సీఎం రేవంత్‌ని పిలిపిస్తే బయటికొస్తానని దొంగ డిమాండ్
మంచి దొంగ, భలే దొంగ, విచిత్ర దొంగ, కొండవీటి దొంగ.. ఇలా దొంగలు పలు విధములు... ఇప్పుడో గమ్మత్తు దొంగ ఆ వరుసలో చేరాడు. ముప్పు తిప్పలు పెట్టాడు.
మంచి దొంగ, భలే దొంగ, విచిత్ర దొంగ, కొండవీటి దొంగ ఇలా దొంగలు పలు విధములు... ఇప్పుడో గమ్మత్తు దొంగ ఆ వరుసలో చేరాడు. అతడే చెరువులో దొంగ.. దొంగల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. సీఎంని పిలిపిస్తారా లేదా? అంటూ పోలీసులకు షరతు పెట్టాడు. ఆ తర్వాత ఎంచక్కా ఎస్కేప్ అయ్యాడు.
చెరువులో దొంగ.. ఒడ్డుపైన పోలీసులు..
మేడ్చల్ జిల్లా సురారం పీఎస్ పరిధిలో ఓ దొంగ నిన్న సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు హల్చల్ చేశాడు. శివాలయనగర్‌లోని ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. బీరువా తెరిచి నగదు, నట్రా సర్దుకుంటున్నాడు. ఇంతలో ఓనర్ రావడంతో పారిపోయేందుకు చుట్టుపక్కల వెతికాడు. మరో దారి లేకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండ రాయిపై కూర్చుండిపోయాడు.
పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన దొంగ (Thief)
విషయం తెలుసుకున్న పోలీసులు (Police) దొంగను పట్టుకునేందుకు చెరువు వద్దకు చేరుకున్నారు. ఒరే అయ్యా, రారా.. బాబు అంటూ బతిమిలాడారు. బామాడారు. అతన్ని చెరువు బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా బయటకు రాలేదు. టీవీ ఛానల్స్‌ను తీసుకొని వస్తేనే బయటకు వస్తానన్నాడు ఆ దొంగ.
సీఎం రేవంత్‌ను పిలిపించండి, వస్తా..
పోలీసులు మీడియాను పిలిపించి నీ డిమాండ్ ఏమిటో చెప్పమని అడిగాడు. సీఎం రేవంత్ రెడ్డిని పిలిపించండి, బయటకు వస్తానన్నారు.. వీడెవడో నాటకం ఆడుతున్నాడని పోలీసులకు అర్థమైంది. అప్పటికి అర్ధరాత్రి అయింది. పోలీసులు టీ తాగి వద్దామని పక్కకుపోయారు. దొంగ మాత్రం చెరువు మధ్యలోనే ఉండిపోయాడు. చుట్టుపక్కల చూసే వాళ్లూ పలచబడ్డారు. మీడియా వాళ్లు వెళ్లిపోయారు. ఇదే చాన్స్ అనుకుని దొంగ బండరాయి దిగి ఈదు కుంటూ వేరే వైపు వెళ్లాడు. పోలీసులు తిరిగొచ్చి చూస్తే బండరాయి ఎప్పటిలాగే బండగా కనిపించింది. దొంగ మాత్రం ఎస్కేప్.