పేద రైతుకి  మెట్రోలోకి అనుమతి లేదా?
x

పేద రైతుకి మెట్రోలోకి అనుమతి లేదా?

రైతు ధరించిన బట్టలు అపరిశుభ్రంగా ఉన్నాయని రైలు ఎక్కనివ్వలేదు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఇది ఎక్కడ జరిగిందంటే..


మెట్రో రైలు ఎక్కేందుకు వచ్చిన ఓ రైతును మెట్రో స్టేషన్‌ అధికారి అడ్డుకున్నారు. రైలు ఎక్కనివ్వలేదు. కారణం ఆ రైతు ధరించిన బట్టలు మురికిగా ఉండడమే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా సుమోటోగా స్వీకరించిన (NHRC) తక్షణమే ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ఇటు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌కు నోటీసు పంపింది.

ఎవరైనా నిషేధిత వస్తువులు తీసుకెళ్తున్నా లేక అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే నిబంధనల ప్రకారం అడ్డుకోవచ్చని, అయితే ధరించిన దుస్తుల ఆధారంగా ప్రయాణాన్ని అడ్డుకోరాదని " ఒక ప్రకటనలో NHRC సూచించింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

వీడియో వైరల్..

ఫిబ్రవరి 27న మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. మెట్రో స్టేషన్‌లోని బ్యాగ్ చెకింగ్ పాయింట్ వద్ద ఓ అధికారి రైతును అడ్డుకున్నాడు. తలపై మూటతో వచ్చిన రైతును రైలు ఎక్కేందుకు ఆయన నిరాకరించాడు. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఆ అధికారిని ప్రశ్నించాడు. మెట్రో ప్రయాణీకులకు డ్రెస్‌కోడ్‌ తప్పనిసరి అని రూల్ ఏమైనా ఉంటే చూపించండి అని నిలదీశాడు. లేదంటే మెట్రో కేవలం వీఐపీలకు మాత్రమే నడుపుతున్నారా? అని ప్రశ్నించాడు. కర్నాటకలోని బెంగళూరు రాజాజీనగర్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

Read More
Next Story