
ముగిసిన పులుల గణన...కవ్వాల్ లో రెండు పులుల సంచారం
పులుల గణన–2026: కవాల్ అభయారణ్యంలో రెండు పులుల కదలికలు
కవాల్ పులుల అభయారణ్యంలో మహారాష్ట్ర పులుల ఉనికి నిర్ధారణ
దేశవ్యాప్తంగా చేపట్టిన పులుల గణన–2026 కార్యక్రమం ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ గణనలో భాగంగా తెలంగాణలోని కవాల్ పులుల అభయారణ్యంలో నిర్వహించిన విస్తృత సర్వేలో రెండు పులుల పాదముద్రలు నమోదు కావడం విశేషంగా మారింది.మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులుల సంచారం కవాల్‌ను దాటి యాదాద్రి, హైదరాబాద్ శివార్ల వరకు విస్తరించడంతో అటవీశాఖ అప్రమత్తమైంది.
ముగిసిన పులుల గణన
దేశవ్యాప్తంగా చేపట్టిన పులుల గణన-2026 కార్యక్రమం ఆదివారం రాత్రి ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కవాల్ పులుల అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు, వాలంటీర్లు పులుల గణన వారం రోజుల పాటు విస్తృతంగా చేశారు. నాలుగు జిల్లాల పరిధిలోని 576 ఫారెస్టు బీట్లలో జరిగిన పులుల గణనలో భాగంగా రెండు పులుల పాదముద్రలను నమోదు చేసినట్లు కవాల్ అభయారణ్యం అటవీశాఖ అధికారి ఎ శంకరన్ ఆదివారం రాత్రి వెల్లడించారు. పులులతోపాటు ఇతర వన్యప్రాణుల డేటాను సంకలనం రేసి విశ్లేషించిన తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరిలో సంచారం
పొరుగున ఉన్న మహారాష్ట్ర అభయారణ్యాల నుంచి అయిదు పులులు కవాల్ అభయారణ్యంలోకి వలస వచ్చినా, వీటిలో మూడు ఇతర ప్రాంతాలకు వెళ్లాయని అధికారులు గుర్తించారు.మహారాష్ట్ర నుంచి పెద్దపల్లి, సిద్దిపేట మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోకి వచ్చి గత అయిదు రోజులుగా సంచరిస్తుందని తేలింది. పులి ఒక పులి హైదరాబాద్ నగర శివార్లలో సంచరిస్తుందని తేలింది. కవాల్ నుంచి వచ్చిన పులి యాదాద్రి భువనగిరి జిల్లా రల్లాజనగావ్ గ్రామంలోని పశువుల పాకలో ఉన్న దూడపై శనివారం రాత్రి దాడి చేసిందని వెల్లడైంది. ఈ పులి తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో రెండు దూడలపై దాడి చేసిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరో పులి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
అడవిలో ట్రైల్ వాక్స్
కొమురం భీం ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లలోని 11 అటవీ రేంజ్ లలోని 244 బీట్లలో రెండు దశల సర్వే ముగిసింది.ట్రాన్సెక్ట్ వాక్ సర్వేలో వాలంటీర్లు మాంసాహార జంతువుల సంఖ్యను లెక్కించారు. మరో మూడు రోజుల పాటు ట్రైల్ వాక్స్ కార్యక్రమంలో భాగంగా శాకాహార జంతువులు, పక్షులను గుర్తించారు. చెన్నూరు, బెల్లంపల్లి, జన్నారం, మంచిర్యాల డివిజన్లలోని 171 బీట్లలో సర్వే సాగింది. నిర్మల్ జిల్లాలో 122 బృందాలు మాంసాహార మరియు శాకాహార జంతువుల జనాభాను అంచనా వేశాయి.
అడవులు కుదించబడుతున్న ఈ కాలంలో పులుల సంచారం మనిషి–వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణకు ప్రతీకగా మారింది. అడవులే పులులకు నిజమైన నివాసమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదేనని ఈ సంఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. పులులు సురక్షితంగా అడవుల్లోకి తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకుంటూనే, గ్రామ ప్రజల భద్రతకూ సమాన ప్రాధాన్యం ఇస్తామని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. అడవులు బతికితేనే పులులు బతుకుతాయన్న సత్యాన్ని ఈ గణన మరోసారి రుజువు చేసింది.
Next Story

