
ఈ వినాయకుడు అగ్నిపర్వతానికి కాపలా
ఎవరా వినాయకుడు, ఎక్కడున్నాడు?
ఇండోనేషియాలో బ్రోమో శిఖరం (Mount Bromo) మీద ఈ వినాయకుడు బహిరంగ ప్రదేశంలోనే ఉంటాడు. అక్కడే నిత్యం పూజలు అందుకుంటాడు. ఇక్కడ పూజలు ఎపుడూ ఆగిపోవు. వినాయకుడు ఇలా గుడి లేకుండా ఉండటానికి, ఆయన నిత్యపూజలకు చాలా ప్రాముఖ్యం ఉంది.
బ్రోమో అంటే ఇండేనేషియా భాషలో బ్రహ్మ అని అర్థం. అంటే ఈ పర్వతం బ్రహ్మ పర్వతం అన్నమాట. ఈ వినాయకుడు వెలసిన ప్రదేశం అగ్ని పర్వతాల మధ్య ఉంటుంది. పర్వతాల నుంచి వెలువడే దట్టమయిన పొగ ఈ ప్రాంతమంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి పర్వతాలు బద్దలు కాకుండా అడ్డుకుని వినాయకుడు తమని కాపాడుతున్నాడని ఈ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. అందుకే ఈ విగ్రహానికి నిత్య పూజలు చేస్తుంటారు. ఈ పూజలు ఎపుడూ ఆగవు. వోల్కనో చిన్న చిన్న గా బద్దలయినా పూజలు కొనసాగుతూనే ఉంటాయి.
ఇండోనేషియా హిందువుల్లో గణేష్ ఆరాధన బాగా ఎక్కువ. నిజానికి ఆదేశంలో జరిగిన తవ్వకాల్లో చాలా చోట్ల వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. ఇస్లామిక్ దేశమయిన గణేశుడికి ఆదేశంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఆదేశ కరెన్సీ నోటు మీద కూడా వినాయక విగ్రహం ఉంటుంది.
సుమారు 700 సంవత్సరాల కింద మౌంట్ బ్రోమో మీద తెంగెర్ మాసిఫ్ ( Tengger massif)అనే తెగ ప్రజలు ఈ విగ్రహం ప్రతిష్టించారని చెబుతారు. అగ్ని పర్వాతాల ప్రమాదాల నుంచి వినాయకుడు తమని కాపాడుతున్నాడని అక్కడి ప్రజలు ఇప్పటికీ విశ్వస్తున్నారు. బ్రోమో పర్వతం తూర్పు జావాలోని బ్రోమ తెంగెర్ సెమేరు(Bromo Tengger Semeru) నేషనల్ పార్క్ లో ఉంటుంది.
ఇండోనేషియాలో సుమారు 141 అగ్ని పర్వాతాలు ఉన్నాయి. ఇందులో 130 యాక్టివ్ గా ఉన్నాయి. వాటిలో 127అగ్నిపర్వతాలు తూర్ప జావాలో ఉన్నాయి. ఇందులో బ్రహ్మ పర్వతం ఒకటి. అంటే ఈ ప్రాంతమంతా డేంజర్ జోన్ లో ఉంది. తామంతా ప్రమాదం అంచుల్లో ఉన్నామని, అయినా ప్రమాదం జరుగకుండా బతుకుతున్నామని, దానికి కారణం వినాయకుడేనని ఆ ప్రాంత ప్రజల విశ్వాసం. అందుకే వారంతా వినాయకుడికి నిత్యపూజలు చేస్తున్నారు.