మూడు జిల్లాల్లో పులి సంచారం: 25 రోజుల్లో 15కి పైగా పశువుల మృతి
x
పులి సచారంతో గ్రామాల్లో భయం భయం

మూడు జిల్లాల్లో పులి సంచారం: 25 రోజుల్లో 15కి పైగా పశువుల మృతి

సిద్ధిపేటలో పులి హడల్.. ఒక్కరోజే 7 పశువులపై దాడి


మహారాష్ట్ర అడవుల నుంచి బయలుదేరిన ఓ పులి తెలంగాణ గ్రామాల్లో భయాందోళనలు కలిగిస్తోంది. యాదాద్రి భువనగిరి నుంచి జనగామ మీదుగా సిద్ధిపేటకు చేరిన ఈ పులి, గత 25 రోజులుగా పశువులపై వరుస దాడులతో రైతులను వణికిస్తోంది. రాత్రి అయితే చాలు.. గ్రామాల్లో ప్రజలు తలుపులు మూసుకుంటున్నారు.

మహారాష్ట్ర నుంరి వలస వచ్చి తెలంగాణలోని మూడు జిల్లాల్లో సంచరిస్తూ వరుసగా పశువులపై దాడులు చేస్తూ పులి హడలెత్తిస్తోంది. సిద్ధిపేట జిల్లా గ్రామాల్లోకి వచ్చిన పులి ఒకే రోజు ఏడు పశువులను చంపడం సంచలనం రేపింది. గత 25 రోజులుగా యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో తిరిగిన పులి సిద్ధిపేట జిల్లాలోకి అడుగుపెట్టడంతో మహారాష్ట్రకు తిరిగి వెళుతున్నట్లు అటవీశాఖ అధికారులు భావించారు. అయితే ఈ పులి ఘన్‌పూర్, ఆరేపల్లి గ్రామాల్లో ఏడు పశువులను చంపి సిద్దిపేట జిల్లాలో భయాందోళనలు సృష్టించింది.దీంతో అటవీ శాఖ అధికారులు, ఫూణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందాలు డ్రోన్‌లను ఉపయోగించి పులిని ట్రాక్ చేస్తున్నాయి.

కళేబరం వద్దకు రాని పులి

సాధారణంగా పులి పశువును చంపి వెళ్లాక మళ్లీ దాన్ని తినేందుకు కళేబరం వద్దకు వస్తుంది. కానీ గత సందర్భాలకు భిన్నంగా ఈ పులి జాగ్రత్తగా ప్రవర్తిస్తోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. గత 25 రోజుల్లో చంపిన ఏ కళేబరం వద్దకు పులి తిరిగి రాలేదు. పులి వేటాడిన తర్వాత కళేబరాన్ని అక్కడే వదిలి, తర్వాత దాన్ని తినడానికి తిరిగి వస్తుంది. అయితే, ఆ ప్రదేశం చుట్టూ మనుషుల కదలికలను పసిగట్టి అది వేరే చోటుకు వెళ్లిపోయినట్లు గుర్తించామని అటవీశాఖ అధికారి ఏ శంకరన్ చెప్పారు.

సింగరాయ ప్రాజెక్టు కొండల్లోకి పులి

ఈ పులి సింగరాయ ప్రాజెక్టు సమీపంలోని చిన్న అటవీ ప్రాంతంలోని కొండల్లోకి వెళ్లిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ట్రాకింగ్, రెస్క్యూ బృందాలు కొండల్లో పులిని ట్రాక్ చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించాయి. అయితే దట్టమైన వృక్షసంపద కారణంగా వారు కొండల్లో పులిని గుర్తించలేకపోయారు.పులి సంచారం నేపథ్యంలో సింగరాయ ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామస్థులను అప్రమత్తం చేశారు. యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఆవాసంతోపాటు భూభాగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పులి విఫలయత్నం చేసిందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్ శ్రీపతి వైష్ణవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో అనువైన దట్టమైన అడవి లేక పోవడంతో ఆ పులి తిరిగి తన జన్మస్థలానికి వెళుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పులి గత 25 రోజుల్లో ఈ మూడు జిల్లాల్లో 15కు పైగా పశువులను చంపింది.

పులిని పట్టుకునేందుకు ఆపరేషన్

ఆదివారం 20 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో పులి సంచరించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున పులి నంగునూరు మండలం ఘన్‌పూర్ గ్రామం, కోహెడ మండలం ఆరేపల్లి గ్రామాల గుండా ప్రయాణించింది. ఆయా గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులకు చెందిన ఏడు పశువులను చంపింది.పొలాలకు వెళ్లిన రైతుల ద్వారా ఉదయం పశువుల మరణాలు వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారులు, జంతువులను ట్రాక్ చేసేవారితో పాటు రెస్క్యూ బృందాలు గ్రామాలకు చేరుకుని పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. ఆరేపల్లి గ్రామంలో పశువుల మరణాలతో భయాందోళనకు గురైన గ్రామస్థులు తమ పశువులను గ్రామంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గ్రామాల్లో అలెర్ట్ జారీ

పులి సంచారం నేపథ్యంలో ప్రజలు బహిరంగ కదలికలను పరిమితం చేస్తూ అటవీ శాఖ అలెర్ట్ జారీ చేసింది. జనగాం, యాదాద్రి భువనగిరి , సిద్దిపేట జిల్లాల్లో తిరుగుతున్న పులిని ట్రాక్ చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించింది. పులి విద్యుదాఘాతానికి గురికాకుండా నిరోధించడానికి విద్యుత్ శాఖ రాత్రిపూట వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్లవద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉదయం మాత్రమే పనులకు వెళ్లాలని అటవీశాఖ అధికారులు కోరారు.
పులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో అప్రమత్తత కొనసాగుతోంది. అటవీ శాఖ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.
Read More
Next Story