
మావోయిస్టుల ఆయుధాల గుట్టు తెలిసిపోయింది
ఈ తుపాకులు పోలీసు శాఖలోని చాలామంది అధికారులకు అందుబాటులో ఉండవు
ఈమధ్యనే లొంగిపోయిన మావోయిస్టులు స్వాధీనం చేసిన ఆయుధాలను చూసి పోలీసు ఉన్నతాధికారులకు మతిపోయింది. మావోయిస్టుల దగ్గర అత్యంత అధునాతన ఆయుధాలు ఉంటాయని(Telangana DGP) డీజీపీ బీ శివధర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఏమాత్రం ఊహించలేదు. చాలాకాలంగా (Maoists)మావోయిస్టులు (AK 47 rifles) ఏకే 47 తుపాకులు, ఇన్సాస్ తుపాకులు వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఈ తుపాకులు కూడా పోలీసు శాఖలోని చాలామంది అధికారులకు అందుబాటులో ఉండవు. అంతటి అధునాతన తుపాకులను మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు, వారి రక్షణ దళాలు వాడేస్తున్నాయి. గతంలో లొంగిపోయిన మావోయిస్టుల నుండి లేదా ఎన్ కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల దగ్గర ఇలాంటి తుపాకులు చాలానే దొరికాయి.
అయితే మొన్నటి లొంగుబాటులో మావోయిస్టులు స్వాధీనం చేసిన తుపాకులు మామూలువి కావు. ఏకే 47, ఇన్సాస్ తుపాకులను మించినవి. అవేమిటంటే అమెరికన్ మేడ్ కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ మేక్ తావర్ సీక్యూబీ, హెలికాప్టర్లను సైతం కూల్చగలిగిన గ్రనేడ్ లాంచర్లు. అమెరికన్ మేడ్ కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ మేడ్ తావర్ సీక్యూబీ తుపాకులను మావోయిస్టులు వాడుతున్నారన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం ఊహించకపోవటంతో షాక్ తిన్నారు. లొంగిపోయింది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PGLA) కమాండర్ బర్సేదేవాతో పాటు 20 మందే అయినా స్వాధీనం చేసిన తుపాకులు 48. 8 ఏకే 47 తుపాకులు, 10 ఇన్సాస్ రైఫిల్స్, 8 ఎస్ఎల్ఆర్లు, 4 గ్రనేడ్ లాంచర్లు, 11 సింగిల్ షాట్ తుపాకులు, 1 ఎయిర్ గన్,, 2 గ్రనేడ్లు, 93 మ్యాగజైన్లతో పాటు 2206 బుల్లెట్లను మావోయిస్టులు స్వాధీనం చేశారు.
ఇపుడు పాయింట్ ఏమిటంటే మావోయిస్టులకు అమెరికా, ఇజ్రాయెల్ మేక్ అత్యంత ఆధునిక తుపాకులు ఎలా చేరాయి ? దీనికి పోలీసుల విచారణలో దేవా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతగుప్ప అడవుల్లో 2004లో పెద్ద దాడి జరిగింది. చింతగుప్ప అడవుల్లో ఏప్రిల్ 9వ తేదీన సీఆర్పీఎఫ్ జవాన్లు సుమారు 100 మంది వెళుతున్నారు. ఆ సమయంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టుల దాడిలో కొందరు జవాన్లు చనిపోయారు. వారినుండే ఇజ్రాయెల్ తావర్ సీక్యూబీ తుపాకులతో పాటు మరికొన్ని ఆధునిక ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్ళారు. మరోసారి ఇదే అడవుల్లో జరిగిన మరో దాడిలో కూడా జవాన్ల నుండి మావోయిస్టుల అమెరికన్ మేడ్ కోల్ట్ రైఫిల్ తుపాకులను ఎత్తుకెళ్ళారు. ఇలాంటి అనేక దాడుల్లో జవాన్ల నుండి మావోయిస్టులు అత్యంత ఆధునిక ఆయుధాలను ఎత్తుకెళ్ళినట్లు దేవా చెప్పినట్లు సమాచారం.
మూడు మార్గాల్లో సేకరణ
మావోయిస్టులు మూడుమార్గాల్లో ఆయుధాలను సమకూర్చుకుంటారు. మొదటిది కొనుగోలు చేయటం, రెండోది సొంతంగా తయారుచేసుకోవటం, మూడోది భద్రతాదళాలపై దాడులు చేసి ఆయుధాలను ఎత్తుకెళ్ళటం. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేయాలి కాబట్టి కేంద్రప్రభుత్వం భద్రతాదళాలకు అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్ లాంటి దేశాల నుండి కొనుగోలు చేసిన అత్యంత అధునాతన ఆయుధాలను అందిస్తోంది. అలాంటి ఆయుధాలనే భద్రతాదళాలు నుండి మావోయిస్టులు లాగేసుకున్నారు. అలా ఎత్తుకెళ్ళిన ఆయుధాలనే తిరిగి మావోయిస్టులు భద్రతాదళాలపైన ప్రయోగిస్తున్నారు.
1980-90ల్లో పీపుల్స్ వార్ గ్రూప్ బలంగా ఉన్న కాలంలో అధునాతన ఆయుధాలను ఎక్కువగా శ్రీలంకలోని ఎల్టీటీఈ నుండి సమకూర్చుకునేది. అలాగే నేపాల్, చైనా, బంగ్లాదేశ్ కు చెందిన ఆయుధ డీలర్ల నుండి కూడా ఆయుధాలను సేకరించేవారు. ఇక సొంత తయారీ అంటే నాలుగు అధునాతన ఆయుధాలను సమకూర్చుకున్న తర్వాత వాటిని బాగా అధ్యయనం చేసేంతటి సాంకేతిక పరిజ్ఞానం పీపుల్స్ వార్ గ్రూపులో ఉండేది. ఆధునిక ఆయుధాలను అధ్యయనం చేసిన తర్వాత అలాంటి వాటినే సొంతంగా పీపుల్స్ వార్ గ్రూప్ తయారుచేసుకునేది.
మావోయిస్టులు స్వాధీనం చేసిన ఆయుధాలు ఎంతటి సంచలనం సృష్టించాయంటే స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి డీజీపీ శివధర్ రెడ్డి సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, ఒడిస్పా రాష్ట్రాల డీజీపీలకు కూడా లేఖలు రాయబోతున్నారు. 2004 చింతగుప్ప అడవుల్లో మావోయిస్టుల దాడిలో బలైపోయిన జవాన్లు వాడిన ఆయుధాల ఇన్వెంటరీలను చెక్ చేయాలని తెలంగాణ డీజీపీ లేఖలో పేర్కొన్నబోతున్నారు. ఎందుకంటే ప్రతి తుపాకీకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. అప్పట్లో పోయిన తుపాకీలు, ఇపుడు మావోయిస్టులు స్వాధీనం చేసిన తుపాకీల సీరియల్ నెంబర్లను చెక్ చేయబోతున్నారు. మొత్తానికి ఇపుడు స్వాధీనం చేసిన అత్యంతఆధునాతన ఆయుధాలు కాకుండా అమెరికన్, ఇజ్రాయెల్ మేడ్ తుపాకులు ఇంకా మావోయిస్టుల దగ్గర ఎన్ని ఉన్నాయి ? అన్న విషయాలనే దేవా నుండి పోలీసు ఉన్నతాధికారులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విచారణలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

