జగిత్యాల అడవుల్లో తోడు వెతుక్కుంటున్న పెద్దపులి
x
Tiger spotted in Jagityal forest

జగిత్యాల అడవుల్లో తోడు వెతుక్కుంటున్న పెద్దపులి

జోడీకోసం వెతుకుతున్న ఈ పెద్దపులి నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకి ఎంటరయ్యే అవకాశాలున్నాయి


జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి స్పాట్ అయ్యింది. జోడీకోసం వెతుకుతున్న ఈ పెద్దపులి నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోకి ఎంటరయ్యే అవకాశాలున్నాయి. అందుకని కమ్మర్ పల్లి, సిరికొండ, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజి అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తంచేశారు. ఈ పెద్దపులి మహారాష్ట్రలోని తడోబా అడవుల నుండి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని జన్నారం మీదుగా సంచరిస్తు యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్ళి, తిరిగి సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా మీదుగా జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు గుర్తించారు.

వేములవాడ ప్రాంతంలో ఇదే పెద్దపులి ఒక ఆవును చంపేసింది. మగపులి సుమారు 250 కిలోల బరువుంటుందని అటవీ అధికారులు అంచనా వేశారు. తడోబా అడవుల నుండి వచ్చిన ఈ పెద్దపులికి అటవీ అధికారులు జే-1 అని పేరు పెట్టారు. ఈ పులి నిజామాబాద్ జిల్లా అడవుల్లోకి ఎంటరయ్యే అవకాశాలు ఉండటంతో దాని కదలికలను ఎప్పటికిప్పుడు రికార్డు చేయటం కోసం అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఖానాపూర్ నుండి నలుగురు ట్రాకర్లను రప్పించారు.

ఇందల్వాయి రేంజిలో రెండు ట్రాకర్ల బృందాలు, కమ్మర్ పల్లి రేంజిలో ఒక బృందం, సిరికొండ రేంజిలో మరో బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ నాలుగు బృందాలు పైన పేర్కొన్న అడవుల్లో రాత్రనక, పగలనక పెట్రోలింగ్ చేస్తున్నాయి. పులి జాడలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా అటవీశాఖ ఉన్నతాధికారులు అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని జనాలను అప్రమత్తంచేశారు. పెద్దపులిని గుర్తించిన కారణంగా కమ్మర్ పల్లి, సిరికొండ, ఇందల్వాయి అడవుల్లోకి పశువులు, మేకలకాపర్లు వెళ్ళవద్దని రేంజి ఆపీసర్లు ప్రకటించారు.

ఈపులి రోజుకు 20 కిలోమీటర్లు తిరుగుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలోని అడవుల్లోకి ఎంటరయ్యే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. నాలుగు బృందాలతో ప్రత్యేకంగా పులికోసం ట్రాకింగ్ చేయిస్తున్నట్లు అటవీ అధికారులు గ్రామాల్లో ప్రకటించారు. కాబట్టి అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే ఉన్నతాధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు.

Read More
Next Story