
‘ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది’
బంజారా బిడ్డలు సంక్షేమపథకాలు, భూమి కోసం కాకుండా చదువుకుని అభివృద్ధి చెందే విషయాన్ని ఆలోచించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు
బంజారా బిడ్డలు సంక్షేమపథకాలు, భూమి కోసం కాకుండా చదువుకుని అభివృద్ధి చెందే విషయాన్ని ఆలోచించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో ఆదివారం జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 208వ జయంతి సందర్భంగా రేవంత్ మాట్లాడుతు బాగా చదువుకుని జీవితంలో ఎదిగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంక్షేమపథకాలు, ప్రభుత్వ భూములు ఇవ్వటం సాధ్యంకాదని స్పష్టంగా చెప్పేశాడు రేవంత్. రాష్ట్రంలోని అన్నీ తండాల్లో బీటీ రోడ్లు నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పారు. రహదారులు లేని తండాలు ఉండకూడదన్నదే తన ద్యేయంగా తెలిపారు.
గూడెం, తండా అన్న తేడాలు లేకుండా అన్నీచోట్ల బంజారా భవన్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రసాధనలో లంబాడా యువకులు ప్రత్యేక పాత్ర పోషించినట్లు రేవంత్ గుర్తుచేశారు. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూలును ఏర్పాటు చేస్తామన్నారు. మరో 4 నెలల్లో 20 ఏళ్ళ రాజకీయ ప్రస్ధానం పూర్తి చేసుకోబోతున్నట్లు రేవంత్ చెప్పారు. తన 20 ఏళ్ళ రాజకీయ ప్రయాణంలోలంబాడా యువత ఎంతో అండగా ఉన్నారు అని అన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని లంబాడా యువత డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవ్వాలని ఆలోచించాలన్నారు. తండాల్లో సోలార్ ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. 100 నియోజకవర్గాల్లో రు. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్ళను నిర్మిస్తున్న విషయాన్ని తెలిపారు. యువత బాగా చదువుకుంటే భవిష్యత్ తరాలు బాగుపడతాయన్నారు. చదువు వల్ల కీలకపదవులు వస్తాయని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. తాను పాలకుడనని ఎప్పుడూ అనుకోలేదని, ప్రజలకు సేవకుడిని అనే భావిస్తున్నట్లు చెప్పారు.
దళితులకు నాలుగు మంత్రిపదవులు, స్పీకర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో దళితులకు ఇచ్చిన హామీని కేసీఆర్ ఏ విధంగా తప్పారో వివరించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే దళితుడే మొదటి ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పినట్లు ఆరోపించారు. కాని తాను అదే దళితుడిని అసెంబ్లీలో స్పీకర్ ను చేసిన విషయాన్ని తెలిపారు. ప్రజాతీర్పును అవమానించేలా మాట్లాడవద్దని బీఆర్ఎస్ నేతలకు రేవంత్ హితవు పలికారు. నేనే రాజు నేనే మంత్రి అన్న మాటలను బీఆర్ఎస్ నేతలు కావాలనే వక్రీకరించినట్లు మండిపడ్డారు. నేనే రాజు నేనే మంత్రి అంటే ముఖ్యమంత్రీ తానే, మున్సిపల్ శాఖ మంత్రీ తానే అని చెప్పిన మాటను ఉద్దేశ్యపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యుటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్షణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

