నాడు రుద్రమదేవి-నేడు వరంగల్ రుద్రమ కమాండోలు!
x
వరంగల్ లో రుద్రమ మహిళా కమాండో దళం

నాడు రుద్రమదేవి-నేడు వరంగల్ రుద్రమ కమాండోలు!

కాకతీయుల ప్రతాపానికి నేటి రూపం –వరంగల్ ‘రుద్రమ’ మహిళా కమాండో దళం


నాడు ఓరుగల్లును పరిపాలించిన రుద్రమదేవి శౌర్యం…నేడు వరంగల్ వీధుల్లో రుద్రమ మహిళా కమాండోల ప్రతాపంగా కనిపిస్తోంది. మహిళా శక్తికి ప్రతీకగా ‘టీం రుద్రమ’ వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.పురుషులకు దీటుగా కాదు… కొన్ని సందర్భాల్లో వారికంటే ముందే. కఠిన శిక్షణతో, అపార ధైర్యంతో వరంగల్‌లో ‘రుద్రమ’ మహిళా కమాండో దళం పోలీసింగ్‌కు కొత్త నిర్వచనం ఇస్తోంది.


ఓరుగల్లు... కాకతీయుల పురాతన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.నాడు ఓరుగల్లు వీరవనితగా పేరొందిన రుద్రమదేవి నాడు సామంత రాజుల తిరుగుబాట్లను తన సేనానులతో కలిసి విజయవంతంగా అణిచివేశారు.నాడు ఓరుగల్లు రాజధానిగా ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమ దేవి తన శక్తిసామర్ధ్యాలతో దిగ్విజయంగా, ప్రజారంజకంగా పాలించారు. నాటి కాకతీయుల కాలంలో రుద్రమదేవి చూపిన ప్రతాపాన్ని నేడు వరంగల్ ఆర్మ్ డ్ రిజర్వ్ మహిళా పోలీసులు చూపిస్తున్నారు.వరంగల్‌ పోలీసు కమిషనరేట్ లో మహిళా శక్తికి ప్రతీకగా 'రుద్రమ' కమాండో బృందం విశిష్ఠ సేవలందిస్తుంది.వరంగల్ జిల్లాలో వెలసిన ఈ ప్రత్యేక మహిళా కమాండో దళం కఠిన శిక్షణతో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా తయారైంది. ఈ బృందం ఆయుధ శిక్షణతో పాటు ఆత్మరక్షణలోనూ రాణిస్తోంది. అల్లర్లు, బందోబస్తు, కూంబింగ్ ఆపరేషన్లలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.



21 మంది మహిళా కమాండోలతో...

పురుషులకు దీటుగా తాము కూడా పోలీసు కమాండోలుగా మరింత సామర్ధ్యంతో పనిచేస్తామని నిరూపించింది వరంగల్ జిల్లాకు చెందిన రుద్రమ మహిళా పోలీసు కమాండో బృందం. నాడు కాకతీయుల కాలంలో ఓరుగల్లును పరిపాలించిన రుద్రమ దేవి పురుషులకు దీటుగా రాణిగా తన ప్రతాపాన్ని చూపించి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చారు. అలాంటి యోధురాలు రుద్రమదేవి పేరిట వరంగల్ పోలీసు కమిషనరేట్ లో 21 మంది మహిళా సాయుధ పోలీసులతో కమాండో టీంను పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఏర్పాటు చేశారు.

2024వ సంవత్సరంలో 40 మంది ఆర్మ్ డ్ పోలీసు కానిస్టేబుళ్లుగా ఉన్నత చదువులతోపాటు క్రీడల్లో మేటిగా నిలిచిన మహిళా కానిస్టేబుళ్లు నియమితులయ్యారు.బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్ క్రీడలతోపాటు ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివిన విద్యావంతులు మహిళా ఏఆర్ పోలీసుల్లో ఉన్నారు. వారిలో నుంచి మెరికల్లాంటి 21 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి వారికి ఫిట్ నెస్, ఫైరింగ్, కమాండోలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రన్నింగ్, ఫిజికల్ డ్రిల్, రోప్ క్లైంబింగ్, ఏకే -47 , సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఇన్ సాస్ రైఫిళ్లతో కాల్పులు జరపడంలో రుద్రమ దేవి టీం కమాండోలకు శిక్షణ ఇచ్చి వారిని కార్యరంగంలో దించారు.వరంగల్ జిల్లాలో అత్యవసరంగా బందోబస్తు కావచ్చు...లేదా జాతరలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా టీం రుద్రమను వరంగల్ జిల్లా పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ రంగంలోకి దించుతున్నారు.



శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరిగింది...

‘‘నా చెల్లెలు స్వర్ణ బారతితోపాటు నేను టీం రుద్రమలో కమాండోగా పనిచేస్తున్నాను ’’అని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సల్వీ సుష్మా చెప్పారు. తుపాకులను గురిపెట్టి కాల్చడం సాధన చేశామని, దీని వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. తాము ప్రతీరోజూ పురుషులకు దీటుగా తాము కూడా నిత్యం ఫైరింగ్ ప్రాక్టిస్, ఫిజికల్ ట్రైనింగ్ చేస్తున్నామని చెప్పారు. పురుషులే కాదు మహిళలు కూడా హైరిస్క్ విధులు నిర్వహించవచ్చని తాము నిరూపించామని మరో రుద్రమ టీం కమాండో ఎన్ భువనేశ్వరి చెప్పారు. అల్లర్లను అదుపు చేయడం, వీఐపీ సెక్యూరిటీ, ఎమర్జెన్సీ ఆపరేషన్లలో తాము పాల్టొంటున్నామని ఆమె తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా తమ కమాండో బృందం సభ్యులు కేవలం 20 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ స్పాటుకు చేరుకొని సమర్ధంగా విధులు నిర్వర్తిస్తున్నారని రిజర్వ్ ఇన్ స్పెక్టర్ వేముల శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కుంబింగ్ ఆపరేషన్లలోనూ...
అడవుల్లో కుంబింగ్ ఆపరేషన్ చేపట్టేందుకు కూడా రుద్రమ టీం సంసిద్ధంగా ఉందని వరంగల్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ వేముల శ్రీనివాస్ తెలిపారు. బాంబు డిస్పోజల్,రోప్ క్లైంబింగ్,క్షతగాత్రులను భుజాలపై మోసుకెళ్లడం, కరాటే శిక్షణ, డ్రైవింగ్ లో మహిళా కమాండోలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో పది కిలోమీటర్ల దూరం రన్నింగ్, పీఈటీ పరేడ్ నేర్పించామన్నారు.ఎన్ ఎస్ జీ, ఎస్ పీజీ, గ్రేహౌండ్స్ తరహా శిక్షణ వల్ల మహిళా కమాండోలు మెరికల్లా తయారయ్యారని ఆర్ఐ వివరించారు.

మా తడాఖా చూపిస్తున్నాం...
తాము పోలీసు విధుల్లో సమర్ధంగా పనిచేస్తూ తమ తడాఖా చూపించామని మహిళా కమాండోలు చైతన్య, మౌనిక చెప్పారు. క్షతగాత్రులను ఎత్తుకొని రన్నింగ్ చేయడం, భూమిపై పాకడం, తుపాకులు పట్టుకొని కొట్లాటల్లో ప్రజలను అదుపు చేస్తామని వారు పేర్కొన్నారు. మహిళా ఖైదీలకు ఎస్కార్టుగా, భుజాన బ్యాగులు, చేతుల్లో తుపాకులు పట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నామని మరో మహిళా కమాండో స్వర్ణ చెప్పారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎమర్జెన్సీ డ్యూటీలు, ఆందోళనకారులను బండ్లలో ఎక్కించడం,ధర్నాలు, ఎస్కార్టులుగా ఎలాంటి డ్యూటీ అయినా మేం రెడీ అంటున్నారు మహిలా కమాండోలు. బక్షీలు తీయడం, దూకడం, తాళ్ల సాయంతో పైకి ఎగబాకటం ప్రజలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు తాము హైరిస్క్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నామని రుద్రమ మహిళా కమాండో దళం తెలిపింది.

నాడు ఓరుగల్లును శత్రువుల నుంచి కాపాడిన రుద్రమదేవి శౌర్యం… నేడు వరంగల్ వీధుల్లో రుద్రమ మహిళా కమాండోల ధైర్యంగా కొనసాగుతోంది. కాలం మారినా, యోధురాళ్ల శక్తి మారలేదు. చరిత్రలో నిలిచిన పేరు—ఇప్పుడు ప్రజల భద్రతకు భరోసాగా మారింది.


Read More
Next Story