బీఆర్ఎస్ రగిలిస్తున్న కొత్త చిచ్చు
x
Revanth and KTR on Districts reorganization

బీఆర్ఎస్ రగిలిస్తున్న కొత్త చిచ్చు

జిల్లాల పునర్వ్యవస్ధీకరణ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అలా ప్రకటించారో లేదో వెంటనే బీఆర్ఎస్ ఇలా నిప్పు రాజేయటానికి రెడీగా అవుతోంది


జిల్లాల పునర్వ్యవస్ధీకరణ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అలా ప్రకటించారో లేదో వెంటనే బీఆర్ఎస్ ఇలా నిప్పు రాజేయటానికి రెడీగా అవుతోంది. మహబూబ్ నగర్ లో పార్టీ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదన్న సాకుతో (Revanth) రేవంత్ ప్రభుత్వం కొన్ని జిల్లాలను ఎత్తేయాలని చూస్తోందని ఆరోపించారు. ఒక్క జిల్లాను తగ్గించినా ఉద్యమం చేస్తాం, మంటలు రాజేస్తామంటు ప్రభుత్వానికి కేటీఆర్(KTR) వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత 10 జిల్లాల రాష్ట్రాన్ని కేసీఆర్(KCR) 2016లో 30 జిల్లాలు చేసి తర్వాత మరో మూడు జిల్లాలు కలిపి మొత్తానికి 33 జిల్లాలను ఏర్పాటుచేశారు.

పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలుగా ఏర్పాటుచేయటంలో పరిపాలనా సౌలభ్యం ఉంది అనటంలో సందేహంలేదు. అయితే జిల్లాల సంఖ్యను పెంచటంలో కేసీఆర్ ప్రభుత్వం శాస్త్రీయతను పాటించలేదు. తనిష్టం వచ్చినట్లు కేసీఆర్ జిల్లాల స్వరూపాన్ని మార్చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలుంటే మరికొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు నియోజకవర్గాలున్నాయి. ఒక జిల్లాలో ఒకే నియోజకవర్గం ఎందుకుంది ? మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఎందుకున్నాయి ? అనేందుకు అప్పట్లో ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఇంత అశాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటును సమర్ధించుకునేందుకు కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఏవేవో తమకిష్టమైన ప్రకటనలు చేస్తున్నారు.

నియోజకవర్గమూ, జిల్లా రెండూ వనపర్తే

ఉదాహరణకు తీసుకుంటే వనపర్తి నియోజకవర్గం ఒక్కదానితోనే కొత్తగా వనపర్తి జిల్లాను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. నియోజకవర్గం, జిల్లా కేంద్రం రెండూ వనపర్తే కావటం విచిత్రం. ఈ జిల్లాలోకి కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని కొన్నిప్రాంతాలు కలుస్తాయి. అలాగే సిర్పూరు, అసిఫాబాద్ నియోజకవర్గాలతో కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లాను ఏర్పాటుచేశారు. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ తో మంచిర్యాల్ జిల్లా ఏర్పడింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలను కలిపి ఆదిలాబాద్ జిల్లాను ఏర్పాటుచేశారు. బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బెల్లంకొండ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లాను ఏర్పాటుచేశారు.

కల్వకుర్తి, షాద్ నగర్, ఇబ్రహింపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ 8 నియోజకవర్గాలతో ఒక జిల్లాను ఏర్పాటుచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే ముషీరాబాద్, మలక్ పేట, అంబర్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్ పురా, బహద్దూర్ పురా, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ 12 నియోజకవర్గాలను కలిపి కేసీఆర్ హైదరాబాద్ జిల్లాగా ఏర్పాటుచేశారు. ఖమ్మం, పాలేర్, మధిర, వైరా, సత్తుపల్లి ఐదు నియోజకవర్గాలతో ఖమ్మం జిల్లాను ఏర్పాటుచేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జిల్లాల ఏర్పాటులో ఒక పద్దతి, శాస్త్రీయత లేదన్న విషయం అర్ధమవుతోంది. ఎలాగంటే వనపర్తి నియోజకవర్గంతో మాత్రమే వనపర్తి జిల్లాను ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండు నియోజకవర్గాలతో మరో జిల్లాను, మూడు నియోజకవర్గాలతో ఇంకో జిల్లాను ఏర్పాటుచేసింది.

పూర్తిగా అశాస్త్రీయమేనా ?


ఒక జిల్లాలో కేవలం ఒక్క నియోజకవర్గం, రెండు నియోజకవర్గాలతో మరో జిల్లా, మూడు నియోజకవర్గాలతో ఇంకో జిల్లాను ఏర్పాటుచేసిన కేసీఆర్ ప్రభుత్వం ఐదు నియోజకవర్గాలతో ఒక జిల్లా, 14 నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఎలా ఏర్పాటుచేసింది. శాస్త్రీయపద్దతిలో చేసుంటే కాస్త అటు ఇటుగా అన్నీ జిల్లాల్లోను నియోజకవర్గాలు సమంగా ఉండుండాలి. 119 నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలను 17 జిల్లాలుగా మార్చి ఉండవచ్చు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 25 పార్లమెంటు నియోజకవర్గాలతో 25 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒకజిల్లాగ ఏర్పాటు చేయాలని అనుకోవటంలో శాస్త్రీయత కనబడుతోంది. అరకు పార్లమెంటు పరిధి భౌగోళికంగా చాలా పెద్దది కావటంతో ఈ నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజించి మొత్తంమీద ఏపీలో జగన్ ప్రభుత్వం 26 జిల్లాలను చేసింది.

మరదే పద్దతిలో తెలంగాణలో కేసీఆర్ ఎందుకు 17 పార్లమెంటు నియోజకవర్గాలను 17 జిల్లాలుగా చేయలేకపోయారు ? తనిష్టం వచ్చినట్లుగా జిల్లాల స్వరూపాన్ని ఎందుకు మార్చేశారు ? కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ జారీచేసినపుడు తెలంగాణలోని వరంగల్, నల్గొండ లాంటి కొన్నిప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు చేసినా కేసీఆర్ పట్టించుకోకుండా తనిష్టం వచ్చినట్లుగా జిల్లాల సరిహద్దులను మార్చేశారు. కేసీఆర్ ప్రభుత్వ జిల్లాల పెంపు జనాల్లో కాని మీడియాలో కాని పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. అందుకనే ఇప్పటికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనే రాస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఏకంచేసి మళ్ళీ వరంగల్ జిల్లాగా చేయాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. హుస్నాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపేసి మళ్ళీ కరీంనగర్ జిల్లాగా మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

రేవంత్ ఏమన్నారు ?

జిల్లాల పునర్విభజనను హేతుబద్దంగా చేస్తామని రేవంత్ అన్నాడు. హైకోర్టు లేదా సుప్రింకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేస్తామని చెప్పాడు. కమిటి రాష్ట్రమంతా ఆరుమాసాలు తిరిగి అన్నీ వర్గాల నుండి అభిప్రాయాలను, సూచనలు, సలహాలను తీసుకుంటుందని చెప్పాడు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన జిల్లాల పునర్వ్యవస్ధీకరణ శాస్త్రీయంగా జరగలేదని మండిపడ్డారు.

వాళ్ళ అవసరాల కోసమే చేశారు : పులకంటి

కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ లేదా కమిటీ వేసి శాస్త్రీయంగా జిల్లాల సంఖ్యను పెంచలేదని రైల్వే కాలేజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు పులకంటి మోహన్ రావు అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పట్లో కేసీఆర్ జిల్లాలను పెంచారు’’ అని ఆరోపించారు. ‘‘33 జిల్లాలను పెంచటం వల్ల తెలంగాణకు ఎలాంటి ఉపయోగం జరగలేదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భువనగిరి రెవిన్యు డివిజన్ ను జిల్లాగా చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు’’ అని అన్నారు. ‘‘కేసీఆర్ జిల్లాలను పెంచారు కాబట్టి తాను కూడా ఏదో చేయాలి అన్న ఆలోచనే రేవంత్ ప్రకటనలో కనబడుతోంది’’ అని అనుమానించారు. ‘‘రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు, రిటైర్డ్ ఐఏఎస్, నిపుణులతో కమిటి వేసి అధ్యయనం చేయించి జిల్లాల పునర్వ్యస్ధీకరణ చేయమే మంచిది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణను 33 జిల్లాలకు బదులు 20 జిల్లాలుగా చేస్తే సరిపోతుంది’’ అని సూచించారు.

మెరుగైన పాలన అందించాలి : తొగరాల

‘‘జ్యుడిషియల్ కమిషన్ వేయటంలో తప్పేమీలేదు’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తొగరాల చిరంజీవులు అభిప్రాయపడ్డారు. ‘‘జిల్లాల పునర్వ్యవస్ధీకరణ అన్నది ప్రజలకు మెరుగైన పాలన అందించేదిగా ఉండాలి’’ అని చెప్పారు.

రాజకీయ ప్రయోజనాలు ఉండకూడదు : ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు

‘‘రాష్ట్రప్రభుత్వం జిల్లాల పునర్వ్యస్ధీకరణను పాలనా సౌలభ్యం కోసమే చేయాలి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ‘‘జిల్లాలను ఏర్పాటుచేయాలంటే సాంకేతికమైన పద్దతులు పాటించాల్సుటుంది’’ అని గుర్తుచేశారు. ‘‘జనాభా పెరిగిన కారణంగా కూడా జిల్లాలను పునర్వ్యవస్ధీకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అనుకుని ఉండచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘కమిషన్ నియామకం తర్వాత అన్నీవర్గాల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల పునర్విభజన చేయకూడదు’’ అని అన్నారు.

జనగామ అగ్నిగుండమే : పల్లా

పునర్వ్యవస్ధీకరణ పేరుతో జనగామ జిల్లాను రద్దుచేస్తే జిల్లా అగ్నిగుండం అవుతుందని జనగామ్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను కలిపి తిరిగి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంఎల్ఏలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి కోరటాన్ని పల్లా తప్పుపట్టారు. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాను రద్దుచేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు.

Read More
Next Story