
మావోయిస్టుల ఆయుధాలు చూసి షాక్ తిన్న పోలీసులు
అమెరికన్ తయారీ కోల్ట్ రైఫిల్, ఇజ్రయేల్ మేక్ టావర్ సీక్యూబీ తుపాకులు ఎలా వచ్చాయి ? అన్నదే పోలీసులకు అర్ధంకాలేదు
లొంగిపోయిన మావోయిస్టులు సరెండర్ చేసిన ఆయుధాలను చూసి పోలీసులే షాకయ్యారు. మావోయిస్టుపార్టీలో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) కమాండర్ (Barse Deva)బర్సేదేవాతో పాటు మరో 48 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ బీ శివధరరెడ్డి(Telangana DGP Sivadhar Reddy) ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మావోయిస్టులు లొంగిపోవటం ఒక ఎత్తయితే ఆయుధాలను సరెండర్ చేయటం మరో ఎత్తు. ఆయుధాలను సరెండర్ చేయకుండా కేవలం మావోయిస్టులు మాత్రమే లొంగిపోవటం వల్ల పోలీసులకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకనే ఆయుధాలతో సహా లొంగిపోవాలని మావోయిస్టులకు పోలీసు బాసులు పదేపదే విజ్ఞప్తులు చేస్తుంటారు.
ఇపుడు విషయం ఏమిటంటే దేవాతో పాటు లొంగిపోయిన 48మంది తమదగ్గర ఉన్న ఆయుధాలను సరెండర్ చేసేశారు. వీళ్ళు సరెండర్ చేసిన ఆయుధాల్లో కొన్నింటిని చూసిన పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే మావోయిస్టుల దగ్గర ఇంతటి అత్యంత అధునాతన ఆయుధాలు ఉంటాయన్న విషయాన్ని బహుశా పోలీసులు ఊహించలేదేమో. సరెండర్ చేసిన ఆయుధాల్లో రెండు లైట్ మెషిన్ గన్స్, అమెరికన్ మేడ్ కోల్ట్ రైఫిల్-1, ఇజ్రాయెల్ మేక్ టావర్ సీక్యూబీ-1, 8 ఏకే 47 రైఫిల్స్, 10 ఇన్సాస్ రైఫిళ్ళు, 8 ఎస్ఎల్ఆర్లు, గ్రనేడ్ లాంచర్లు-4, సింగిల్ షాట్ తుపాకులు-11, 2 గ్రనేడ్లు, ఒక ఎయిర్ గన్ తో పాటు 93 మ్యాగజైన్లు, 2206 బుల్లెట్లున్నాయి.
ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టు నేతల దగ్గర ఏకే 47 తుపాకులు ఉండటం సాధారణమైపోయింది. నిజానికి ఈ ఏకే 47 తుపాకులు కూడా పోలీసుల్లోని అందరు అధికారులకు అందుబాటులో ఉండదు. అలాంటిది మావోయిస్టు టాప్ ర్యాకింగ్ నేతలకు రక్షణగా ఉండే దళసభ్యుల్లో చాలామంది దగ్గర ఏకే 47 తుపాకులు ఉంటాయి. ఇపుడు లొంగిపోయిన వాళ్ళు 8 ఏకే 47 తుపాకులను సరెండర్ చేయటం డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులను పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఎస్ఎల్ఆర్ తుపాకులు కూడా మావోయిస్టుపార్టీలోని పెద్దనేతల రక్షణదళాల్లో సాధారణమైపోయాయి. అయితే డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు షాక్ తిన్నది ఎక్కడంటే ఒక ‘అమెరికన్ మేడ్ కోల్ట్ రైఫిల్’, మరో ఇజ్రాయెట్ మేక్ ‘టావర్ సీక్యూబీ’ తుపాకులతో పాటు హెలికాప్టర్లను కూడా కూల్చగలిగిన కెపాసిటీ ఉన్న 4 గ్రనేడ్ లాంచర్లుండటమే.
అమెరికన్ తయారీ కోల్ట్ రైఫిల్, ఇజ్రయేల్ మేక్ టావర్ సీక్యూబీ తుపాకులు ఎలా వచ్చాయి ? అన్నదే పోలీసులకు అర్ధంకాలేదు. ఇలాంటి అత్యంత అధునాతన ఆయుధాలు బహుశా పోలీసు బాసుల రక్షణకు కూడా ఉంటుందో ఉండదో. ఇలాంటి అత్యంత ఆధునిక ఆయుధాలను ప్రభుత్వాలు మాత్రమే పెద్దఎత్తున సమీకరించగలవు. వీటిని సమీకరించాలంటే పైనచెప్పిన దేశాలతో చర్చలు జరపాలి, ఒప్పందాలు చేసుకుని వేలాది కోట్లరూపాయలు చెల్లించి ఆయుధాలను దిగుమతి చేసుకోవాలి. అయితే మావోయిస్టులకు ఇలాంటి ప్రాసెస్ ఏమీ అవసరంలేదుకదా. చేతిలో డబ్బు, ఆయుధాలను సరఫరా చేయగలిగిన మధ్యవర్తులుంటే చాలు. మావోయిస్టులకు నిధుల సమీకరణ పెద్ద సమస్యేకాదు. ఎంత డబ్బు కావాలంటే అంతా సేకరించగలరు. అమెరికా, ఇజ్రాయేల్ లాంటి దేశాల నుండి అధునాతన ఆయుధాలను కొని తెప్పించగలిగిన నమ్మకమైన మధ్యవర్తులు లేదా ఆయుధ వ్యాపారులే కావాల్సింది.
ఇపుడు పోలీసు బాసులను వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే అమెరికా, ఇజ్రాయేల్ నుండి ఇలాంటి అధునాతన ఆయుధలను మావోయిస్టులకు సరఫరా చేసింది ఎవరు ? ఇలాంటి అత్యంత అధునాతన ఆయుధాలు మావోయిస్టుల దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయి ? అన్నదే కీలకంగా మారింది. మావోయిస్టుల పార్టీ తరపున అధునాతన ఆయుధాలను సమీకరించటం, అవసరమైన వారికి సరఫరా చేయటం బర్సేదేవా బాధ్యత అని అందరికీ తెలుసు. అయితే దేవాకు అధునాతన ఆయుధాలను ఎవరు అందిస్తున్నారు ? ఇపుడీ వివరాలు తెలుసుకోవటంపైనే పోలీసు బాసులు దృష్టిపెట్టారు. మరి పోలీసు బాసులకు అవసరమైన సమాచారం దొరుకుతుందా ?

