
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏదో తెలుసా..!
గోరంత కూడా ఉండని ఈ జీవి వల్ల సంభవిస్తున్న మరణాలు చూస్తే ఇదెంత ప్రమాదకరమో ఇట్టే అర్థమవుతుంది.
భూమిపైన ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? ఈ ప్రశ్న వినడం ఆలస్యం మన మెదడు ఒక భయంకరమైన జంతువును గుర్తు చేస్తుంది. కొందరికి ఇప్పుడు ఉన్న పులి, సింహం, విషపూరితమైన పాములు వంటివి గుర్తుకు వస్తే.. మరికొందరికి ఎప్పుడో అంతరించి పోయిన డైనోసార్లు గుర్తుకొస్తాయి. ఇంకా కొంత మంది ఉంటారు.. వారికి అయితే ఫిక్షనల్ క్యారెక్టర్స్ రూపంలో అత్యంత భయంకరంగా గాడ్జిల్లాను మించేలా ఊహాగానాలు కళ్ళముందే మెదులుతాయి. పెద్దపెద్ద కోరలు, పదునైన పంజాలు, వాటిని మించిన ఆకారం ఇలా రకరకాలు ఊహిస్తారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అవన్నీ ట్రాష్ అని అంటున్నారు. ప్రస్తుతం భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవి.. మన వేలి గోరంత కూడా ఉండదని చెప్తున్నారు. అవును వాళ్లు చెప్పింది నిజమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికార్డ్‌లు, పరిశోధనలు కూడా అదే చెప్తున్నాయి. గోరంత కూడా ఉండని ఈ జీవి వల్ల సంభవిస్తున్న మరణాలు చూస్తే ఇదెంత ప్రమాదకరమో ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ జీవి ఏంటనేగా మీ సందేహం.. అదే ‘దోమ’.
మనం అప్పుడప్పుడే నిద్ర పడుతుందని అనుకుంటున్నప్పుడు చెవి దగ్గర ఒకటే గోల చేస్తుంది. సందు దొరకడం ఆలస్యం వచ్చి మన రక్తాన్ని జుర్రేస్తుంది.. ఆ దోమే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి. మన జీవితంలో ఎన్నో దోమల్ని చంపి ఉండొచ్చు కానీ.. వాటి ముందు ఆ సంఖ్య బలాదూరే. వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలను చూస్తే ఎవ్వరైనా నివ్వెరబోవాల్సిందే. ప్రతి ఏడాది దోమ కాటు కారణంగా 7 లక్షల 25వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు ప్రధాన కారణం దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు.
దోమల వల్ల మలేరియా, డెంగీ, వెస్ట్ నైల్, యెల్లోఫీవర్, చికెన్‌గున్య ఇలా మరెన్నో ప్రాంతాక వ్యాధులు వస్తాయి. ప్రతి ఏడాది 7.25 లక్షల మరణాలు దోమల కాటు వల్ల వచ్చే ఇలాంటి వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయి. ఈ వ్యాధులను తమ వెంటే పెట్టుకుని ఈ దోమలు తిరగడం వల్లే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జీవిగా దోమ నిలిచింది.
భూమిపై ఉన్న 195 దేశాల్లో ఐస్‌ల్యాండ్ మినహా మిగిలిన అన్ని దేశాల్లో దోమల చాలా సాధరణమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. మనుషులు లేని దీవుల్లో కూడా దోమలు ఉన్నాయి. పెద్దపెద్ద జంతువులు సైతం వీటి కాటు వల్లే వచ్చే వ్యాధులకు బలి అవుతుంటాయని నివేదికలు చెప్తున్నాయి. చాలా సాధరణంగా కనిపించే ఈ దోమల్లో మొత్తం 3,700 జాతులు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది శాస్త్రవేత్తలు ఈ దోమల వచ్చే వ్యాధులు ఏ స్టేజీలో ఉన్న చికిత్స అందించాలన్న లక్ష్యంతో ప్రయోగాలు చేస్తున్నారు. అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దోమల వచ్చే అనేక వ్యాధులను సరైన చికిత్స అందడం లేదు. చాలా వ్యాధులను ముందుగా గుర్తించి చికిత్స అందిస్తేనే మనషి మనకు దక్కుతాడని, ముదిరితే ఏం చేయాలేమని వైద్యులు చేతులెత్తేస్తున్నారు.