లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో మూడు అతి ముఖ్యాంశాలు.
x

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో మూడు అతి ముఖ్యాంశాలు.

ఇఫ్టూ ప్రసాద్ విశ్లేషణ: 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో ఎన్నెన్నో ముఖ్యాంశాలు ఉన్నా మూడు అతి ముఖ్యమైన ప్రాధాన్యత గల అంశాలన్నాయి. అవేంటంటే...


నా దృష్టిలో 18వ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో మూడు అతి ముఖ్యాంశాలు.

18వ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో ఎన్నో ఎన్నెన్నో ముఖ్యాంశాలు ఉన్నా, నా దృష్టిలో ఉన్న మూడు అతి ముఖ్యమైన ప్రాధాన్యత గల అంశాల్ని ప్రస్తావిస్తున్నా.ఈ catching points కి నేటి సమకాలీన దేశ పరిస్థితుల్లో రాజకీయ ప్రాధాన్యత ఉంది.

1-కాశ్మీర్ లోయ, బారముల్లా నియోజకవర్గం నుండి అబ్దుల్ రషీద్ షేక్ ఎన్నిక!

2-రామజన్మభూమి గల ఫైజాబాద్ (అయోధ్య) నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి.

3-దేశంలో అతి పురాతన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా భావిస్తున్న కాశీ (వారణాసి) నియోజకవర్గంలో మోడీకి ఎదురు దెబ్బ తగలడం!

మొదటిది:--

కాశ్మీర్ 370, 35A ల రద్దును వ్యతిరేకించిన కారణంగా 2019 లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతో సహా వేలమంది జైళ్ల పాలు కావడం తెల్సిందే. ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సహా దశల వారీగా కొందరేసి చొప్పున విడుదల చేస్తూ వచ్చినా, నేటికి అసంఖ్యాకంగా జైళ్లల్లో మగ్గుతున్నారు. వారిలో అతి ముఖ్యమైన ఉద్యమకార్లు ఉపా కేసులో నిర్బంధంలో వున్నారు. వారిలో మరింత ముఖ్యుల్ని కశ్మీర్ జైళ్లల్లో తమ బంధుమిత్రులతో ఇంటర్వ్యూ చేసుకునే అవకాశం లేకుండా డిల్లీ వంటి సుదూర ప్రాంతాల జైళ్లల్లో నిర్బంధించారు. 2019 నుండి ఉపా కేసులో డిల్లీ తీహార్ జైల్లో ఉన్న అబ్దుల్ రషీద్ షేక్ బరాముల్లా నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పై విజయం సాధించడం ఓ అసాధారణ విశేషం!

1989-1990 ల పరిణామాల తర్వాత కాశ్మీర్ లోయలో ఏర్పడ్డ కల్లోల పరిస్థితులు తెల్సిందే. లోయ పట్ల భారత ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్నికల బహిష్కరణ నాటి నుండి ఓ సాధారణ పోరాట రూపంగా మారింది. సరిహద్దు ప్రాంతమైన బరాముల్లా నియోజకవర్గంలో సాపేక్షంగా బహిష్కరణ మోతాదు అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈసారి అత్యధికంగా 59% ఓట్లు పోల్ కావడం విశేషం.

ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ కుటుంబాలు కశ్మీర్ లోయలో రాజకీయ ప్రాబల్యం గలవి. గ్రామ స్థాయి వరకూ కార్యకర్తలతో కూడిన పార్టీలకు వారు నాయకత్వం వహిస్తున్నారు. అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో అబ్దుల్ రషీద్ ఓడించడం ఓ ప్రత్యేక విశేషం!

అబ్దుల్ రషీద్ ని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా మోడీ ప్రభుత్వం అనేక ఆటంకాల్ని సృష్టించింది. జైలు నుండి నామినేషన్ ని దాఖలు చేయనివ్వకుండా అనేక అవరోధాలను సృష్టించింది. అయినా మిణుకుమిణుకుగా మిగిలివున్న న్యాయవ్యవస్థ సాయంతో ఆయన కొడుకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అబ్రార్ రషీద్ షేక్ తీహార్ జైలులో తన తండ్రి నుండి నామినేషన్ ఫారం పై సంతకం చేయించి పోటీలో ఉంచారు. ఇంతకుముందే ఓ అసెంబ్లీ స్థానం నుండి శాసన సభ్యుని గా వున్నా, ఆయన రాజకీయ పరపతి దానివరకే పరిమితం తప్ప లోక్ సభ స్థానంలో లేదు. ఆ కొడుకు మాటల ప్రకారం తన తండ్రి ఎన్నికల్లో గెలుస్తాడనే ఆశతో కాకుండా, జైల్లో మగ్గే చీకటి కోణాన్ని లోకం దృష్టికి తెచ్చే పరిమిత లక్ష్యంతో పోటీకి దించారు. పైగా ఒమర్ అబ్దుల్లా పై విజయం ఊహకు అందని విషయం. కానీ REVENGE OF JAIL WITH VOTE నినాదంతో చేపట్టిన ప్రచార ఉద్యమంలో అనూహ్యంగా ప్రజాదరణ లభించింది. వేల సంఖ్యలో యువత ప్రచారంలో పాల్గొన్నది. సాంప్రదాయంగా ఎన్నికల బహిష్కరణ చేసే ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం పెరగడం విశేషం!

ఇలా జైళ్లల్లో నుండి విజయం సాధించడం దేశంలో కొత్త కాదు. 1952 తొలి ఎన్నికల నుండి 1977 ఎన్నికల వరకూ జరిగాయి. కానీ కాశ్మీర్ లోయ పరిస్థితుల రీత్యా, ముఖ్యంగా ఫాసిస్టు పాలకులు పాలించే కాలంలో ఇదొక అసాధారణ విషయమే. ఇది ఒకవైపు కశ్మీర్ స్వయం ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం సాగించే ఉద్యమానికి ప్రాసంగీకత, ప్రాధాన్యతలు ఉన్నాయని చెప్పడానికి ఇదో చిహ్నం. మరోవైపు ఉపా చట్టం రద్దు కోసం ఉద్యమాన్ని చేపట్టాల్సిన ప్రజాతంత్ర కర్తవ్యానికి గల ప్రాసంగీకతకి కూడా ఇదో చిహ్నం.

ఏది ఏమైనా, రేపటి కొత్త లోక్ సభలో అడుగు పెట్టే 542 మందిలో అబ్దుల్ రషీద్ షేక్ ఒక విలక్షణ హీరో! ఉపా నిర్బంధ చట్టం ఎత్తివేత కోసం సాగించే రేపటి ప్రజాస్వామిక ఉద్యమానికి ఆయనొక రోల్ మోడల్!

రెండవది,

ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లాలూ సింగ్ పై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 55 వేల ఓట్ల అధిక్యతతో గెలుపొందాడు. ఇది రామజన్మ భూమి అయోధ్య కేంద్రంగా గల నియోజకవర్గం కావడం గమనార్హం! ఫైజాబాద్ జిల్లాని 2018 లో అయోధ్య జిల్లాగా యోగి సర్కార్ మార్చిన విషయం తెల్సిందే. వరసగా రెండుసార్లు అత్యధిక మెజార్టీ తో ప్రతిపక్షాల అభ్యర్థుల మీద బీజేపీ తరపున విజయం సాధించిన లాలూ సింగ్ ఈసారి ఓటమి పొందాడు. పైగా యోగి బుల్డోజింగ్ రాజ్యంలో దళిత సామాజిక వర్గానికి చెందిన అవదేశ్ ప్రసాద్ చేతుల్లో లాలూ సింగ్ ఓటమి పొందడం అసాధారణ విశేషం!

దేశ నలుమూలల నుంచి సాధారణ హిందువుల్ని అయోధ్య రామ దర్శనం కోసం ప్రత్యేకంగా తరలించిన సమయంలో అయోధ్యలో హిందువుల ప్రతిస్పందన భిన్నంగా ఉండడం విశేషం! ఆ నియోజకవర్గంలో 80 శాతం పైగా హిందూ జనాభా ఉందని 2011 సెన్సెస్ వెల్లడించడం మన దృష్టిలో ఉంచుకుంటే, దీని ప్రాధాన్యత తేలికగా అర్ధమౌతుంది. సామాన్య హిందువుల అండ లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. తమ అయోధ్యకు చెందిన ఆధ్యాత్మిక రాముణ్ణి మోడీ, యోగి సర్కార్లు రాజకీయ రాముణ్ణి చేయజూస్తుంటే, అసలు అయోధ్యకు చెందిన హిందువులు భిన్నంగా స్పందించడం గమనార్హం!

మూడవది,

శతాబ్దాలుగా పవిత్ర పుణ్య క్షేత్రంగా పిలవబడ్డ కాశీ పట్నం మరోపేరే వారణాసి. అక్కడ ముచ్చటగా మూడోసారి పోటీ చేసిన మోడీకి హిందువుల నుండే తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది. హిందూ పుణ్యక్షేత్ర నియోజకవర్గ హిందూ ప్రజలు మోడీకి షాక్ ఇచ్చారు.

2014 ఎన్నికల్లో 3.71 లక్షల ఓట్లు, 2019 ఎన్నికల్లో 4.79 లక్షల ఓట్లుగా ఉన్న మోడీ అధిక్యత ఈసారి 1.52 లక్షల ఓట్లకే పరిమితమైంది. 2019 తో పోల్చితే 2024లో మోదీ ఆధిక్యత 3.27 లక్షల ఓట్లు తగ్గింది. ఈ నియోజకవర్గ జనాభాలో కూడా హిందువులు 80 శాతం మంది వరకు ఉన్నట్లు సెన్సెస్ చెబుతున్నాయి. ఆ "పవిత్ర హిందూ పుణ్యక్షేత్ర" భక్తజనం కూడా మోడీని మతాతీతంగా వ్యతిరేకించకుండా కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్.. బీజేపీ అభ్యర్థి మోడీకి గట్టి పోటీని ఇవ్వడం సాధ్యం కాదు. ఈ సందర్భంలో మరొమాట చెప్పడం సందర్భోచితంగా ఉంటుందేమో! మోడీ చేత ఈసారి ఎన్నికల ప్రచారంలో అన్యాపదేశంగా అర్బన్ నక్సలైట్‌గా ఆరోపించబడ్డ రాహుల్ గాంధీ అదే యూపీ రాష్ట్రంలోని రాయబరేలీ నియోజకవర్గంలో సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.

హిందుత్వ కార్డు చెలామణి కావడం లేదనడానికి మోడీ వారణాసిలో హిందువుల చేతుల్లో తిన్న ఎదురు దెబ్బ కూడా ఒక నిదర్శనం.

పైన పేర్కొన్న ముఖ్యమైన మూడు క్యాచింగ్ పాయింట్స్ మూడు విలువైన రాజకీయ పాఠాల్ని అందిస్తుంది. ఇవి మూడు రకాల రాజకీయ ధోరణులకే ప్రతిబింబంబంగా ఉన్నాయి. రానున్న కాలంలో ఫాసిజంపై సాగించాల్సిన పోరాటానికి రాజకీయ స్ఫూర్తినిస్తాయి. ఇవి సాధారణ వార్తలుగా కాకుండా, రానున్న కాలంలో దేశ రాజకీయ రంగంలో ఓ వినూత్న అసాధారణ పరిణామాలకు దారి తీసే ఆశాజనక పరిస్థితులకు సంకేతం (సింబల్) గా భావించి తగు ప్రాచుర్యం కల్పిద్దాం.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

5-6-2024

Read More
Next Story