
రేవంత్ ను ఇరుకునపెట్టిన మావోయిస్టు నేతలు
రాజకీయంగా పురోగమించేందుకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్రం సహకరించాలని షరతు పెట్టడమే దేవ్ జీ తెలివి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి
లొంగిపోయిన మావోయిస్టు నేతలు ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముందు విచిత్రమైన డిమాండును ఉంచారు. ఈ డిమాండును విన్నతర్వాత రేవంత్ కు ఏమి బదులుచెప్పాలో కూడా అర్ధమయ్యుండదు. మావోయిస్టుపార్టీ కేంద్ర కమిటి ప్రధాన కార్యదర్శి దేవ్ జీ, మల్లారాజిరెడ్డి, తెలంగాణ కమిటి కార్యదర్శి బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి, పుల్లూరి ప్రసాద్, పోతుల పద్మావతి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రేవంత్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఎవరూ గతంలో ఏ ముఖ్యమంత్రితోను ఈ విధంగా భేటీకాలేదు. భేటీ అవటంలో తప్పుకూడా లేదు కాబట్టి ఈ విషయం సీరియస్ ఏమీకాదు.
అయితే భేటీ సందర్భంగా దేవ్ జీ లేవనెత్తిన డిమాండ్లే మరీ విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే రేవంత్ తో దేవ్ జీ మాట్లాడుతు కేంద్రప్రభుత్వం సహకరిస్తే రాజకీయపార్టీ పెడతామని చెప్పారు. రాజకీయపార్టీ పెట్టడానికి కేంద్రమో లేకపోతే రాష్ట్రప్రభుత్వమో సహకరించాల్సిన అవసరం ఏముందో అర్ధంకావటంలేదు. అసలు ఎవరైనా పార్టీలు పెట్టాలంటే కేంద్రప్రభుత్వం ఏ విధంగా సహకరించగలదు ? పదివేల రూపాయలుంటే చాలు నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి రాజకీయపార్టీని రిజిస్టర్ చేసేయచ్చు. కేంద్రం సహకరిస్తే సాయుధపోరాటాన్ని విరమిస్తామని చెప్పటమే పెద్ద జోక్ గా మారింది.
లొంగిపోయారు కాబట్టే భేటీ అయ్యారు
సాయుధ పోరాటాన్ని విరమిస్తామని చెప్పటం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. సాయుధపోరాటాన్ని విరమించిన తర్వాతే కదా పోలీసుల ముందు మావోయిస్టు నేతలంతా లొంగిపోయింది. లొంగిపోయారు కాబట్టే రేవంత్ తో భేటీ అయ్యారు. లొంగిపోయిన తర్వాత మళ్ళీ సాయుధపోరాటాన్ని విరమించేందుకు కేంద్రం సహకారం ఏమిటో అర్ధంకావటంలేదు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని రద్దు చేస్తామని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని రద్దు చేసేది ఏముంటుంది ?
కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది ?
ఇపుడున్న పరిస్ధితుల్లో ప్రజా జీవితంలోనే ఉండి చట్టపరంగా ఉద్యమ పంథాను కొనసాగిస్తామని చెప్పటంవరకు ఓకే. తాము రాజకీయంగా పురోగమించేందుకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్రం సహకరించాలని షరతు పెట్టడమే దేవ్ జీ తెలివి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్రం సహకరిస్తే మావోయిస్టుపార్టీని రాజకీయపార్టీగా మారుస్తామని రేవంత్ కు దేవ్ జీ బంపరాఫర్ ఇచ్చారు. దీనికి రేవంత్ బదులిస్తు ఈ డిమాండును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసినపుడు మాట్లాడుతానని చెప్పి తప్పించుకున్నారు. తెలంగాణలో తాజాగా కల్వకుంట్ల కవితతో పాటు సినీనటి విజయశాంతి, తీన్మార్ మల్లన్న లాంటి ఎంతోమంది రాజకీయపార్టీలు పెట్టుకున్నారు. వీళ్ళెవరూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను సహకరించాలని కోరలేదు.
ఎందుకు కోరలేదంటే రాజకీయపార్టీలు పెట్టడానికి ఏ ప్రభుత్వమూ సహకరించాల్సిన అవసరంలేదు, సహకరించదు కూడా. ఈమాత్రం తెలీకుండానే రాజకీయాల్లోకి రావాలన్న కోరికను దేవ్ జీ బయటపెట్టడమే విచిత్రంగా ఉంది. రేవంత్ తెలివైన వాడు కాబట్టే దేవ్ జీ షరతును అమిత్ షా ముందు ప్రస్తావిస్తానని తప్పుకున్నాడు. భేటీ సందర్భంగా మావోయిస్టు నేతలు మాట్లాడుతు చాలా డిమాండ్లను రేవంత్ ముందు ఉంచారు. రాజకీయపరమైన అంశాలను ప్రభుత్వ సలహాదారుడు కే కేశవరావును కలవాలని, ఆర్ధికపరమైన అంశాలను వేం నరేందర్ రెడ్డితో మాట్లాడమని రేవంత్ చెప్పాడు.
సంబంధాలు తెగిపోయినట్లే
మావోయిస్టు నేతలు ప్రభుత్వం ముందు ఎప్పుడైతే లొంగిపోయారో అప్పటినుండే మావోయిస్టుపార్టీకి వీళ్ళకు టెక్నికల్ గా సంబంధాలు తెగిపోయినట్లే. దశాబ్దాల తరబడి అజ్ఞాతంగా మావోయిస్టుపార్టీలో పనిచేశారు కాబట్టి సంబంధాలు తెగిపోతాయని అనుకోవటంలేదు. అంతమాత్రాన ప్రభుత్వాలు సహకరిస్తే మావోయిస్టుపార్టీని రాజకీయపార్టీగా మారుస్తామని, గెరిల్లా ఆర్మీని రద్దుచేస్తామని చెప్పటమే మరీ విడ్డూరంగా ఉంది. సమకాలీన రాజకీయాలు, విప్లవసాహిత్యం లేదా విప్లవపోరాటం, ప్రపంచ విషయాలపై చాలామంది మావోయిస్టు నేతలకు గట్టి పట్టు ఉంటుందనే చాలామంది అభిప్రాయపడుతుంటారు. తాజా భేటీలో మావోయిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దేవ్ జీ తదితరుల షరతులు, డిమాండ్లు విన్నతర్వాత ఏమి మాట్లాడాలో రేవంత్ కు అర్ధమయ్యుండదు.

