
ఎన్టీఆర్ కు అసలైన నివాళి ఇది..
ఎన్టీఆర్ ఇంటిని ఒక జ్ఞాపకంగా, ఓ స్మారకమందిరంగా తీర్చిదిద్దాలన్నది చదలవాడ సంకల్పం
పేరుకు సంతానంగాను, వారసులుగాను పదులసంఖ్యలో ఉన్నారు. అయినా ఒక్కరికీ తండ్రి దశాబ్దాలు గడిపిన ఇంటిని కాపాడుకోవాలన్న ఆలోచన లేకపోవటమే ఆశ్చర్యం. ఇప్పటికే ఈవిషయం ఎవరి గురించో అర్ధమైపోయుంటుంది. అవును, మహానటుడిగా అభిమానులతో పిలిపించుకుంటున్న అన్న (NTR)ఎన్టీఆర్ గురించే. ఎన్టీఆర్ మరణించి ఈరోజుకు 30 ఏళ్ళయ్యింది. అయినా అభిమానులు అన్నగారిని ఇప్పటికే మరచిపోలేకపోతున్నారు. దాదాపు 12 మంది సంతానం, వారి వారసులు ఇంతమంది ఎన్టీఆర్ వర్ధంతిని(Tank Bund) ట్యాంక్ బండ్ దగ్గర జరుపుకోవటం, మీడియాతో మాట్లాడటం, తండ్రిగురించి స్మరించుకోవటం మినహా ఏమి చేస్తున్నట్లు ? ఎన్టీఆర్ వారసులు కూడా సినిమాఫీల్డులోనే బిజీగా ఉన్నారు. వాళ్ళు కూడా వర్ధంతి, జయంతులను జరుపుకోవటం మినహా ఎన్టీఆర్ అసలైన వారసత్వాన్ని నిలుకోవాలన్న ఆలోచన చేయకపోవటమే ఆశ్చర్యం. ఆ ఆలోచనను ఎన్టీఆర్ వీరాభిమాని చదలవాడ శ్రీనివాసరావు చేశారు.
ఎన్టీఆర్ వారసత్వం అంటే సినిమా ఫీల్డులో రాణించటమో లేకపోతే జ్ఞాపకాలను నెమరేసుకోవటమో కాదు. సంతానం, వారసులు అర్పించని అసలైన నివాళిని ఎన్టీఆర్ కు వీరాభిమాని చదలవాడ శ్రీనివాసరావు అర్పిస్తున్నారు. చదలవాడ ఎవరంటే ఎన్టీఆర్ సినామాల్లో బాగా పీక్సులో ఉన్నపుడు తిరుపతి, తిరుమలకు బస్సులు తిప్పటమే కాకుండా అట్నుంచి మద్రాసుకు కూడా బస్సులను నడిపిన యజమాని. బస్సుల యజమానే కాకుండా చదలవాడ ఎన్టీఆర్ కు వీరాభిమాని కూడా. అభిమానులకు తిరుమల శ్రీవారి దర్శనం అయిన తర్వాత ప్రతిరోజు మద్రాసుకు తీసుకెళ్ళి అన్నగారి దర్శనం కూడా చేయించేవారు. తర్వాత అన్నగారి చలవవల్లే సినిమాల్లోకి ప్రవేశించి నిర్మాతగా మారారు.
అలాంటి చదలవాడ మద్రాసు, టీ నగర్, బైజుల్లారోడ్డులో అన్నగారు దాదాపు 30 ఏళ్ళు నివసించిన ఇంటిని ఈమధ్యనే కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ ఇంటిని చదలవాడ కొనుగోలు చేయకముందు తుప్పలు, చెత్త పేరుకుపోయి అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయిందని మీడియాలో చాలాసార్లు వచ్చింది. కారణం ఏమిటంటే ఎన్టీఆర్ సంతానం కాని వారసులు కాని ఎవరూ బైజుల్లారోడ్డులోని ఎన్టీఆర్ ఇంట్లో ఉండటంలేదు. విచిత్రం ఏమిటంటే ఎన్టీఆర్ సంతానం అంతా ఆ ఇంట్లోనే పుట్టి పెరిగారు. అయినా ఆ ఇంటిపై వాళ్ళకు పెద్దగా మమకారం ఉన్నట్లు అనిపించలేదు.
ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మకాం హైదరాబాద్ కు మారింది. కాబట్టి సంతానం, వాళ్ళ వారసులు కూడా హైదరాబాదులోనే ఉండిపోయారు. దాంతో మద్రాసులోని ఇంటిని పట్టించుకోలేదు. ఎన్టీఆర్ మరణంతో సంతానం మద్రాసు ఇంటిని దాదాపు మరచిపోయారనే అనుకోవాలి. ఎప్పుడైనా మద్రాసుకు వెళ్ళినపుడు చుట్టపు చూపుగా ఇంటికి వెళ్ళి చూడటం మినహా చేసిందేమీలేదు. అందుకనే ఆఇల్లు చాలాకాలం అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. అలాంటి వార్తలు చూసిన చదలవాడ మనసు ధ్రవించిపోయింది. అందుకనే అన్నగారి సంతానంతో మాట్లాడి చివరకు అందరినీ ఒప్పించి ఎన్టీఆర్ నివసించిన ఇంటిని కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ ఇంటిని చదలవాడ కొనుగోలుచేసింది తాను ఉండటానికి కాదు. ఎన్టీఆర్ ఉన్నపుడు ఆ ఇల్లు ఎంత కళకళలాడిందో అచ్చంగా అలాగే మళ్ళీ తీర్చిదిద్దటం కోసమే. ఈ ఆలోచన ఎన్టీఆర్ సంతానంలో ఎవరికీ రాకపోవటమే ఆశ్చర్యం.
ఎన్టీఆర్ 1953లో కొన్నారు
కోల్ కత్తాకు చెందిన ఒక వ్యాపార కుటుంబం నుండి ఎన్టీఆర్ 1953లో ఆ ఇంటిని కొన్నారు. బెంగాలీ వ్యాపారులనుండి కొన్న ఇంటిని ఎన్టీఆర్ తన భార్య బసవతారకం పేరుమీదే రిజిస్టర్ చేయించారు. వెయ్యిగజాల స్ధలంలోని ఇల్లు 24 గంటలూ నిర్మాతలు, దర్శకులు, సహ నటీ, నటులు, అభిమానులతో ప్రతిరోజు నిత్యకల్యాణం పచ్చతోరణంలాగ 30 ఏళ్ళు వెలిగిపోయింది. అలాంటి ఇంటిలో పుట్టి, పెరిగిన సంతానంకు ఆ ఇంటిని నిలుపుకోవాలని, తండ్రి జ్ఞాపకార్ధం తీర్చిదిద్దాలని అనిపించలేదు. వీరాభిమానిగా తర్వాత నిర్మాతగా చదలవాడకు ఎన్టీఆర్ కు గట్టి అనుబంధం ఏర్పడింది. తరచూ ఎన్టీఆర్ ఇంటికి వెళుతుండే వారు కాబట్టి ఇంటిగురించే కాకుండా ఇంట్లోని ఫర్నీచర్, ఎన్టీఆర్ ఇష్టాల గురించి కూడా బాగా తెలుసు.
అందుకనే ఇంట్లోని ఫర్నీచర్ ను ఎన్టీఆర్ ఎంత ఇష్టంగా చేయించుకున్నారో అదేపద్దతిలో ఇప్పుడు చదలవాడ కొత్తగా పర్నీచర్ ను చేయిస్తున్నారు. ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నపుడు ఇల్లాంతా ఎలాంటి ఫర్నీచర్ తో ఉండేదో అదేపద్దతిలో ఫర్నీచర్ ను ఏర్పాటుచేస్తున్నారు. ఎన్టీఆర్ ఇంటిని ఒక జ్ఞాపకంగా, ఓ స్మారకమందిరంగా తీర్చిదిద్దాలన్నది చదలవాడ సంకల్పం. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని కూడా చేయిస్తున్నారు. పనులన్నీ పూర్తయ్యాక ఆ ఇంటిని ఎన్టీఆర్ అభిమానుల కోసం ఒక మ్యూజియంగా మార్చబోతున్నారు. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ వేసిన పాత్రలు రాముడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రల విగ్రహాలను కూడా చదలవాడ తయారుచేయిస్తున్నారు. అంతా రెడీచేసిన తర్వాత ఇంటిని అభిమానులకు సందర్శనీయ స్ధలంగా ఉంచాలన్నది చదలవాడ శ్రీనివాసరావు సంకల్పం. ఇదంతా చూసిన తర్వాత ఎన్టీఆర్ కు అసలైన నివాళిని ఎవరు అర్పిస్తున్నట్లు ?

