా జర్నలిస్టులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నాడు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నాడు. పోలీసుశాఖతో సహా అవకాశం ఉన్న ప్రతి శాఖలోను మహిళా అధికారులకు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రేవంత్ గుర్తుచేశాడు. మహిళల ఆర్ధికశక్తి పెరిగినపుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నాడు.
హైదరాబాద్ లోని డీజల్ బస్సులను 2026 డిసెంబర్ కల్లా జిల్లాలకు తరలించేస్తామని చెప్పాడు. హైదరాబాద్ లో వందశాతం ఈవీ బస్సులనే నడుపుతామన్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 9లోపు నగరంలోని అన్నీ రూట్లలో ఈవీలే ఉంటాయని ప్రకటించారు. తర్వాత ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికైన 25మందికి ప్రభుత్వం జ్ఞాపికలను అందించింది.

