
విడుదలైన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11వ తేదీన ఏకకాలంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పోలింగ్ జరగబోతోంది. 13వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది
పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్(Municipal Election Schedule) ను విడుదలచేసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11వ తేదీన ఏకకాలంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు పోలింగ్ జరగబోతోంది. 13వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2996 వార్డులున్నాయి. 8203 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. అలాగే 136 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఈనెల 28వ తేదీన నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 30వ తేదీన నామినేషన్ల దాఖలకు ఆఖరుతేది. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగంచుకోబోతున్నారు. ఈరోజు షెడ్యూల్ విడుదలైన కారణంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చేసింది.
షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగిపోవటం ఖాయం. మెజారిటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుకోవాలని అన్నీపార్టీలు గట్టి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అయితే అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు అదనపు బలమనే చెప్పాలి. ఈమధ్యనే జరిగిన పంచాయితి ఎన్నికల్లో మెజారిటి పంచాయితీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారు. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఘనవిజయం సాధించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నమ్మకంతో ఉన్నాడు. ఇదే విషయాన్ని పదేపదే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలకు చెబుతున్నాడు. పార్టీ గుర్తులమీద జరగబోయే ఎన్నికలు కాబట్టి పార్టీల అధినేతలే డైరెక్టుగా రంగంలో ఉంటారు. అందుకనే తెలంగాణలో ఎన్నికల వేడి అమాంతం పెరిగిపోవటం ఖాయం.

