‘హత్రాస్ ఘటనను అరెస్టులతో సరిపెట్టాలని చూస్తున్నారు’
‘‘హత్రాస్ ఘటనతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రభుత్వం చెబితే.. అధికారంలో కొనసాగే హక్కు కూడా వారికి ఉండదు’’- సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్
హత్రాస్ తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 121 మంది చనిపోయిన ఘటనలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. సీఎం ఆదిత్యనాథ్ అరెస్టులతో సరిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ఆరోపించారు.
‘‘పాలనాపర లోపాలే ఇలాంటి ఘటనలు కారణమని, ఈ తరహా సంఘటనల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్లు లేదు’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు అఖిలేష్.
తొక్కిసలాట ఘటనకు సంబంధించి తన తండ్రిపై తప్పుడు కేసు పెట్టారని, ఈ దుర్ఘటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని మెయిన్‌పురి జిల్లాకు చెందిన అంకిత్ యాదవ్ అనే యువకుడు అఖిలేష్‌కు పోస్టు చేశాడు. దీనిపై స్పందిస్తూ.. సత్సంగ్ వేదికకు దూరంగా ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి.. వారిని దోషులుగా చూపేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. ఈ అరెస్టులపై వెంటనే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రభుత్వం చెబితే.. అధికారంలో కొనసాగే హక్కు కూడా వారికి ఉండదని అన్నారు.
న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం..
హత్రాస్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట వెనుక కుట్ర దాగి ఉందనే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది.
ఘటన ఎలా జరిగింది?
హత్రాస్‌లోని ఫుల్రాయ్ గ్రామంలో జూలై 2న సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా 'సత్సంగ్' నిర్వహించారు. కార్యక్రమం ముగిశాక ఆయన ఆశ్రమానికి కారులో బయల్దేరారు. కారు వెళ్లిన మార్గం నుంచి కొంత మట్టి తీసుకునేందుకు తొక్కిసలాట జరిగింది.
ప్రధాన నిందితుడి అరెస్టు..
హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయారు. సమాచారం అందుకున్నఆయనను ఉత్తరప్రదేశ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.